దారుకా వనంలో జ్యోతిర్లింగం వెనుక కథ!


పరమేశ్వరుడి జ్యోతిర్లింగాలలో దారుకా వనంలో వెలసిన నాగేశ్వర లింగం ప్రముఖమైనది. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. 

పూర్వకాలంలో పశ్చిమ సముద్ర తీరంలో దారుకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుకి. ఈ రాక్షసుడు కొన్ని యోజనాల విస్తీర్ణము గల పట్టణాన్ని నిర్మించుకుని, భార్యతో సహా సుఖంగా ఉన్నాడు. సహజమైన రాక్షస బుద్ధితో చుట్టుప్రక్కల గల మానవులందరినీ హింసిస్తున్నాడు. మునీశ్వరులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ముని వాటికలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. హోమగుండాలను ఆర్పివేస్తున్నాడు. యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నాడు. అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా అతనితో పాటు అతని భార్య కూడా లోక కంటకురాలయ్యింది. మునులు ప్రశాంతంగా జీవించటం అసాధ్యమైంది. ఆ రోజులలో 'ఔర్యుడు' అనే మహర్షి సుప్రసిద్ధుడు. 


మునులంతా ఔర్యుని వద్దకుపోయి. దారుకుడు పెట్టే బాధల నుంచి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి మొర విన్న మహర్షి "భూమిపై గల ప్రజలను గాని, మునీశ్వరులను గాని హింసించిన మరుక్షణంలో దారుకుడు సతీ సమేతంగా మరణిస్తాడు" అని శపించాడు.


ఈ విషయం దారుకుడికి తెలిసింది. అప్పుడు ఆ రాక్షసుడు తన తపశ్శక్తితో సముద్రం మీద పట్టణం నిర్మించుకుని అక్కడ ఉంటూ సముద్రయానం చేసేవారిని పట్టి పీడించసాగాడు. ఒకనాడు సముద్రం మీద ఒక ఓడ పోతోంది. అందులో సరుకులు, సంచారాలు, ధనము దండిగా ఉన్నాయి. దారుకుడు ఓడ మీదపడి దోచుకుని ఓడలోని వారందరినీ బందీలుగా చేశాడు. ఓడలో 'సుప్రియుడు' అనే ప్రముఖుడు ఉన్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, సదాచార సంపన్నుడు, పరమ నిష్టాగరిష్టుడు. కారాగారములో కూడా రుద్రాక్షమాలలు, విభూతి ధరించి శివపూజలు, భజనలు చేస్తున్నాడు. భటులు ఈ విషయాన్ని దారుకుడికి నివేదించారు. 


శివపూజలు, భజనలు చేసేవారిని తీవ్రంగా హింసించారు, అందరూ పూజలు, భజనలు మానేశారు. సుప్రియుడు మాత్రం మానలేదు. అతన్ని ఒక చిన్న ఖైదులోకి మార్పించాడు దారుకుడు. అతని దగ్గర పూజా సామగ్రి లేకుండా చేశాడు. అయినా సరే సుప్రియుడు భజనలు చేస్తున్నాడు. ఒకరోజు రాక్షసుడు సుప్రియుని వద్దకు వచ్చి "ఓరీ! ఖైదు చేసినా నీ బుద్ధి మారలేదు. నీకు మరణశిక్ష విధిస్తే గాని ఈ పూజలు మానవా?' అన్నాడు.


 దానికి సుప్రియుడు "దానవేశ్వరా! జీవికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎక్కడివి. తల్లి గర్భమే ఒక నరకము. అది కారాగారము కన్న భయంకరమైనది. ఆ తరువాత.. ఈ భూమండలమే చెరసాలా, అహంకార మమకారాలే సంకెళ్ళు, నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మార్చగలవు. అంతేకాని ఇంకేమి చెయ్యగలవు?" అన్నాడు.


దాంతో దానవుడి కోపం కట్టలు త్రెంచుకుని సుప్రియుడిని చంపబోయాడు. మరుక్షణంలోనే పరమేశ్వరుడు సుప్రియుడికి నాగేశ్వరుని రూపంలో ప్రత్యక్షమై దారుకుని సంహరించి సుప్రియుడిని ఏ వరం కావాలో కోరుకో' అన్నాడు. 


దానికి సుప్రియుడు "దేవదేవా! ఈ దారుకావనములో జ్యోతిర్లింగమై వుండి ప్రజలను రక్షించవలసినది" అని అడిగాడు. అతడి కోరిక ప్రకారము దారుకా వనములో జ్యోతిర్లింగమైనాడు పరమేశ్వరుడు.


                                    ◆నిశ్శబ్ద.


More Shiva