Finishing touch

ఫినిషింగ్ టచ్...!?

సూరేపల్లి విజయ

అఫ్గానిస్తాన్...దూరంగా విసిరి పారేసినట్టున్న ఓ కొండ ప్రాంతంలో వుందా తొర్ర.

అమెరికా వాళ్ళ పుణ్యామా అని, ఆ తొర్ర అనబడే బంకర్ ని ప్రస్తుతం తన డెన్ గా మార్చుకున్నాడు బిన్ లాడెన్.

అప్పుడే ఇండియా నుంచి వచ్చిన గోపాలం చెమటలు కక్కుతూ, ఓసారి ఆకాశం వంక చూసాడు.అసలే బ్యాడ్ డేస్... పుసిక్కిన జార్జిబుష్ లాడెన్ మీద కోపంతో తన మీద బాంబు విసరడు కదా...అనే డౌట్ పీకింది.ఏయిర్ పోర్ట్ నుంచి బస్సులో వచ్చి, ఆ తర్వాత ఓ గాడిదను అద్దెకు తీసుకుని (ఆఫ్గానిస్తాన్ లో గాడిదల మీద ప్రయాణం తప్పనిసరి)బిన్ లాడెన్ అడ్రస్ పట్టుకుని అతి కష్టం మీద అక్కడికి వచ్చాడు గోపాలం.

ఒకసారి తల వంచి,దాదాపు యాభై అరవై అడుగులున్న ఆ తొర్రలోకి చూసాడు.తను చేయవలసిన కర్తవ్యం గుర్తుకు వచ్చి మెల్లగా వంగి, ఆ తొర్ర గుండా పాకుతూ వెళ్తున్నాడు.

తన బతుకు మీద తనకే థూ యాక్ అనిపించింది.అయినా పని తనది...తప్పదు అనుకుంటూ అలా కప్పలా గెంతుతూ ఓసారి,పాములా పాకుతూ మరోసారి కోతిలా,ఇంకోసారి ...అలా...అలా శ్రమ తెలియకుండా వుండటానికి వివిధ ట్రిక్కులు ఫాలో అవుతూ ఎట్టకేలకు తొర్ర చివరికి వచ్చాడు.

అక్కడ కాస్త విశాలంగా వుంది.కనీసం వంగొని అయినా మాట్లాడొచ్చు.

*****

“ కౌన్ హై బే " ప్లాస్టిక్ డబ్బాలో గోళీకాయలు వేసి సౌండ్ యిచ్చిన ఎఫెక్ట్ లో ఓ గొంతు వినిపించింది.

గోపాలానికి ఒళ్ళు మండింది.మరొకప్పుడైతే నువ్వు బే,మీ అయ్య బే, మీ తాత బే,అని వంశ వృక్షాన్ని బేలతో జత కలిపి 'నానా బూతు 'సమితి చేసేవాడు.కానీ యిప్పుడు చేయలేదు.

"కౌన్ హై బే అంటే, మాట్లాడవేంటి బే " మళ్ళీ ఆ గొంతు సౌండ్ యిచ్చింది.

“ నేనే గోపాలం బేని...బే " అన్నాడు గోపాలం గొంతు పెగుల్చుకుని.

ఓసారి గోపాలం అవతారం వంక చూసి, ఆ తర్వాత కాసింత అనుమానాన్ని ఫేసులోకి ట్రాన్స్ పర్ చేసుకుని...

” నిన్నా జార్జిబుష్ పంపించలేదు కదా " గొణుక్కుంటూ అడిగాడు.

“ లేదు... నేనే ఇండియా నుంచి మిమ్ముల్ని వెతుకుంటూ వచ్చాను " చెప్పాడు గోపాలం.

“ ఇండియా నుంచి అయితే బేఫికర్...పాకిస్తాన్ నుంచి కాదు కదా...వాళ్ళని నమ్మొద్దు. మొన్నటి దాకా నాతో హ్యాండు కలిపి యిప్పుడు హ్యాండిచ్చారు.” గుర్రుగా అన్నాడు బిన్ లాడెన్.

“ష్చ్ " అని జాలిగా చూసి...” నవాబ్ షరీఫ్ హ్యాండిచ్చారు.నువ్వెంత " అన్నాడు గోపాలం.

“ చుప్ రహో...వచ్చిన పని బాతో " అన్నాడు దర్పంగా మెషిన్ గన్ తో గడ్డం గోక్కుంటూ.

“ నీతో ఓ పని బడి వచ్చాను.మీరు మెషిన్ గన్ తో గడ్డం గోక్కోవడం ఆపితే చెబుతాను " గోపాలం కాసింత ధైర్యం చేసి అన్నాడు.

లాడెన్ గడ్డం గోక్కోవడం ఆపి " ఇప్పుడు చెప్పు "అన్నాడు.

