Taataadhitai Tadigibatom - 14

తాతా ధిత్తై తరిగిణతోం - 14

జీడిగుంట రామచంద్రమూర్తి

"అంతేకాదు! చుట్టుపక్కల గ్రామాల క్కూడా మనం వారానికోసారి వెళ్ళి అక్కడ ఈ విషయమై మీటింగులు పెట్టాలి అక్కడ కూడా మన సంఘం శాఖల్ని ఏర్పాటు చెయ్యాలి...అక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలి.

మనం చేసే పనులగురించీ సాధించిన విజయాల గురించీ ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లకు సమాచారం పంపిద్దాం...అలా ఒకటి రెండు సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం ఊపందుకుని అప్పుడెప్పుడో సారా వ్యతిరేక ఉద్యమం విజయాన్ని సాధించినట్టుగా మన ఉద్యమానికీ, మన సంఘానికీ మంచి గుర్తింపు లభిస్తుంది...మన గ్రామం కూడా ఆదర్శగ్రామంగా నిలుస్తుంది!" రెండో పెద్దమనిషి కాస్తంత ఆవేశంగా ఉపన్యాస ధోరణిలో ప్రశంగించాడు.

వాళ్లు ఆలోచనల్నీ, ఆవేశాన్నీ అర్థం చేసుకున్నాడు వీరభద్రం...వాళ్లు చెప్పినట్లు చేస్తే త్వరలోనే వరకట్న నిషేధం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగి క్రమేపీ ఆ దురాచారం దూరమై పోగలదన్న నమ్మకం అతనిలో కలిగింది ఒక నిర్ణయానికి వచ్చాడు.

"మీరు చెప్పింది సబబుగానే ఉంది. ఈ విధంగా మన గ్రామంలో ఒక సంఘాన్ని స్థాపించటం వల్ల తప్పక మన గ్రామం చరిత్ర ప్రసిద్ధిపొందుతుంది." అన్నాడు.

ఇప్పుడు అక్కడ కూర్చున్న నలుగురిలోనూ ఉత్సాహం కనిపించింది. "మరో చిన్న విన్నపం" అన్నాడు మొదటి వ్యక్తి. ఏమిటన్నట్లు చూశాడు వీరభద్రం.

"ఈ సంఘానికీ మీరే అధ్యక్షులుగా వుండి మమ్మల్ని ముందుకి నడిపించాలి!" చెప్పాడతను వెంటనే.

"అవునవును మాస్టారూ...మీరే వుండాలి. ఊరి ప్రజలందరికి మీ పట్ల ప్రేమాభిమానాలతో పాటు భయభక్తులు కూడా ఉన్నాయి. కనుక ఆ పదవిలో మీరుండటమే సమంజసంగా వుంటుంది." వెంటనే రెండోమనిషి బలపరిచాడు.

"పోతే ఈ అప్పారావుగారు సంఘానికీ కార్యదర్శిగా వుంటారు." మూడోవ్యక్తిని చూపిస్తూ చెప్పాడు మొదటి పెద్దమనిషి....

"మంచిది...అట్లే కానివ్వండి. మాకు సమ్మతమే!" వీరభద్రం చూపుడువేలితో మీసాలు సరిచేసుకుంటూ తన అంగీకారాన్ని తెలియచేశాడు.

అంతలో నారాయణ గ్లాసుల్తో కాఫీ తెచ్చి అందరికీ అందించాడు. అప్పారావు ఓ గ్లాసు అందుకుని కాఫీ ఓ గుటక వేసి చెప్పాడు ముఖ్యంగా పెళ్ళీడు కలిగిన తల్లితండ్రులనందర్నీ సంఘంలో సభ్య్లులుగా చేర్చుకోవాలి. సభ్యత్వపు రుసుం కూడా ఏర్పాటు చేసి కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవాలి ఈ సమావేశానికి పేపరు వాళ్ళను కూడా పిలవాలి."

"అన్నింటికంటే ముఖ్యమైనది మరొకటుంది" రెండోమనిషి కల్పించుకుంటూ అన్నాడు..అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు.

"మనం ఎదుటివారికి చెప్పేముందు మనస్పూర్తిగా మనం ఆచరించాలి అంటే కొన్ని కట్టుబాట్లు మనకు మనమే విధించుకోవాలి...ప్రాణమైనా ఇవ్వాలి తప్ప అల్లుళ్లకు కట్న కానుకలు ఇవ్వకూడదు!" చెప్పాడతను.

"బాగా చెప్పారు!" ముక్తకంఠం తో అన్నారందరూ.

