తాతా ధిత్తై తరిగిణతోం 18

తాతా ధిత్తై తరిగిణతోం 18

తాతా ధిత్తై తరిగిణతోం 18

జీడిగుంట రామచంద్రమూర్తి

 

జీడిగుంట రామచంద్రమూర్తి

ఆ పెయింటింగ్ వైపు ఇప్పుడు నిశితంగా చూశాడు శ్రీరామ్.

అందులో ఒకే ఒక కెరటం, ఉవ్వెత్తున ఎగిసిపడుతునట్టు కనిపిస్తోంది. తర్వాతా శ్రీరామ్ ని పక్కనే వున్న మరో గదిలోకి తీసుకెళ్ళాడు...ఆ గది కూడా చాలా అందంగా వుంది.

"ఇది మా అశ్విని బెడ్ రూమ్ !" చెప్పాడు.

శ్రీరామ్ కి ఎందుకో ఆ గదిని మరింత పరిశీలనగా చూడలానిపించింది. అలా చూస్తున్న అతనికళ్ళు ఒక్కచోటనే రెప్ప వాల్చకుండా అలాగే నిల్చిపోయాయి. ఆ నిల్చిపోయిన

ప్రదేశంలో ఓ డ్రాయింగ్ టేబుల్ ఉంది. దానిమీద నాలుగైదు పుస్తకాలూ, ఒక ''టేబుల్ ల్యాంపూ'' వున్నాయి. 'ల్యాంప్' పక్కనే ఓ ఫోటో ఫ్రేమ్. అందులో చేత్తో గీసిన 'కెరికేచర్'

కనిపిస్తోంది.

''ఏమిటీ అలా చూస్తున్నావ్?" అతని చూపుల్ని అడ్డుకుంటూ అడిగింది అశ్విని.

శ్రీరామ్ జవాబు చెప్పలేదు. ఆమెవైపు తదేకంగా చూశాడు ఆ చూపుల్లో ఇదివరకటి నిరసనభావం లేదు ఆరాధనా భావం చోటు చేసుకుంది....

"నువ్ క్లాస్ రూంలో' శ్రద్ధగా పాఠం వింటూ కూర్చున్నప్పుడు నేను నిన్నే శ్రద్ధగా చూస్తూ ఆ బొమ్మగీసాను...అందులో నీ పోలికలున్నాయంటావా?" అడిగిందామె.

ఇప్పుడు కూడా అతను మాట్లాడలేదు..అతని కళ్ళు నెమ్మదిగా చెమ్మగిల్లుతున్నాయి.

ఇంతలో విష్ణుమూర్తి చెప్పాడు. 'హార్టు' ను స్పందింపచేసే దృశ్యాల్ని ఇలా 'ఆర్ట్' పేపర్లో భద్రపరచుకుంటూంటుంది."

కృతజ్ఞతాపూర్వకంగా ఆమెవైపు చూశాడు శ్రీరామ్. నీటిపొర అడ్డంపడింది. అతని కళ్లకు ఆమెరూపం అస్పష్టంగా కనిపించింది.

"ఇదిగో ఈ పెయింటింగ్ చూశావా?" పక్కనే గోడకు తగిలించివున్న మరో 'ఆయిల్ పెయింటింగ్ ను చూపిస్తూ అన్నాడు విష్ణుమూర్తి.

అదో చిన్న పిచ్చుక గూడు. కళ్ళు తెరవని ఎర్రని పసిగుడ్డుకి ముక్కుతో ఆహారాన్ని అందిస్తోంది పిచ్చుక. ఆ పెయింటింగ్ కింద కూడా ఓ కొటేషన్ రాసివుంది.

"పిచ్చుక గూడులో సైతం స్వర్గముంటుంది."

పిడికెడు గుండెలోనైనా ఆకాశమంత ప్రేమ వుంటుంది."

"అది మన స్వంత కవిత్వం. ఎలా వుందంటావ్?. అఫ్కోర్స్...పెయింటింగ్ మాత్రం మా బేబీయే తీసింది. సరస్వత్తోడు తలపై చేయి వేసుకుంటూ చెప్పాడాయన.

"సరస్వత్తోడుగా ఈ పెయింటింగ్ నాకెంతో నచ్చింది." శ్రీరామ్ కూడా ఆయన్ని అనుకరిస్తూ అన్నాడు.

అశ్విని కళ్ళు ఆనందంతో మెరిశాయి.

తర్వాత ముగ్గురూ ఇంకో గదిలోకి నడిచారు...దాన్నీ...దాని పక్కనేవున్న మరో విశాలమైన హాలుని చూపిస్తూ చెప్పాడు విష్ణుమూర్తి. "ఇది గెస్ట్ రూమ్. అది విజిటర్స్ లాంజ్."

ఆ లాంజ్ లో గోడలకు అమర్చిన రెండు పెద్ద 'పెయింటింగులు' శ్రీరామ్ ని విశేషంగా ఆకర్షించాయి.

ఒక దాంట్లో ప్రత్యేకించి బొమ్మ ఏదీలేదు. ఓ మూల చిన్న సిగరెట్టు కాలుతోంది. పొడవుగా దాని ముందు కొడిగట్టినుసిలోంచి నల్లని పొగ భయంకర భూతంలా తక్కిన ఫ్రేమంతా

వ్యాపించి వుంది.

ఇక రెండో పెయింటింగ్ లో 'మదర్ థెరీసా. చెదిరిన జుట్టుతో, చిరిగినా గౌనులో వున్న నాలుగేళ్ళ పాప నుదిటి మీద ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం. దాని కింద రెండు వాక్యాలు

రాసి వున్నాయి.

"ప్రేమవుంటే చాలు మెండుగా
డబ్బుఎంత వుండీ ఎందుకు దండగ."

ఆ రెండు వాక్యాల్నీ పైకి చదివిన శ్రీరామ్ తో చెప్పాడు విష్ణుమూర్తి.

"ఆ వాక్యాలు మా బేబీ రాసింది కానీ 'సిగరెట్ పెయింటింగ్' పక్కనున్న కొటేషన్ నేను చెప్పాను. ఓసారెపుడో ఓ ఇంగ్లీషు పుస్తకంలో చదివాన్లే!" అంటూ దాని ముందుకు నడిచాడు.

"నథింగ్ కెన్ క్యూర్ స్మోకింగ్....ఓన్లీ కేన్సర్.
'థాంక్స్ ఫర్ నాట్ స్మోకింగ్.'

ఆ వాక్యాల్ని మనసులోనే చదువుకుంటున్న శ్రీరామ్ భుజం మీద చేయివేసి అడిగాడాయన. "నువ్ స్మోక్ చేస్తావా?"

ఉలిక్కిపడి చూశాడు శ్రీరామ్ "నేనా" అమ్మో మా నాన్నగారు...అబ్బే...ఛస్తే చేయనండి."

తడబడుతూ చెప్తున్న శ్రీరామ్ అవస్థ గమనించి గలగలా నవ్వేసింది అశ్విని.

(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)