అర్జునుని చంపిన పుత్రుడు... బభ్రువాహనుడు

 

 

మహాభారతంలో కొన్ని కథలకి విస్తృతమైన ప్రచారం ఉంది. కొంతమంది వీరులకు అనంతమైన ఆదరణ ఉంది. కానీ పరీక్షగా చూస్తే ఆ రంగస్థలం మీదకి అడుగుపెట్టిన ప్రతి పాత్రకీ మంచో, చెడో... తనదైన వ్యక్తిత్వం ఉంది. అలాంటి ఒక పాత్రే బభ్రువాహనుడు.

 

అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి మణిపూర్‌ రాష్ట్రమే ఆనాటి మణిపుర రాజ్యమని ఓ నమ్మకం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవాహనునికి ఒక్కతే కుమార్తె. ఆమే చిత్రాంగద! అర్జునుడు, చిత్రాంగద తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. పెద్దల అనుమతితో వివాహమూ చేసుకున్నారు. కానీ ఆ వివాహానికి ఓ షరతుని పెట్టాడు చిత్రవాహనుడు. తనకు మగసంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడే మణిపురానికి రాజు కావాలన్నదే చిత్రవాహనుడి అభిలాష. అందుకోసం అర్జునుడు తన భార్యాపిల్లలను తన వద్దనే వదిలి వెళ్లాలన్నదే చిత్రవాహనుడి షరతు. ప్రేమవశాన ఉన్న అర్జునుడు ఆ షరతుకి ఒప్పుకోక తప్పలేదు. కొన్నాళ్లకు వారికి ఒక సంతానం కలిగింది. షరతు ప్రకారం అర్జునుడు వారివురినీ వదిలి తనదారిన తాను హస్తినకు ప్రయాణమయ్యాడు.

 

 

ఇటువైపు బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడై మణిపురాన్ని చేపట్టాడు. అటు పాండవులు కురుక్షత్ర సంగ్రామం తరువాత హస్తినాపురాన్ని చేజిక్కించుకున్నారు. రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకున్న పాండవులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అశ్వమేధయాగాన్ని తలపెట్టారు. పాండవులు వదిలే అశ్వాలను ఎవరైతే నిలువరించి యుద్ధానికి సిద్ధపడతారో, వారితో యుద్ధం చేసి తమ పరాక్రమాన్ని చాటుకోవడమే ఈ యాగ లక్ష్యం. అలా పాండవులు వదిలిన అశ్వాలు ఒకో రాజ్యాన్నే దాటుకుంటూ సాగుతున్నాయి, కానీ వాటిని నిలువరించే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. చేసిన ఒకరిద్దరూ అర్జునుడి ధాటికి అనతికాలంలోనే శరణు కోరుతున్నారు. అలా సాగుతున్న అశ్వమేధ యాత్ర చివరకు మణిపురానికి చేరుకుంది.

 

తన తండ్రి మణిపురానికి చేరుకున్నాడన్న విషయం తెలిగానే బభ్రువాహనుడు సాదరంగా ఎదురువచ్చి, తండ్రికి అభివాదం చేసి నిల్చొన్నాడు. కానీ కొడుకు అభిమానాన్ని చేతగానితనంగా భావించి అర్జునుడు ఈసడించుకున్నాడు. తండ్రి ప్రవర్తనకు కారణం తెలియక విచారంలో మునిగిపోయాడు బభ్రువాహనుడు. అదిగో అప్పుడు అతని చెంతకు వచ్చింది ఉలూచి. ఉలూచి అర్జునుడి మరో భార్య. బభ్రువాహనుడికి సవతి తల్లి. ‘నాయనా వీరుడైన నీ తండ్రి ముందు తలవంచినంత మాత్రాన ఆయన మనసు ప్రసన్నం అవుతుందని ఎలా అనుకున్నావు. ఆయన వచ్చింది యాగ కార్యం మీద కదా! అందుకు నువ్వు ఒక వీరునిగానే ఎదురేగాలే కానీ కుమారునిగా కాదు. వెళ్లి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు. తండ్రి అని చూడకుండా యుద్ధం చేసి నీ పరాక్రమాన్ని నిరూపించుకో’ అంటూ ఉపదేశించింది.

