Shivatandavam - Comedy Serial 16

Listen Audio File :

 

16 భాగం

పంకజం వసుంధరని పలకరిస్తుంది.

" ఆ అబ్బాయిని ఎందుకు తిడతావ్ ? నువ్వు మాత్ర చేసింది ఏమిటి ? కొంప మునిగిపోయినట్టు గుమ్మం దగ్గరే సైకిలెక్కాలా ? ఇంకా నయం. అతను కూడా సైకిల్ మీద వస్తున్నాడు గనుక సరిపోయింది. అదే స్కూటారో, కారో అయితే ఎంత ప్రమాదం జరిగి వుండేదో కదా " అని.

కిష్ణుడు అంతవరకే వినగలిగేడు.

అప్పటికే అతను సైకిలెక్కి వచ్చేయడం వల్ల మిగితా మందలింపు అతనికి వినిపించలేదు.

పంజకం వసుంధరని " ఆడపిల్లవి గనుక నువ్వెన్ని తిట్టినా నోరెత్తలేదు. అదే రౌడీ కుర్రాడైతే నీ చెంపలు వాయించేవాడు అవునా ?"

" సారీ ఆంటీ! నేనే తొందర పడ్డాను "

" ఊ టైమైంది ఇక వెళ్ళి రా! మెల్లిగా వెళ్ళు "

వసుంధర మౌనంగా సైకిల్ ఎక్కింది. నెమ్మదిగా తొక్కుకుంటూ వెడుతుంది. అట్లా ఒక ఫర్లాంగు దూరం వెళ్ళిందో లేదో దారికి అడ్డంగా సైకిలు స్టాండు వేసి నిలబడిన కిష్ణుడిని చూసి బెదిరిపోయింది. వసుంధర సైకిల్ దిగింది.

అతని వేపు భయం భయంగా చూస్తుంది. కిష్ణుడు ఒక్కో అడుగు గంభీరంగా వేస్తూ వసుంధరను చేరుకున్నాడు.చేరుకున్న వెంటనే లాగి చెంప మీద చెళ్ళున చరిచేడు. ఆ దెబ్బతో వసుంధర కళ్లు బైర్లు కమ్మాయి.

వసుంధర వస్తున్నా దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటుంది.

ఆడపిల్లలకు డాన్స్ పాఠాలు చెబుతుంది పంకజం. ఆ రోజుకి పాఠాలు పూర్తీ చేసి పిల్లల్ని వెళ్ళిపొమ్మని చెప్పింది. మనసు బాగాలేదు. ఫోన్ తీసింది. ఒక నెంబర్ డయల్ చేసింది.

శివుడి గదిలో ఫోన్ మోగింది. వేదాంతసారం చదువుతున్న శివుడు డిస్టర్బయ్యాడు. సోఫాలోంచి లేవకుండానే ఫోనందుకుని ఠీవిగా అన్నాడు " శివరామారావు హియర్ " అని అన్నాడు.

" నేనే శివుడూ...పంకజాన్ని "

ఆ మాట వినగానే నది ఒడ్డున పంకజం నయవంచన దృశ్యరూపంగా శివుడి కళ్ళముందు తిరిగింది తట్టుకోలేక అరిచాడు. " ఒకసారి చెబితే బుద్ధుండాలి ! పెట్టేయ్ ఫోన్ "

" ప్లీజ్..కోపంతో మనసు పాడుచేసుకోవద్దు శివుడూ. నేను చెప్పేది పూర్తిగా విను "

" ఏం చెబుతావ్ నీ ఇంటికి రమ్మంటావు ! పిచ్చి వెధవలాగా వస్తే నీ భర్త చేత కూడా నన్ను కొట్టించి కసి తీర్చుకుంటావ్ అంతేగా! దొంగదెబ్బ తీయడం నీకు మొదటి నుంచీ అలవాటే! మరిచిపోయావా పంకజం ? నీకోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నది దాటివస్తే నాకేం సత్కారం చేసేవో..ఏం కూతలు కూసేవో మరిచిపోయావా ?"

పంకజం మధ్యలోనే అందుకుంది " అదే శివుడూ ఆ విషయం చెబుదామనే నీ గదికి వచ్చెను. కనీసం తలుపు కూడా తీయకుండా వెళ్ళిపోమ్మన్నావ్ ఫోన్లో అయినా చెబుదామని ఇప్పుడు ఫోన్ చేశాను "

" అక్కర్లేదు. నాకు నువ్వేం చెప్పనక్కరలేదు "

" అంత మాటనకు శివుడూ ! అసలు జరిగినది ఏమిటో తెలిస్తే ఇట్లా మాట్లాడవు. నువ్వు నది ఒడ్డుకి రాగానే అక్కడి పరిస్థితి తారుమారయ్యింది నేను "

" స్టోరీలు చెప్పకు ! ఇక ముందు ఫోన్ చేస్తే మర్యాద దక్కదు మైండిట్ " అని ఫోన్ పెట్టేశాడు శివుడు.

పంకజం ఫోన్లో హల్లో హల్లో అంటూనే వుంది. అతను ఫోన్ పెట్టేసినందుకు నిస్సహాయంగా నిట్టూర్చింది. తాను కూడా ఫోన్ పెట్టేసి సోఫాలో వాలిపోయింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ఆ కళ్ళను చేతుల్తో మూసేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది.

చర్చిలో వున్నగంట స్తంభం మెక్కి అయిదు గంటలు కొట్టాడు ముసలి డేవిడ్. కిష్ణుడు కాలేజీ నుంచి సైకిల్ మీద వస్తున్నాడు. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. నాలుగు రోడ్లు కూడలి దగ్గర వసుంధర సైకిల్తో నిలబడి వుండడం చూసి వేగం తగ్గించేడు కిష్ణుడు.