Shivatandavam - Comedy Serial 26

Listen Audio File :

 

26వ భాగం

"మును వున్నవాళ్ళు కూడా పదిహేనే యిచ్చేవారు. మా ఆవిడే కావాలని అద్దె తగ్గించింది."

"ఎందుకో?"

"అభిమానమండీ! ఆవిడంటే మా ఆవిడకు ఎంతో అభిమానం!"

"అంత అభిమానానికి కారణం కూడా ఉండాలి గదా!"

"మీరెంత అమాయకులండీ! మా ఇంట్లో అద్దెకు దిగింది ఎవరనుకుంటున్నారు. డ్యాన్స్ టీచరు!"

"అయితే?"

"మా పిల్లలకీ, మా బామర్ది పిల్లకీ నెలకి వెయ్యి రూపాయలు పోసి డ్యాన్స్ నేర్పిస్తోంది మా ఆవిడ. ఇప్పుడీవిడ వచ్చారు గదా ఇక ఉచితంగా నేర్చుకోవచ్చు. అద్దెలో మూడొందలు తగ్గించినా డ్యాన్స్ లో బాగా మిగుల్తుంది కదండి! మా ఆవిడ తెలివితక్కువది కాదండోయ్! మీరు 'ఆ' అన్నారనుకోండి. పదమూడు అంటుంది."

"పదమూడేమిటి?"

"పేగులు! ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టడమంటారే? ఇదే!"

"తాడో పేడో తెల్చేసుకుందామని మరో అస్త్రం ప్రయోగించాడు శివుడు."

"చూడండి రావుగారూ! ఆ డ్యాన్స్ టీచర్ని మీ ఇంట్లోంచి లేపేస్తే ఆ యింటికి రెండు వేలిస్తాను అద్దె."

"అమ్మో అంత పెద్ద అద్దె! చాలా ఎక్కువ పెట్టేస్తున్నారండీ! రెండువేలంటే మాటలా?'

"అవసరమండీ! అవసరం అల్లాంటిది! ఏమిటి ఖాళీ చేయించేస్తారా!"

"మా ఆవిడ్ని అడగాలండీ!"

"మధ్యలో మీ ఆవిడెవరండీ. మీ ఇల్లు..మీ ఇష్టం...మీ మాట కాదనగలరా మీ ఆవిడ?"

"భార్యాభర్తలన్న తర్వాత ఒకరి మాట ఒకరు వినాలి గదండీ?"

"అయితే?"

"అంచేత నేనే మా ఆవిడ మాటలు వింటున్నా! మా ఆవిడ అనేకానేకం మాటాడుతుంటుంది. నేను శ్రద్ధగా అవన్నీ వింటూ వుంటాను. నేను మాటాడటం ప్రారంభించే ననుకోండి మా ఆవిడ పోట్లాడుతుంది. పోట్లాడాలంటే ధైర్యం వుండాలి గదండీ! అది మా ఆవిడ దగ్గిర చాలా ఎక్కువ. నా దగ్గిర అతి తక్కువ. అస్సల్లేదు. అయ్యా - డబ్బాశపెట్టి నన్ను పాడు చేయోద్దండి. మా ఆవిడ చేతుల మీదుగా సంసారం గుట్టుగా లాక్కొస్తున్నవాడ్ని. నన్ను రొంపిలో దించొద్దండి. ఏవైనా మాటాడాలంటే, మా ఆవిడ్ని కలుసుకోండి. మీరూ ఆవిడ మాటాడేసుకోండి" అన్నాడు కోటేశ్వరరావు.

"ఆయన ఆడవాళ్లతో మాటాడరండీ!" అన్నాడు కైలాసం.

"నేను మగా ఆడ ఇద్దర్తోనూ మాటాడలేను గదండీ!" అన్నాడు కోటేశ్వరరావు.

"కైలాసం ఆయనకు డబ్బిచ్చి పంపు" అని శివుడు తన గదిలోకి వెళ్ళిపోయాడు.

"డబ్బు అంటాడేమిటీ?" కుతూహలంగా అడిగాడు కోటేశ్వరరావు.

"ఇదొక లేహ్యం. మింగండి. ధైర్యం వస్తుంది!" అంటూ డబ్బు ఇస్తూ అన్నాడు కైలాసం.

కోటేశ్వరరావు ఆశగా ఆ డబ్బుని పుచ్చుకున్నాడు. వెంటనే తిరిగిచ్చేస్తూ అన్నాడు.

"నా కొద్దండీ! ధైర్యమొస్తే మా ఆవిడ్ని కొడతాను. కొడితే మా ఆవిడ ఊరుకోదు. తిరగబడుతుంది. చితగ్గొడుతుంది. మాటంటే పడగలనుగానీ దెబ్బలేం తినగలను? నన్నిట్లా బతకనీయండి" అంటూ కోటేశ్వరరావు వెళ్ళిపోయాడు.

" కైలాసం నిటూర్చాడు.