 

 

ఉలూచి ఉపదేశంతో బభ్రువాహనుడికి కర్తవ్యం తెలిసొచ్చింది. ఈసారి అస్త్రశస్త్రాలను ధరించి సైన్యసమేతంగా అర్జునుడికి ఎదురేగాడు. ఆయుధాలతో వచ్చిన బభ్రువాహనుడిని చూసిన తరువాత కానీ, అర్జునుడిలో పుత్రోత్సాహం కలుగలేదు. ఇరువురి మధ్యా భీకరమైన పోరు మొదలైంది. బభ్రువాహనుడు సామాన్యమైనవాడు కాదు! అతని తాత, తల్లి అందరూ అతణ్ని పరమ యోధునిగానే మలచారు. అలాంటి బభ్రువాహనుడి బాణ ధాటికి అర్జునుడు సైతం ఆశ్చర్యపోసాగాడు. చివరికి అర్జునుడు ప్రయోగించిన ఓ అస్త్రం బభ్రువాహనుడిని మూర్ఛపోయేలా చేసింది. కానీ అదే సమయంలో బభ్రువాహనుడు వదిలిన ఓ బాణం అర్జునుడి ప్రాణాలనే హరించివేసింది.

 

మూర్ఛ నుంచి తేరుకున్న బభ్రువాహనుడు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని కుమిలిపోయాడు. తనను యుద్ధానికి ప్రోత్సహించినందుకు ఉలూచిని నిందించాడు. నా తండ్రిని తిరిగి బతికించాల్సిన బాధ్యత నీదేనన్నాడు. బభ్రువాహనుడి సమస్యకు ఉలూచి దగ్గర సమాధానం ఉండనే ఉంది. ఆమె దగ్గర ఉన్న మృతసంజీవని మణికి మృతులకు ప్రాణం పోయగల శక్తి ఉంది. ఆ మృతసంజీవని మణిని తల్చుకుని అర్జునుడి శరీరం మీద ఉంచింది ఉలూచి. ఆ స్పర్శకు నిద్ర నుంచి మేల్కొన్నవాడిలాగా అర్జునుడు చావు నుంచి మేల్కొన్నాడు. అయితే అర్జునుడంతటివాడు చచ్చిబతకడానికి ఓ కారణం ఉందని చెప్పొకొచ్చింది ఉలూచి. ‘’కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముని సంహరించాడు కదా! అందుకని భీష్ముని తల్లి గంగాదేవి ‘అర్జునుడు తన కన్న కొడుకు చేతిలోనే హతమవుగాక!’ అంటూ శపించింది. ఆ శాపాన్ని నెరవేర్చేందుకే ఈ ఘట్టమంతా నడిచింది.’’ అంటూ చెప్పుకొచ్చింది ఉలూచి. మొత్తానికి అలా బభ్రువాహనుడి కథ సుఖాంతం అయ్యింది.

 

బభ్రువాహనుడి కథలో ప్రేమ మొదల్కొని యుద్ధం వరకూ ఆసక్తికరమైన మలుపులు ఎన్నో ఉన్నాయి కాబట్టి, రచయితలకు ఇష్టమైన మహాభారత ఘట్టాలలో ఇది ఒకటిగా మిగలిపోయింది. నృత్య రూపకాల నుంచి మొదల్కొని సినిమాల వరకూ బభ్రువాహనుడు ప్రధాన పాత్రగా ఎన్నో రచనలు సాగాయి. వాటిలో నాటకీయత కోసం చిత్రాంగద, బభ్రువాహనుల పాత్రలకు విపరీతమైన మార్పులు చేసిన సందర్భాలూ ఉన్నాయి.


- నిర్జర.


More Purana Patralu - Mythological Stories