"సరే! రేపు పంచమి బుధవారం! మంచి రోజు. ఉద్యమ ప్రారంభానికి సన్నాహాలు చేయండి...అలాగే సభ్యులను నమోదు చేసుకునే ప్రయత్నము కూడా ప్రారంభించండి" అన్నాడు వీరభద్రం.

పెద్దమనుషులు నలుగురూ శలవు తీసుకుని వెళ్లిపోయారు.

"తర్వాత నారాయణ మళ్లీ వీరభద్రం తలమర్ధనా చేయటానికి వచ్చాడు. అయితే బాబుగారు తమరి అల్లుడుగారికి కట్నం ఇచ్చారు కదా?...అది తిరిగి తీసేసుకుంటారా?" తనపని చేస్తూనే అడిగాడు.

"ఇచ్చింది తిరిగి పుచ్చుకొనమని మేం చెప్పుటలేదు! ఇకముందు కట్నకానుకలను ఇచ్చుటా, పుచ్చుకొనుటా వల్లకాదని మాత్రమే నిబంధన చేశాం...అయినా అల్లునికి నేనింకా కట్నం సొమ్ము కొంత బాకీ వుంటిని గదా? దానికి ఈ నిబంధన వర్తిస్తుంది" అంటూ లేచాడు వీరభద్రం.

* * *

కుర్చీలో కూర్చునివున్న రాజేంద్రతో అంటున్నాడు నారాయణ "అదిబాబూ! ఈ మావల సంగం తాలూకు ప్లాసుబేక్కు! కనక తమరు కూడా తమకు రావాల్సిన కట్నం తాలూకు బాకీని రద్దు చేసుకోవాలన్న మాట! నా సంగతి సరే తన కొడుక్కి మా మావ కట్నం తీసుకోకుండానే పెళ్లి చేస్తాడా? రాజేంద్ర అనుమానంగా అడిగాడు. మరంతేకదండీ? కట్నం తీసుకున్నట్టు ఎవరికైనా తెల్సిందంటే ఈఊరి పరువు పోతుంది పదవీ పోతుంది! అయినా ఈ ఇంటికోడలుగా రావటానికి అయ్యగారి మేనకోడలు సిద్ధంగానే వున్నారు కదండీ మేనరికం అన్నాక కట్నాలు కానుకలూ వుండనేవుండవు ఒకవేళ అయ్యగారు కక్కూర్తి పడదామన్నా ఆరి మావగారి దగ్గర ఏమన్నా ఉంటేనే ఇయ్యటానికి? చెప్పాడు నారాయణ.

రామచంద్రా! బామర్దీ నువ్వెంత దురదృష్టవంతుడివోయ్? ఆరెకరాల మాగాణీకి వారసుడివి ఆరడుగుల ఆజానువాహుడివి! అందమైన పర్సనాలిటీ వున్నవాడివి ఆంధ్రాయూనివర్సిటీ డిగ్రీ తీసుకుంటున్న వాడివి ఇన్ని అర్హతలుండి అణాకానీ కట్నం లేకుండా ఖర్చయిపోతున్నావా? అయ్ పిటీ యూ! రాజేంద్ర స్వగతంలో అనుకున్నాడు శ్రీరాం ని అల్చుకుంటూ. నారాయణ పెరట్లోకి వెళ్ళిపోయాడు. హాల్లోనే కూర్చుండిపోయారేమిటి? అంటూ వచ్చింది గీత అతని చేతిలో ప్రసాదం పెట్టింది.

దాన్ని కళ్లకద్దుకుని నోట్లో వేసుకున్నాడు రాజేంద్ర 'నేనెక్కడ కూర్చుండిపోతే ఏమైందిలే గానీ ఈసారి మీ నాన్న నా కట్నం బాకీ తీర్చకపోతే నువ్వు పర్మనెంటుగా ఈ ఇంట్లోనే కూర్చుండిపోతావ్? అన్నాడు .

సరిగ్గా అదే క్షణంలో గాజు ప్లేటులాంటిదేదో భిళ్ళున కిందపడి బ్రద్దలైనట్టు శబ్దమైంది రాజేంద్ర గీతా ఉలిక్కిపడి అటు తిరిగి చూశారు వంటింట్లోంచి ఉప్మా ప్లేటుతో వస్తున్న పార్వతమ్మ చేతిలోని ప్లేటు వదిలేసింది కాబోలు అది కిందపడి బద్దలై ఉప్మా చెల్లాచెదరుగా పడింది తల్లిని చేరుకున్న గీత ఆమె స్పృహ తప్పి పడిపోతోందని గ్రహించింది క్రిందపడిపోకుండా పట్టుకుని భర్త సహాయంతో నెమ్మదిగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది తనపైట చెంగుతో రెండు క్షణాలు గాలి తగిలేలా విసిరి ఫ్లాస్కులో వున్న కాఫీ తెచ్చి తాగించింది రెండు నిమిషాల తర్వాత పార్వతమ్మ తేరుకుంది.

