TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
(2)(1)(1).png)
22వ భాగం
"నోర్ముయ్! ఆ దిక్కుమాలిన పేరు మరోసారి నా దగ్గరెత్తకు. అయినా అది నీకెట్లా తెలుసు? ఎప్పుడు తెలుసు? నిన్ను కలుసుకుందా? నీతో మాట్లాడిందా? ఒరే బుజ్జులూ - మనింటి ముందు కాపురం పెట్టి మనింట్లో నిప్పు పెట్టాలని చూస్తుందిరా ఆ మనిషి! అది ఆడది కాదు మాయలాడి"
"చూపుకు మంచి మనిషిలాగానే కనిపిస్తుందన్నయ్య!" "
కనిపిస్తుందిరా కనిపిస్తుంది! మేడిపండు కూడా అందంగానే కనిపిస్తుంది (కోపంగా) బుజ్జులూ, ఆడదాన్ని చూడకూడదనే రూలు అతిక్రమించావు కదూ!"
"నేను చూళ్ళేదన్నయ్యా!" "నోర్ముయ్! నువ్వు చూడకపోతే అది నీకెట్లా కనిపిస్తుంది? ఇప్పుడే చెబుతున్నా - ఇక ముందు దాని ప్రసక్తి మన మధ్య రాకూడదు. నువ్వు కనీసం ఆ ఇంటి వైపు కూడా చూడకూడదు. దీనికి విరుధ్ధంగా జరిగితే నేను సహించను. వళ్ళు చీరేస్తాను. నిన్ను చంపి నేను ఛస్తాను"
"అన్నయ్యా?" ఆందోళనగా అన్నాడు.
"అట్లా జరకుండా చూసే బాధ్యత నీది! ఊ తీయ్ బైస్కీలు"
"ఎన్ని!"
శివుడు లెక్క తప్పింది. ఎన్నో చెప్పలేక పోతున్నాడు. విసుగ్గా అనేసేడు "ఎన్నోకొన్ని - ఓపికున్నంత వరకూ తీయ్!" బైస్కీలు పునః ప్రారంభమయ్యాయి. చర్చిలో గంట స్తంభమెక్కి ముసలి డేవిడ్ తొమ్మిది గంటలు కొట్టాడు. ఇంటిముందు సైకిలు పెట్టి ఎదురింటి వైపు ఆత్రంగా చూస్తున్నాడు కిష్టుడు.
"ఇంకా బయలుదేరలేదా" అన్నాడు శివుడు ఇంట్లోంచి వస్తూ.
"వెడుతున్నానన్నయ్యా! సైకిలు చైను పడిపోతేనూ - చూస్తున్నాను" అంటూ సైకిలు చైను సర్దుతున్నాడు కిష్టుడు.
"అయ్యిందా?" అన్నాడు శివుడు.
"అయ్యింది!" అన్నాడు కిష్టుడు.
"అయితే ఇక వెళ్ళు!"
"ఇదిగో వెళుతున్నాను" అంటూ సైకిలెక్కి ఫైరింజన్లా బెల్లు మోగించుకుంటూ సైకిలు తొక్కుతున్నాడు.
మాట ప్రకారం సరిగ్గా తొమ్మిది గంటలకు వసుంధర సైకిల్తో వీధిలోకి రావాలి. రాలేదు. గుర్తు చేసేందుకు బెల్లు వాయించినా కూడా రాలేదు. 'మాట తప్పింది వసుంధర' అనుకున్నాడు బుజ్జులు.
అయినా ఆశ చావలేదు. వెనక్కి చూసుకుంటూనే సైకిలు తొక్కుతున్నాడు. అట్లా వెనక్కి చూసుకుంటూ సైకిలు తొక్కుతున్న బుజ్జులి చెవికి కిలకిల నవ్వులు వినిపించాయి. ఆగి చూశాడు.
రోడ్డు మీద కొంచెం దూరంలో సైకిలాపి నించున్న వసుంధర కనిపించింది. ఆమెను చూడగానే కిష్టుడు మొహం వికసించింది.
|
|