నిష్కామకర్మలు ఎందుకు చెయ్యాలి??

 

【సాంఖ్యయోగౌ పృథగ్నాలాః ప్రవదన్తి న పక్షితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ||

సాంఖ్యము అంటే జ్ఞాన యోగము, యోగము అంటే కర్మయోగము, ఈ రెండు వేరు వేరు అని ఏమీ తెలియని వాళ్లు అంటే భగవద్గీత జ్ఞానం ఏ మాత్రం లేని వాళ్ళు చెబుతుంటారు. పండితులు, తెలిసిన వాళ్లు అలా చెప్పరు. ఈ రెండింటిలోనూ, దేనిని ఆచరించినా, రెండింటినీ ఆచరించిన ఫలితం లభిస్తుంది.】

సాంఖ్యము అంటే జ్ఞానము అంటే నివృత్తి మార్గము. యోగము అంటే కర్మ అంటే ప్రవృత్తి మార్గము. ఈ రెండూ ఒకటే. వేరు వేరు కాదు. ఇందులో ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అనే భేదము లేదు. గృహస్థు, సన్యాసి ఒకటే, వేరు వేరు కాదు. ఇద్దరి మార్గాలు వేరు కానీ లక్ష్యం ఒకటే. కాకపోతే వాటిని అనుసరించే విధానాన్ని బట్టి ఆధార పడి ఉంటుంది. గృహస్థుగా ఉంటూ నిష్కామ కర్మలు ఆచరించే వాళ్లు. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేని వాళ్లు ఉన్నారు. సన్యాసిగా కాషాయాలు కట్టుకొని ఏసీ.రూములలో ఉంటూ, ధనము, బంగారం, పేరు, ప్రతిష్ఠ, కార్లు, సుఖాలు వీటి కోసం వెంపర్లాడే వాళ్లు ఉన్నారు. మానసిక స్థితి, శ్రద్ధ ముఖ్యం కానీ, వేషభాషలు కాదు.

కర్మను అనుసరించి జ్ఞానం ఉంటుంది, కాని ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెబుతారు. కానీ పండితులు కారు. శ్రద్ధతో చెయ్యాలే కానీ రెండు ఒకటే. రెండూ సమాన ఫలితములను ఇస్తాయి. కాకపోతే ఒక మెట్టు తరువాత మరొక మెట్టు ఎక్కినట్టు ముందు నిష్కామ కర్మయోగము చేసి తరువాత జ్ఞానయోగము చేస్తే ఫలితము దక్కుతుంది. ఈ శ్లోకంలో పండితులు అంటే ఆత్మజ్ఞానము కలవారు కాని, కేవలము సాహిత్యము, శాస్త్రపరిజ్ఞానము కలవారు కాదు అని అర్థము. కేవలము శాస్త్రజ్ఞానము కలవారు జ్ఞాన యోగము, కర్మయోగము, వేరు వేరనీ, వేరు వేరుఫలితాలను ఇస్తాయని అంటుంటారు. కాని ఆత్మజ్ఞానము కలవారు అలా అసరు, ఏయోగము అనుసరించినా చివరకు కలిగేది ఆత్మజ్ఞానము మోక్షమార్గము. 

జన్మలోనే ఆత్మజ్ఞానమును పొందిన వారు, లేకపోతే అక్కడిదాకా వచ్చినవారు, ఈ జన్మలో నేరుగా జ్ఞాన యోగం అవలంబించి మోక్షమార్గంలో పయనిస్తారు. క్రితం జన్మనుండి వాసనలు మూటగట్టుకొని వచ్చినవారు, క్రితం జన్మ వాసనలను ఈ జన్మ వాసనలను పోగొట్టు కోవాలంటే నిష్కామ కర్మ చేయడం, రాగద్వేషములను కర్మత్వభావనలను వదలిపెట్టడం, సమస్త కర్మలను ఈశ్వరునికి అర్పించి, స్వార్థం లేకుండా, ఫలితాల మీద ఆసక్తి లేకుండా, చిత్తశుద్ధితో కర్మలు చేయాలి. ఇది మొదటి మెట్టు, ఈ మెట్టు ఎక్కనిది జ్ఞాన యోగం అవలంబించలేరు. కాబట్టి ఏ యోగం అవలంబించినా అహంకారము, కర్మత్వభావన, సంకుచిత భావము, ఉండకూడదు. ప్రాపంచిక విషయములలో లీనమైన జీవుడు పరమాత్మ వైపు మళ్లాలి. దానికి ఏ యోగమైనా ఒకటే, శ్లోకంలో సమ్యక్ అని వాడారు అంటే ఏ యోగము ఆచరించినా దానిని చక్కగా శ్రద్ధతో ధృఢంగా ఆచరించాలి అని అర్థం.

సులువుగా అర్థమయ్యేట్టు చెప్పుకుంటే జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలు చేయరు. కేవలం సమాజ శ్రేయస్సు కొరకే కర్మలు చేస్తారు. దానికి ఎలాంటి పలితాన్ని కోరరు, ఈ ప్రపంచం అంతా భగవంతుని స్వరూపము అని భావించి కర్మలు చేస్తారు. ఇదే జ్ఞానము. కాబట్టి ఆచరించేది జ్ఞానయోగమైనా, కర్మయోగమైనా అది పరిపక్వత చెందాలి. అప్పుడు కర్మలు చేసినా చేయనట్టే. అదే కర్మసన్యాసము అంటే కర్మలను పక్కనబెట్టడం, రెండింటి ఫలితం ఒక్కటే స్వార్ధం లేకుండా చేయడం.  అలా కాకుండా ఇవి రెండు వేరు వేరనే వారికి యోగం కూడా పరిపక్వత చెందలేదు అని అర్థం. 

కొందరు తాను నమ్మిందే యోగం వేరేవన్నీ యోగములు కావు అని ప్రవచిస్తుంటారు. అది తప్పు. ఏ మార్గం అవలంబించినా అది మోక్షమునకు దారితీసేదే అని తెలుసుకోవాలి. అది మంచిది, ఇది చెడ్డది, అని అనడం సరికాదు, నదీనాం సాగరో గచ్ఛతి అనేసూక్తి ప్రకారము నదులన్నీ  ఎక్కడెక్కడో ప్రయాణం చేసినా చివరకు సముద్రాన్ని చేరినట్టు. ఏ యోగము అవలంబించినా తుదకు చేరుకొనేది మోక్షమార్గమునకే అనే జ్ఞానం కలిగేంతవరకు ఈ భేదబుద్ధి మానవులలో పోదు, అది ఉన్నంత వరకు జ్ఞానం రాదు. అది రావాలంటే నిష్కామకర్మ ఒకటే మార్గము,

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories