Shivatandavam - Comedy Serial 14

Listen Audio File :

Comedy Audio Serial

14 భాగం 

" ఏం చేస్తాడు నా పిండాకూడు ! బాగా డబ్బున్న వాడేమో తిని కూచుంటాడు. తిని కూచుంటే ఫర్లేదు. వీధిలో మగాళ్ళందర్నీచేరదీసి మీటింగులు పెడతాడు. బ్రహ్మచారులైతే పెళ్లి చేసుకోవద్దని సలహాలిస్తాడు. పెళ్లయిన మగముండా కొడుకులకీ సంసారాలు చేయవద్దని లేహ్యలిస్తాడు. ఆడదంటే గిట్టదు.చివచివలాడిపోతాడు. ఆ గాలి తగిలితేనే మహాపాపమంటాడు. ఈ పాపిష్టి మీటింగులతో మగాళ్ళందర్నీ పాడు చేస్తున్నాడు. పోయేకాలం కాకపొతే ఏమిటీ అల్లరి చెప్పు ? అమ్మాయ్ ఇంక నను వాగించకు. ఇక నా నోటికి మంచి మాటలు రావు " అంటూ ధనలక్ష్మి వడివడిగా వెళ్ళిపోయింది.

పంకజం నిట్టూర్చుంది. శివుడా అని గొణుక్కుంది కూడా! నిప్పు అప్పల్సామి డ్యూటీదిగి సైకిల్ మీద ఇంటికి వస్తున్నాడు. తనకంటే పెద్దవాళ్ళకు తాను విష్ చేస్తుంటే తనకంటే చిన్నవాళ్ళు తనకి నమస్కారాలు పెట్టి తప్పుకుంటున్నారు.

ఒక పెద్దవాడూ, ఒక చిన్నవాడూ విడివిడిగా ఎదురైనప్పుసు అప్పలస్వామి పరామర్శలు బాగానే సాగుతున్నాయి. ఒక పెద్దవాడూ, ఒక చిన్నవాడూ జాయింటుగా ఎదురైనప్పుడు ఎవడికి విష్ చేయాలో, ఎవడికి ఫోజ్ కొట్టాలో నిర్ణయించుకుని కూడా, రెండు పనులూ ఒకేసారి చేయడం చేతకాక సైకిల్ బేలేన్సుని చెడగొట్టుకుంటున్నాడు.

సరిగ్గా ఆ అవస్థలో చిలకమ్మ సోడా కొట్టు దగ్గిర పడ్డాడు అప్పలస్వామి. చెట్టంత మనిషీ కుప్పలా పడిపోయాడని చుట్టుపక్కల వాళ్ళు చుట్టూమూగారు.

తాను పడిపోయినందుకు కాదుగానీ జనం ఈగల్లా ముసిరినందుకు అప్పలస్వామి చాలా సిగ్గు పడిపోయేడు. ఆ తర్వాత కోపం కూడా వచ్చింది. తన చుట్టూ మూగిన వాళ్ళని మిర్రున చూసేడు.

ఆ గుంపులో ఎవడో అన్నాడు " అప్పలస్వామి గారు..ఎప్పుడు పడినా సరిగ్గా సిలకమ్మ సోడా కొట్టు దగ్గిరే పడిపోతారు. అదేం సిత్రమో " అని. ఆ మాటకి అప్పలస్వామి శివాలు తొక్కేసేడు.

" సిత్రమేరా.. నీ కంటికి సిత్రంగానే కనిపిస్తది. ఒరే నే పడితే గిడితే ఒక్కడే పడతాను. ఇక్కడిచ్చేతలికి కన్ ఫ్యూజన్లో పడిపోతాను. ఏంటి, అర్థమయిందా. ఎల్లండెల్లండి. ఎల్లకపోతే అవుటే ! సిలకమ్మా సోడా కొట్టే " అని. చిలకమ్మ డబుల్ సోడాని రాగాలు తీయిస్తూ కొట్టింది. సోడా సీసాని అప్పలస్వామికి అందిస్తూ వేళ్ళతో టైపు కొట్టింది.

ఆ స్పర్శకి మెలికలు తిరిగిపోయేడు అప్పలస్వామి. " పడిపోతున్నావ్ " అని ఎవరో హెచ్చరించినట్టయ్యింది.

