బమ్మెర పోతన

 

పోతన తెలుగు గడ్డ మీద నడయాడి 500 ఏళ్లకు పైనే గడిచిపోయింది. అయినా ఆంధ్రుల చరిత్రలో పోతనది సుస్థిర స్థానం. భక్తి సాహిత్యంలో పోతనది పోత పోసిన ప్రస్థానం. బమ్మెర పోతన పుట్టిన ఊరు ఏది అన్న విషయమై కొన్న భిన్న వాదాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రస్తుత తెలంగాణలోనే జన్మించారన్నది చాలామంది అభిప్రాయం. పోతన గురించి తెలిసిందే కొంతే అయినా, ఆ కొంతే అటు భక్తులకీ... ఇటు రచయితలకీ మార్గదర్శనంగా నిలిచేంత ఉన్నతమైనది.

 

పోతన 15 శతాబ్దంలో వరంగల్లుకు కొద్ది దూరంలో ఉన్న బమ్మెర అనే గ్రామంలో జీవించాడని అంటారు. పోతన ఎలాంటి విద్యాభ్యాసం లేకున్నా సరస్వతీ కటాక్షంతోనే పద్యాలు రాయగల నేర్పుని సాధించాడు. అందుకనే ఆయనను సహజకవి అంటారు. యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దంకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు.

 

వీరభద్ర విజయం అణువణువునా శివభక్తితో నిండిన కావ్యం. ఇప్పుడంటే శివకేశవులు ఒక్కరే అన్న భావన ఉన్నది కానీ, ఒకప్పుడు రెండు మతాలు కుమ్ములాడుకున్నంత తీవ్రంగా శివ, విష్ణు భక్తుల మధ్య కొట్లాటలు సాగేవి. అలాంటి కాలంలో శివభక్తుడైన పోతన, విష్ణు సంబంధమైన భాగవతాన్ని ఆంధ్రీకరించడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఒకనాడు పోతన నదీతీరాన స్నానమాచరిస్తుండగా, సాక్షాత్తూ ఆ రాముడే ఆయనకు దర్శనమిచ్చి భాగవతాన్ని ఆంధ్రీకరించమని చెప్పాడంటారు. ప్రేరణ ఏదైనా కానీ, పోతన భాగవతాన్ని అచిరకాలంలోనే అద్భుతంగా ఆంధ్రీకరించారు. నాస్తికులైనా, ఆస్తికులైనా పోతన భాగవతంలోని అక్షర చాతుర్యానికి ముగ్ధులవని వారు ఉండరు.

 

పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. అలాగే గజేంద్ర మోక్ష ఘట్టంలో ‘సిరికిం జెప్పడు’ అనే పద్యం ఉంది. విష్ణువు తన భక్తుడైన గజేంద్రుని రక్షించేందుకు ఉన్నఫలంగా బయల్దేరాడు అన్న అర్థం ఈ పద్యంలో స్ఫురిస్తుంది. ఈ పద్యాన్ని చదివి- ‘యుద్ధానికి బయల్దేరేవాడు అలా ఎలా ఉన్నఫలంగా బయల్దేరతాడయ్యా’ అంటూ పోతనని, శ్రీనాధుడు అపహాస్యం చేశాడట. ఈ విషయం మీద వాదన జరుగుతుండగానే శ్రీనాధునికి తన పిల్లవాడు బావిలో పడిపోయాడని ఎవ్వరో చెప్పారు. వెంటనే శ్రీనాధుడు హడావుడిగా బావి దగ్గరకు పరుగులెత్తాడు. పిల్లవాడు బావిలో పడలేదనీ, ఆప్తులైనవారు ఆపదలో ఉన్నారని తెలిసినప్పుడు కంగారుపడి పరుగులెత్తడం సహజమనీ... శ్రీనాధునికి తెలియచేసేందుకే ఈ నాటకం ఆడామనీ పోతన శిష్యులు చెబుతారు.

 

పోతన జీవితంలో ఇలాంటి రసవత్తర ఘట్టాలకు లోటు లేదు. కాల్పనిక సాహిత్యంలో పోతన, శ్రీనాధుడు ఇరువురూ కూడా బావాబావమరదులు అన్న అల్లికలు ఉన్నాయి. నిరంతరం రాజాశ్రయాన్ని నమ్ముకుని చివరికి కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన శ్రీనాధునికీ, నిత్యం పేదరికంలో ఉంటూనే ఆత్మతృప్తితో జీవించిన పోతనకీ మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల.... రచయితలు వారిరువురినీ ఒక చోటకి చేర్చి కావల్సినంత నాటకీయతను సృష్టించారు. కానీ వీరిరువురికీ అసలు సంబంధమే లేదనీ, సమకాలికులు కూడా కారని చరిత్రకారుల అభిప్రాయం.

 

పోతన గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పదగిన ఒక అంశం ఆయన సేద్యం. పోతన ఒకవైపు నాగలి పట్టి పొలాన్ని దున్నుతూనే, మరోవైపు సాహిత్య రంగంలో భాగవత రత్నాలను పండించాడు. ఒకవైపు శివుని ఆరాధిస్తూనే, మరోవైపు విష్ణులీలలను భాగవతం ద్వారా ప్రకటించాడు. కటిక దారిద్ర్యాన్ని అనుభవించినా కూడా తన భాగవతాన్ని సింగభూపాల రాజుకి అంకింతమిచ్చేందుకు ఒప్పుకోలేదు. బహుశా అందుకేనేమో పోతన భాగవత పద్యాలు కూడా అంతే నిర్మలంగా తోస్తాయి. అందులోని గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు, ‘ఇందు గలడందు లేడను సందేహంబు వలదు’ వంటి పద్యాలు... కొన్ని వందల ఏళ్లపాటు పండితపామరులన్న బేధం లేకుండా, కులాలకు అతీతంగా, ధనికపేద రహితంగా ప్రజల నోళ్లలో నానాయి. ఇంగ్లీషు చదువులు వచ్చేంతవరకూ, పోతన భాగవతాన్ని ఓ గొప్ప డిగ్రీగా భావించేవారు. ఇప్పటికీ మనం భాగవతానికి దూరమయ్యామే కానీ, భాగవతంలో ఉన్న మాధుర్యానికి ఏ లోటూ రాలేదు. కావాలంటే పోతన భాగవతంలోని ఏ పద్యాన్నైనా చదివి చూడండి.

- నిర్జర.

 


More Enduku-Emiti