ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తేనే అమ్మవారి కృప లభిస్తుంది!!
.webp)
శరత్కాలం నిర్మలత్వానికీ, శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు. నిర్మలమైన ప్రేమ, కరుణను కురిపించే చల్లని మనస్సు మాతృమూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల, ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలమంటే జగన్మాతకు అత్యంత ప్రీతి. శరత్కాలంలో విశేషంగా ఆ విశ్వేశ్వరిని తొమ్మిది రోజుల పాటు ఆరాధించి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం మన సంప్రదాయం. 'నవ' సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. 'దేవీ కవచం'లో వర్ణించిన
ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ॥ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథా | సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్ ॥
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ॥
'శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి' .. నవదుర్గలను అర్చించి ఈ పరిపూర్ణత్వాన్ని సాధించుకోవాలన్నది నవరాత్రి ఉత్సవాల విశిష్టత.
దుర్లభమైన మానవజన్మను సార్ధకం చేసుకోవాలంటే అశాశ్వతమైన ఈ దేహంలో అంతర్గతంగా ఉన్న శాశ్వతమైన ఆత్మశక్తిని గ్రహించాలి. జనన మరణాతీత స్థితిని చేరుకోవాలి. అప్పుడే మానవజన్మకు పరిపూర్ణత్వం సిద్ధించినట్లు! అయితే పరిపూర్ణతను సాధించడానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అవసరం. 'యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా' - సర్వజీవుల్లో శక్తిగా నెలకొని ఉన్న ఆ సర్వేశ్వరిని ఆరాధిస్తే మానవ జన్మ పరిపూర్ణత్వానికి కావలసిన సర్వశక్తులూ సమకూరుతాయి. అమ్మ ప్రేమామృత ధారలతో అమరత్వం సిద్ధిస్తుంది. మోక్షం ప్రాప్తిస్తుంది.
మోక్షప్రాప్తికి సాధనం ఈ మానవ దేహం. అనిత్యం, అశాశ్వతమైన ఈ సాధనంతోనే నిత్యం, శాశ్వతమైన బ్రహ్మపథాన్ని పొందడం సాధ్యమవుతుంది. అలాంటి అత్యున్నతమైన, అత్యంత దుర్లభమైన ఈ మానవ దేహాన్ని ప్రసాదించిన 'మాతృమూర్తి'యే ఇలలో వెలసిన ఆ జగన్మాత ప్రతిరూపం. 'యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా' అని దుర్గాసప్తశతి విశదపరుస్తోంది. ఈ సృష్టిలో తల్లే ప్రత్యక్ష దైవం. 'మాతృదేవో భవ' అని వేదం తల్లికి అగ్రస్థానాన్నిచ్చింది. జగన్మాత విశిష్ట లక్షణాలైన నిర్మలమైన ప్రేమ, చల్లని మనస్సు మాతృమూర్తిలో సహజగుణాలు.
దేహంలో ఏ అంగానికి ఆపద వాటిల్లినా మొట్టమొదట కనురెప్ప చలిస్తుంది. అలాగే పసిబిడ్డకు ఏ కష్టం కలిగినా ముందుగా తల్లడిల్లేది. మాతృహృదయమే! బిడ్డ యోగక్షేమాల్నే సదా కాంక్షించే 'కరుణమూర్తి' బిడ్డ సంరక్షణ కోసం తన ప్రాణాలు సైతం త్యజించేందుకు వెనుకాడని 'త్యాగమూర్తి'; తన కష్టాలను భరిస్తూ బిడ్డకు సుఖాన్ని పంచే 'ప్రేమమూర్తి'; మోక్షసాధనకు ఈ దేహాన్ని ప్రసాదించిన 'దివ్యమూర్తి'. ఈ దైవీగుణాలతో ఇలలో వెలసిన దైవం 'మాతృమూర్తి'.
మనమెంత భక్తిప్రపత్తులతో నవదుర్గలను ఆరాధించి నప్పటికీ, నవమాసాలూ భరించిన మాతృమూర్తిని నిరాదరిస్తే ఆ జగన్మాత కృపకు పాత్రులం కాలేం. ఆదిపరాశక్తి అనంత ప్రేమను పొందాలంటే కన్నతల్లిని ఆనందింప జేయగలగాలి. తల్లి ఆశీర్వాదమనే తాళపు చెవి లేనిదే ఆ జగన్మాత కూడా మోక్షద్వారాలను తెరవదు. కాబట్టి మానవజన్మ పరిపూర్ణతకు మాతృమూర్తి దీవెనలు అత్యంత ముఖ్యం.
*నిశ్శబ్ద.



