ఈ నాలుగు అలవాట్లు సంతోషంగా ఉన్న కుటుంబాలను కూడా దివాలా తీయిస్తాయ్!


గరుడ  పురాణం మరణం తర్వాత జరిగే విషయాల గురించి చెబుతుంది అనుకుంటారు. కానీ మరణం తర్వాత జరిగే విషయాల గురించి మాత్రమే కాకుండా మానవ జీవిత ధర్మం,  మనిషి ప్రవర్తన, ఆచరణ వంటి విషయాలను కూడా వివరంగా చెబుతుంది.  గరుడ పురాణంలోని ఆచారకాండ మానవ జీవనానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వివరిస్తుంది. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే కుటుంబాలు సైతం కనీస జీవనం కోసం  కష్టపడేలా చేసే కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి.  ఈ అలవాట్ల వల్ల ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం కూడా దివాలా తీసే స్థితికి జారిపోతుంది.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

కొన్ని విషయాలను, అలవాట్లను చాలామంది చాలా చిన్నవి, వీటి వల్ల ఇబ్బందులు ఏం ఉంటాయిలే అని అనుకుంటారు.వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆ చిన్న పొరపాట్లు క్రమంగా  ఇంటి శాంతిని, శ్రేయస్సును నాశనం చేస్తాయి. ఎంతో ధనవంతులుగా ఉన్న కుటుంబాలు కూడా పేదరికంలోకి జారిపోయేలా చేస్తాయి.

నిద్ర ..

మొట్టమొదటిది, అత్యంత హానికరమైనది,  ఎంతోమంది పాటించే అలవాటు..  సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం. గరుడ పురాణం ప్రకారం, సూర్యోదయం తర్వాత కూడా పడకపై ఉండేవారి ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదట. ఉదయాన్ని దేవతల సమయంగా భావిస్తారు, ఈ సమయంలో నిద్రపోవడం బద్ధకాన్ని పెంచుతుంది. బద్ధకస్తుడు ఎన్నడూ కష్టపడలేడు, అదృష్టం కూడా వారి వెంట రాదు.. అందువల్ల, ఉదయాన్నే లేచి సానుకూల శక్తితో రోజును ప్రారంభించాలి.

ఆహారం..

ఆహారాన్ని అగౌరవపరచడం, పళ్ళెంలోనే ఆహారాన్ని వదిలివేయడం,  ఆహారాన్ని అవమానించడం  మరో పెద్ద తప్పు. నేటికాలంలో ఎంతో మంది ఆహారాన్ని వృధా చేయడాన్ని  సాధారణ అలవాటుగా, ఇంకా చెప్పాలంటే అదొక ఫ్యాషన్ గా  భావిస్తున్నప్పటికీ, శాస్త్రాలు దానిని ఒక ఘోరమైన పాపంగా పరిగణిస్తాయి. గరుడ పురాణం ప్రకారం ఏ ఇంట్లోనైతే ఆహారం వృధా చేయబడుతుందో, ఆ ఇంటిపై అన్నపూర్ణాదేవి  అసంతృప్తిగా ఉంటుందట.

అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం వడ్డించుకోవడం ఆ తర్వాత  దానిని పారవేయడం పేదరికానికి నేరుగా ఆహ్వానం పలకడమే.  ఇంట్లో శ్రేయస్సు కావాలంటే ఆహారాన్ని గౌరవించడం  నేర్చుకోవాలి.


మురికి బట్టలు..

మూడవ అలవాటు మురికి బట్టలు ధరించడం ,  పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం. చాలా మందికి స్నానం చేయకుండా రోజుల తరబడి అవే బట్టలు వేసుకోవడం లేదా  పడకగదులను చిందరవందరగా ఉంచుకోవడం  వంటి అలవాట్లు ఉంటాయి.

గరుడ పురాణం ప్రకారం పేదరికం ఎల్లప్పుడూ మురికిలోనే ఉంటుంది. శారీరకంగా మానసికంగా శుభ్రంగా లేని వ్యక్తికి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. శుభ్రత లేని ఇంటిలోకి ప్రతికూల శక్తి సులువుగా చేరుతుంది, దానివల్ల కూడబెట్టిన సంపద కూడా అనారోగ్యంపై ఖర్చవుతుంది.

ద్వేషం..
 
నాలుగవ , చివరి అలవాటు  ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం , కారణం లేకుండా కోపగించుకోవడం. ఉదయం, సాయంత్రం అరుపులు, గొడవలతో నిండిన ఇల్లు దేవతల ఆశీర్వాదం పొందలేదట.

గరుడ పురాణం ప్రకారం కఠినమైన మాటలు మాట్లాడేవారు, దురాశపరులు నీళ్లలా ధనాన్ని కోల్పోతారట. కుటుంబంలో ప్రేమ, శాంతిని కాపాడుకోవడం చాలా అవసరం. కుటుంబ సభ్యులు సంతోషంగా కలిసి జీవించలేకపోతే  సంపద రావడానికి ఉన్న అన్ని  మార్గాలు మూసుకునే ఉంటాయట.

                              *రూపశ్రీ.


More Enduku-Emiti