సోడా తాగడం మానేసి " నేనేం నాకితే నీకెందుకు? నీ డ్యూటీ ఏంటో నువ్వు చూసుక్కో ! అనవసరంగా ఇంటర్ ఫియరయ్యావంటే అవుటే ! మామూలు ఎడ్డు కాడీడు. నిపు ..నిప్పు అప్పలస్వామి. ఏమనుకుంటున్నావో కాలిపోతావ్ జాగ్రత్త. " అని సోడా ఇచ్చేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు.

చిలకమ్మ ఆ మనిషి వెళ్ళిన వైపే చిత్రంగా చూస్తూ " ఏంటి ఇద్డూరం ! దొరకు ఆ సెయ్యి తగుల్తేనే సాలనుకుని గంటలు గంటలిక్కడే బీటేసేవోడు. అట్టాంటి దియ్యాల ఫైరింజన్ అయిపోయాడు " అని గొణుక్కుంటూ ఉంది.

" పేరు పంకజమండి. వృత్తి నాట్య ప్రదర్శనలండి " అన్నాడు కైలాసం.

" ఆ వివరాలేవో బోర్డు మీద రాసేవున్నాయి. ఆమెకు పెళ్ళయిందా "? చాలా గంభీరంగా అడిగాడు శివుడు.

" అయ్యే ఉంటుందండీ "

" భర్త ఏం చేస్తుంటాడు ?"

" ఉన్నాడో లేదో తెలియండీ "

" కైలాసం "

" పెళ్లయ్యే వుంటుందన్నానే గాని అయ్యిందని చేపలేదు గదా సార్ ! అంచేత భర్త "

" సరి సరి..ఇంకా ఆపు. అయినా ఆవిడ వివరాలు ఎవడిక్కావాలి. పంజకమట...పం...క..జం.....ఏవయ్యా. ఈ భూలోకంలో ఏ పేరు దొరకనట్టు ఆ పేరే పెట్టుకోవాలా ?"

" ఎందుకు పెట్టుకున్నారో కనుక్కోమంటారా ?"

" కైలాసం..శృతి మించుతున్నావ్ ?"

" సార్....సార్ "

" నువ్వు వెళ్ళవచ్చు "

" యస్సార్ " అంటూ కైలాసం ఆ గది విడిచేడు. ఎవరు శృతిమించుతున్నారో కైలాసానికి అర్థం కావటం లేదు. ఇంటిముందు కొత్తగా దిగిన డేన్సర్ గురించి అడిగింది ఆయన.ఎప్పుడూ లేనిది ఒక ఆడమనిషి గురించి అంత శ్రద్ధ ప్రదర్శించింది చాలక, అడిగిందానికి సమాధానం చెబితే శృతి మించడమా? కైలాసం వెనక్కి తిరిగి చూశాడు.

గది తలుపు మూసి వుంది. కైలాసం విసురుగా ఒక చూపు విసిరేసి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. గదిలో శివుడు పచార్లు చేస్తున్నాడు.

" పంకజం " అని కసిగా గొణుక్కున్నాడు.

మరుక్షణంలో...పంకజం హైజంపులూ, లాంగు జంపులూ, చిన్న చెడ్డీ, వంపుసొంపుల శరీరం, ఎతైన ఛాతీ అన్నీ తన కళ్ళ ముందు ఎడా పెడా దృశ్యాలుగా కనిపించాయి. ఆ దెబ్బకీ శివుడు మొహం మీద చిరుచేమటలు పట్టాయి. లేహ్యం డబ్బీ నందుకున్నాడు. లేహ్యం నాలుకమీద రాసుకున్నాడు. ఇప్పుడు వరూధినీ ప్రవరాఖ్యా నృత్య ప్రదర్శనలో కౌగిలింత ఘట్టం తన కళ్ళముందు వెలిసింది. చివర్లో ఛళ్ళున చెంప పెట్టుకుడా ఫ్లాష్ లాగా వెలిగింది.

" ఆంజనేయా " అని గొణుక్కున్నాడతను. గబగబా శీర్షాసనం వేసేశాడు తను ఆ దుస్తితిలో ఉండగా గది తలుపు తట్టిన శబ్దమైంది.

" ఎవరది ?" అన్నాడు అతను శీర్షాసనంలో ఉండి.

" నేనే " అని ఆడగొంతు ఎంతో మృదువుగా అనిపించింది.