వింధ్య పర్వతం – అగస్త్య మహాముని

(Vindhya Mountain – Agashtya Maharshi)

 

మేరునగం చాలా ఎత్తయిన పర్వతం. అది చూసిన వింధ్యకు అక్కసు కలిగింది. మేరు పర్వతంతో పోటీ పడుతూ ఆకాశాన్ని తాకేలా పెరగసాగింది. వింధ్య పర్వతం ఈ వరసన పెరగడంతో ప్రజలకు అటువారు ఇటు రావాలన్నా, ఇటువారు అటు వెళ్ళాలన్నా కష్టమవ సాగింది. వింధ్య పర్వతం సూర్యుని కాంతిని కూడా అడ్డుకోసాగింది. దాంతో ప్రజలకు సమస్యగా పరిణమించింది.

 

ఒక సందర్భంలో నారద మహర్షి కాశీ నగరాన్ని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ''మేరు పర్వతం ఉన్నతమైందా, నేను ఉన్నతమైందాన్నా..'' అని అడిగింది వింధ్య పర్వతం.

 

నారదుడు చిరునవ్వు నవ్వి, ఎంతో శాంతంగా ''ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఒకరిని అధికులని చేసి, మరొకరిని తగ్గించడం అనేది సబబు కాదు. అసలు ఎవరూ కూడా ఇంకొకరితో పోల్చుకోకూడదు..'' అంటూ చెప్పాడు. కానీ ఆ సమాధానం వింధ్య నగానికి నచ్చలేదు. ''నువ్వే గొప్పదానివి'' అంటే సంతోషించేది.

 

తాను ఇంకా ఉన్నతంగా ఎదిగితే తప్ప మేరువును మించిన మహా పర్వతం అని గుర్తించరు, కీర్తించరు అనుకుంది. వెంటనే మరింత ఎత్తు ఎదిగింది. దాంతో సూర్య కిరణాలు సోకడం కష్టమైంది. లోకం అంధకారంలో మునిగింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజల మనుగడకే ముప్పు వస్తుంది.

 

ఈ సంగతి గ్రహించిన బ్రహ్మ ''అగస్త్య మహర్షికి ఈ సంగతి తెలియజేయండి.. ఆ మునీశ్వరుడు వింధ్య గర్వభంగం చేసి ప్రజలకు మేలు చేకూరుస్తాడు..'' అని దేవతలకు సూచించాడు.

 

అగస్త్య మహాముని మహా మహిమాన్వితమైన పుణ్య క్షేత్రం అయిన కాశీ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.

 

బ్రహ్మ చెప్పినట్లుగానే దేవతలు ఆ విషయం అగస్త్య ముని చెవిన వేశారు. అగస్త్యుడు బాగా ఆలోచించాడు. తనకెంతో ప్రియమైన కాశీ నగరాన్ని విడిచివెళ్ళక తప్పదు అనుకున్నాడు.

 

భార్య లోపాముద్రను వెంటబెట్టుకుని వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యకు ఆ మహాముని అంటే అంతులేని గౌరవం. ఆయనకు శిరసు వంచి నమస్కరించింది.

 

అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని ఆశీర్వదించి ''మేము పనిమీద అవతలివైపుకు వెళ్తున్నాం.. మేం తిరిగి వచ్చేవరకూ నువ్వు ఇలాగే ఉండు.. లేకుంటే కొండ ఎక్కి దిగడం కష్టమౌతుంది.. ముఖ్యంగా నా భార్యకి మరీ కష్టం..'' అన్నాడు.

 

''అయ్యో, మహర్షీ, మీరు అంతగా చెప్పాలా? మీరు తిరిగి వచ్చేవరకూ నేను ఇలాగే ఉంటాను.. నిశ్చింతగా అవతలి వైపుకు వెళ్ళిరండి..'' అంది వింధ్య పర్వతం.

 

అలా వెళ్ళిన అగస్త్యుడు మరి ఎన్నడూ తిరిగి రాలేదు. కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనిపించినా ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకుని ఇటువైపుకు రాలేదు. వింధ్య తన మాట నిలబెట్టుకుంది. వంచిన తల ఎత్తలేదు. అలా వింధ్య పర్వతాన్ని పెరగకుండా చేశాడు అగస్త్యుడు.

 

Agashtya Maharshi, Agashtya Maharshi and Vindhya Parvatam, Agashtya Maharshi and Vindhya Mountain, hindu mythological character Agasthya Muni, Mythological stories and characters


More Purana Patralu - Mythological Stories