కళ్ళుతిరిగాయా? బీపీ ఏమైనా వుందేమో? డాక్టరుకి చూపించుకున్నావా? అడిగింది గీత సపర్యలు చేస్తూనే. అదేంకాదే తల్లీ అల్లుడిగారి కోసం ఉప్మా తెస్తూంటే నువ్వు పర్మనెంటుగా ఈ ఇంట్లోనే కూర్చుండి పోతావంటూ ఆయన దెప్పటం వినిపించింది అంతే! భయంతో కళ్ళు తిరిగినట్లయి చెప్పింది పార్వతమ్మ తర్వాత రాజేంద్రను చేరుకుంది అల్లుడుగారూ! మీ మావగారి సంగతి మీకు తెలుసుగా? పిసినిగొట్టు కాకపోయినా పిసిరంత మూర్ఖత్వం చేరడంత చాదస్తం వున్న మనిషి! నీ డబ్బు నీకు ఇచ్చేవారే! కానీ ఉరుమురిమి మంగలం మీద పడినట్లు.

ఈ ఊర్లో ఆ పోస్టుమాస్టారి పిల్ల వరకట్నం హత్యకు బలై ఓ దిక్కు మాలిన సంఘం పుట్టుకొచ్చింది దానికి ఈ పెద్ద మనిషి ప్రెసిడెంటవడంతో నీకిచ్చిన మాట వెనకపడింది. ఈ సారికి నీ పట్టు వదిలి పెట్టు నాయనా! త్వరలోనే ఆయన గార్ని ఎలాగోలా ఒప్పించి నీకు రావాల్సిన డబ్బు నేను ఇప్పిస్తాను! ఆర్ధింపు స్వరంతో చెప్పింది రాజేంద్ర కొంచెం మెత్తపడ్డాడు. ఇంతలో గీత అందుకుంది ఔనండీ! అమ్మ మాట కాదని మీరు పట్టుబడితే నాన్న కూడా అప్పారావుగారిలా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడు అనలే.

ఆయన గారికి కొంచెం మూర్ఖత్వం ఎక్కువ! మా అమ్మ మాంగల్యాన్ని కాపాడి పసుపు కుంకుమల్ని నిలబెట్టండి. రాజేంద్ర పూర్తిగా మెత్తపడ్డాడు సరే. వచ్చే సంక్రాంతి వారకు ఆగతాను అప్పటికీ మీ నాన్న దారికి రాకపోతే నీదారి నీది నాదారి నాది. అంటూ అక్కణ్ణించి విసురుగా వెళ్ళిపోయాడు.

అప్పారావుగారిని పరామర్శించి వస్తానంటూ వాకిట్లోకి వెళ్ళిన వీరభద్రం బయట గుమ్మం అవతలే నిలబడి ఈ దృశ్యాన్ని చూసి అల్లుడిగండం గడిచినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు అవసరమైతే అలాంటి ప్రయోగం చేయిమంటూ ఆనాడు సలహా ఇచ్చిన లాయరు చిదంబరానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ నాటకంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించిన నారాయణను అభినందించి టౌనుకెళ్ళి సినీమా చూసి రమ్మంటూ పాతిక రూపాయలు బహుమతిగా ఇచ్చాడు.

* * *

పుస్తకాలు పట్టుకుని కాలేజీలోంచి బయటకు వచ్చాడు శ్రీరామ్. రోడ్డుమీద పరధ్యానంగా నడుస్తున్నాడు కొంతదూరం వెళ్ళేసరికి అతని పక్కనే సాంత్రో కారొచ్చి ఆగింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అశ్విని చిరునవ్వుతో శ్రీరామ్ ని పలకరించింది. హాయ్ శ్రీరామ్. హలో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పలకరించాడు. కమాన్ డోరుతెరచి అతన్ని లోపలకు ఆహ్వానించిందామె.

శ్రీరామ్ కారెక్కలేదు సారీ! నేను హాస్టల్ కు వెళ్ళాలి సీరియస్ గా చెప్పాడు. నేను రమ్మంటున్నది అరణ్యంలోకి కాదు! అయినా ఎప్పుడూ హాస్టలూ కాలేజీలేనా? అప్పుడప్పుడూ కాస్తంత ఆ పిల్లగాలి ని కూడా అనుభవించాలి కమాన్ ఐసే! అమాంతం చేయి పట్టుకుని లోపలకు లాగబోయింది అశ్విని.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)