స్థిరమైన జ్ఞానాన్ని కలిగించేది??

 

ప్రస్తుత కాలంలో మనిషి చేస్తున్న పెద్ద తప్పు మానసిక, భావోద్వేగ పరమైన విషయాలలో ఒకరిమీద ఆధారపడటం. ఈ విషయాన్ని ఎప్పుడో ఆ శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో ప్రస్తావిస్తూ కింది విధంగా చెబుతాడు

【యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్।

నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా!. 

దేనిమీదా, ఎవరిమీదా ఎక్కువగా మమతానురాగములు లేని వాడు, శుభమును, అశు భమును సమానంగా చూచేవాడు, ఒకరిని అభినందించడం, మరొకరిని ద్వేషించడం చేయనివాడు, అటువంటి వానిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై ఉంటుంది.】

ఈ శ్లోకంలో యః అని వాడారు. యః అంటే ఎవరైతే అని అర్థం. అంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఒకరి సొత్తుకావు. ఆడవారు, మగవారు, ఉన్నత కులస్థులు, నీచకులస్థులు ఎవరైనా స్థిత ప్రజ్ఞుని లక్షణములు కలిగి ఉండవచ్చు. స్థితప్రజ్ఞుడు ఎవరైనా ప్రస్తుత  జన్మలో జ్ఞానం కలిగి ఉండవచ్చు. కాని ఇంతకు ముందు జన్మల వాసనలు అంటే గత యన్మల తాలూకూ స్వభావాలు అతనిని అంటిపెట్టుకొని ఉంటాయి. వాటి ప్రభావం వల్ల స్థితప్రజ్ఞుని మనసులో ప్రాపంచిక విషయముల మీద అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాల మీద  అభిమానము, స్నేహము, సంగము కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత జన్మలో అతని బుద్ధి స్థిరంగా ఉండటం వలన, అటువంటి ప్రలోభాలకు లోనుకాడు. స్థిరంగా, నిశ్చలంగా ఉంటాడు. అలా నిశ్చలంగా ఉండటమే స్థితప్రజ్ఞత.  అన్ని విషయాలలోనూ నిశ్చలంగా  ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. దీనికి వయసు బేధం మరియు లింగభేదం ఉందదు. 

శుభం కలిగినా అశుభం కలిగినా అతడు చలించడు. అతడు ఎవరినీ ద్వేషించడు. అలాగని ఎవరినీ పూజించడు. అందరినీ సమానంగా చూస్తాడు, ధనిక, పేద, కుల, మత బేధాలు ఏవీ అతని దృష్టిలో ఉండవు. ఎందుకంటే అతని బుద్ధి, ప్రజ్ఞ ఈ జన్మలో నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాదు. ఈ శ్లోకంలో అభిస్నేహము అనే పదం ఉంది.  స్నేహము అంటే ఈ సమాజానికి తెలియంది కాదు,  అభిస్నేహము అంటే గాఢమైన స్నేహము అని అర్థం.  మనం అందరితో స్నేహంగా ఉన్నా, మనకు ఇష్టమైన కొంతమందితో మాత్రమే ఏదైనా మాట్లాడగలిగే చనువు, ధైర్యం కలిగి ఉంటాము. కొంత మందితో అయితే, అతడు లేకపోతే నేను బతకలేను అనే విధంగా ఉంటాము. మరి కొంత మందితో అంటీ ముట్టనట్టు ఉంటాము. కాని స్థితప్రజ్ఞుడు అందరినీ ఇష్టపడతాడు. కాని ఎవరూ లేకపోయినా ఏమీ అనుకోడు. 

ఎందుకంటే అతడు ఎవరి మీదా ఆధారపడి లేడు. మనం ఇతరులతో స్నేహం చేస్తున్నాము అంటే వారి స్నేహం కోసం వారి మీద ఆధారపడుతున్నాము అని అర్థం. అంటే ఇక్కడ ఆశించడం ప్రస్ఫుటంగా  కనిపిస్తుంది. మనం ఒకరిని ప్రేమించినా, ఒకరితో స్నేహం చేసినా, కనీసం ఒకరితో కాస్త చనువుగా మాట్లాడినా వాళ్ళు కూడా మనల్ని అలాగే చూడాలి అనుకుంటాం. ఒకవేళ అవతలి వాళ్ళు అలా మనల్ని చూడకపోతే వాళ్ళను ద్వేషించడమో లేదా బాధపడటమో చేస్తాం. కానీ  స్థితప్రజ్ఞుడు అయిన వాడు అందరితో స్నేహంగా ఉంటాడు, అందరినీ చక్కగా పలకరిస్తాడు, తిరిగి అవతలి వాళ్ళు ఎలా పలకరిస్తారు అనేది మాత్రం పట్టించుకోడు. 

అంటే మానసిక భావోద్వేగాల పరంగా ఎదుటివాళ్ళ మీద ఆధారపడటం కానీ, ఆశించడం కానీ స్థితప్రజ్ఞుడు చేయడు.  ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడు. అనుకూలము ప్రతికూలము ఏది వచ్చినా సుఖము, దుఃఖము పొందడు. అన్నిటినీ సమంగా చూస్తాడు. దేనికీ అనవసరంగా స్పందించడు. అనవసరమైన పనులను చేయడు. అవసరమైన పనులనే చేస్తాడు. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు. ఏ విధమైన వికారములకు లోను కాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ, జ్ఞానము స్థిరంగా ఉంటుంది.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories