Shivatandavam-Comedy Serial 7

Listen Audio File :

Audio Comedy Serial

7 వ భాగం.

శివుడు పులిచర్మమ్మీద కూచుని వేదాంత సారమనే బృహద్గ్రంధాన్ని చదువుతున్నాడు. అప్పల్సామిని చూడగానే చిరునవ్వుతో పలకరించేడు.

“రా నాయనా! కూచో!” అప్పల్సామి కటిక నేలమీద బుద్ధిగా కూచున్నాడు - పోలీసు సెల్యూట్ పూర్తయిన తర్వాత.

“లేహ్యం వాడేవా? ప్రయోజనం కనిపించిందా?” అప్పల్సామి నీళ్ళు నములుతూ అన్నాడు.

“కనిపించిందండీ! కాని బాబూ లేటుగా వాడేను గందా, సమయానికి ఆడుకోలేకపోయింది"

“అంటే?”

“ఏం చెప్పమంటరండయా! నా వైపు పవరు అట్టాంటిది. జేబులో లేహ్యం అట్టాగే వుందండి. తీద్దాం తీద్దాం అనుకుంటుండగానే అది నాతో చెడుగుడు ఆడేసిందండి. తెల్లారి లేచి తర్వాత చూసుకుంటే జేబులో పర్సు మాయమైపోయిందండి. అవుటు!”

“మీ ఆవిడే తీసిందా!”

“చిత్తం! అది గనుకే సరిపోయిందండి! మరింకెవరైనా అయితే ఉరి శిక్ష పడిపోయేదండి.

“మీ ఆవిడ మీద మమకారం పెంచుకుంటున్నావు అప్పల్సామీ.”

“మమకారం కాదండీ నిజం చెప్పాలంటే భయమండి!”

“భయమా?”

“అవునండయా! నిన్న కూడా తమకీ పాయింటు చెప్పినట్లు గుర్తుంది. వదిలేయండి. ఏమండయా నా సర్వీసులో ఎంతోమంది రౌడీలని చెట్ పట్ లాడించేసేనండి. జమాజట్టీ లాటోళ్ను నన్ను చూస్తే చాలండి నా పాదాల మీద పడిపోతారు. నేను లెగదీసెంతవరకు లెగరంతే లెగరు. ఓల్ సేల్ గా మర్డర్లు చేసేసి చేతుల్లో కత్తులెత్తుకుని తిరిగే కూనీకోరు నాయాళ్ళు నే కనపడగానే... నా కేక వినపడ్గానే ఎక్కడోళ్ళక్కడే ఆగిపోవాల్సిందేనండి. నా యొక్క అవుతారానికి బయపడిపోయి ఆళ్ళంతట ఆళ్లే 'బేడీలేసేయండి అప్పల్సామిగారు' అని చేతులిచ్చిన గొడవ లనేకమున్నాయండి.

అయ్యా ఇంత చెరిత గలోడినండి. పేరు మోసిన కేడీలు, కేటుగాళ్ళు, రౌడీలు, కూనికోరు నాయాళ్ళు సమస్తమైన వొళ్ళు నన్ను చూసి వణికిపోతావుంటే యెదవి నేనేమో మా ఆవిడ్ని చూసి అదిరిపోతానండి. పోనీ పర్సనాల్టీ నాకంటే గొప్పదా అంటే అదీ కాదండయా. తలుచుకుంటే సిటికన్లేతో లేపేయొచ్చు. అట్టాంటిది అదేం పవరో గానండయా - దాని ముందు నేను అవుటేనండి!” అని ఆగిపోయేడు అప్పల్సామి.

శివుడు జాలిపడ్డాడు.

“అప్పల్సామీ!”

“అయ"

“నీకో రకమైన వ్యాధి! డానికి అనువైన మందు ఒక్క లేహ్యమే! రెగ్యులర్ గా వాడు!”

“చిత్తం"

“ఇంకోటప్పల్సామీ"

“సెలవీయండయా!”

“ఒక చిన్న సైజు ఆడదానికి పర్వతమంత మగాడు భయపడుతున్నాడంటే డానికి సవాలక్ష కారణాలుంటాయి!”

“చిత్తం!”

“ఒకటి పిచ్చి ప్రేమ. రెండు వెర్రి వ్యామోహం. మూడు గుడ్డి మమకారం. నాలుగు అకారణమైన జాలి. అయిదు అనవసరమైన ఔదార్యం.....!”

"చిత్తం! చిత్తం! తమరు చెప్పే గుణాలన్నీ నాకున్నాయని డవుటండి. అందుకే అవుటైపోతున్నాను”

“లేహ్యం వాడు. ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. అయిపోతే అడుగుతుండు ఇస్తుంటాను.”

“చిత్తం!”

“ఇంక వెళ్ళిరా!” అప్పల్సామి లేవలేదు. బుర్రగోక్కుంటూ అన్నాడు.

“తవరేమనుకోకపోతే ఒక మాత అడుగుతానండయ!”

“అడుగు!”

“పెళ్ళి చేసుకుని ఇన్నేళ్ళూ ఎన్నో గొడవలు పడ్తున మేమే ఆడదంటే ఏంటో అర్థం కాక చస్తున్నాం దంగా పెళ్ళీ గిళ్ళీ లేకుండా, ఆడోళ్ల పవరేంటో ఇంత కరెక్టుగా ఎట్టా చెబుతున్నారో!” ఆ మాటకి అడ్డం పడిపోయేడు శివుడు.

“ఒక్కప్పుడు నేను కూడా ఆడదాని చేతిలో అల్లరైన మనిషినే అప్పల్సామీ"

“చిత్తం!” అంటూ కుతూహలంగా ముందుకు జరిగేడు అప్పల్సామి.

“చదువుకునే రోజుల్లో ఒక ఆడపిల్లకి బలైపోయాను. ఆ దెబ్బకి నూరు జన్మల అనుభవం వచ్చేసింది. అప్పల్సామీ"

“అయ"

“నీతో నాకు అతి తక్కువ పరిచయం! అయినా, నిన్ను చూస్తుంటే ఒక ఆత్మ బంధువుగా కనిపిస్తున్నావు. నా కథ యావత్తు నీకు చెప్పేసుకోవాలనిపిస్తుంది నాయనా!”

“నాక్కూడా వినాలనే వుందండయ అన్నాడు హెడ్డు.

“నేనేందుకు ఈ బ్రహ్మచర్యవ్రతం ఆచరిస్తున్నానో, స్త్రీ ద్వేషం నా మనసంతా ఎందుకు ఆక్రమించిందో సమస్తం చెప్పేస్తున్నాను అప్పల్సామీ, శ్రద్ధగా విను...!”

“చిత్తం!” అన్నాడు అప్పల్సామీ.

అతను చెప్పటం మొదలుపెట్టాడు.