“ మా ఇండియాలో ఆంద్రప్రదేశ్ అని ఓ రాష్ట్రం వుంది "

“ సగం మాలుమ్ హై...అసలు విషయం బాతో " అన్నాడు లాడెన్.

“ హైదరాబాద్ లో నగరం నడిబొడ్డులో నేను అసయ్యంగా కొంత ఖాళీ స్థలం కొన్నాను. అప్పుడెప్పుడో అయిదారేళ్ళ క్రితం " చెప్పాడు గోపాలం.

“ అయితే నాకేంటి బే " కోపంగా అన్నాడు లాడెన్.

అసలే అమెరికా వాళ్ళు ఎప్పుడు తన మీద బాంబు వేస్తారోనని యమ టేక్షన్ గా వున్నాడు బిన్ లాడెన్.

గోపాలం కోపాన్ని తమాయించుకున్నాడు.

“ మా స్థలంలో వున్నా గుడిసల్ని కూలగోట్టాలి " అన్నాడు గబగబా.

పక్కలో జార్జిబుష్ వేసిన బాంబు పడ్డట్టు భయపడి " హమ్మో...మై నహీ కరుంగా "అన్నాడు లాడెన్.

“ ఊర్కోండి సార్...మీరు కాకపొతే యింకెవరు కర్తారు చెప్పండి.అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసి, దాన్ని కుప్పకూల్చిన మీకు ఈ ఆఫ్ట్రాల్ గుడిసెలో లెక్కా...పైగా మీకు బోల్డు గ్లామరు వస్తుంది.నాలాంటి బాధితులు హైదరాబాద్ లో బోల్డు మంది వున్నారు "చెప్పాడు గోపాలం.

“ సరిగ్గా నాకు అర్థమయ్యేలా చెప్పు బే " అన్నాడు మరోసారి 'బే 'పదం ప్రయోగిస్తూ.

“ ఇదిగో లాడెన్...నువ్వు అస్తమానం బే..బే...బే... అంటే నేనేం చెప్పనంతే " బుంగమూతి పెట్టి అన్నాడు గోపాలం.

“ సర్లే బే...సారీ బే...యింకోసారి అనను బే " అని గోపాలం వంక చూశాడు.

“ సర్లే...అసలు విషయం చెబుతాను. మా హైదరాబాద్ కబ్జాలకు కూడా ఫేమస్సే.మనం ఆఫీసుకు వెళ్లి వచ్చేలోగా మన యింటిని కబ్జా చేయగలరు. సాక్షాత్తూ ప్రభుత్వ భూములే కబ్జా చేసారు.ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసే భూబకాసురులు వున్నారు.భూమిపోయిన వాళ్ళందరి తరపున నేనొచ్చాను.నన్ను మీదగ్గరికి పంపించారు.” అసలు చెప్పాడు గోపాలం.

“ అంటే...నేనిప్పుడు ఏం చేయాలి ?”అడిగాడు లాడెన్, మరోసారి మెషిన్ గన్ టప్ గడ్డం గోక్కుంటూ.

“ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేసినంత ఎఫెక్టు లో కబ్జా భూముల్లో తిష్ట వేసుకుర్చున్న వాళ్ళందర్నీ కూల్చేసి మా ఆ స్థలాలుమాకు యిప్పించాలి.మా శక్తి కొద్దీ ఫీజు మేము ఇచ్చుకుంటాం " గోపాలం విషయాన్నియాక్ట్ చేస్తూ చెప్పాడు.

“ కానీ, దాని వల్ల నాకేంటి లాభం బే " అన్నాడు లాడెన్.

“ నువ్వోపిచ్చిబేవి " అన్నాడు చిద్విలాసంగా గోపాలం.

“ క్యా...క్యాబోలా ?”

“ నేను సరిగ్గానే బోలాను.యిప్పటికే బోల్డు రోజులైంది.మీ మీద యుద్ధం మొదలై...”

“ అవునవును...అందుకే నా అనుచరులు తలా దిక్కుకు పోయారు.ఈ బంకర్ లో తల దాచుకోవాల్సి వచ్చింది "విచారంగా అన్నాడు లాడెన్.

“ఆ తల దాచుకోవడమేదో మా యిండియా లోనే చేయొచ్చు.ఒక్క దెబ్బకు మూడు పిట్టలు "

“ మూడు పిట్టలా ? పిట్ట మాంసం తిని చాలా రోజులైంది బే " అన్నాడు నాలిక తడుపుకుంటూ.

తల పట్టుకొని అన్నాడు గోపాలం.

“ నేనే వేరే మీనింగ్ లో చెప్పాను. మా ఇండియాకి వచ్చి గుడిసెలు పీకించి, మా భూములు మాకు యిప్పించడం వల్ల నీకు డబ్బు వస్తుంది.అసలే యిబ్బందిగా వుందటగా "అన్నాడు గోపాలం.

“అవునవును.మొన్నోదోస్త్ వస్తే చాయ్ రొట్టె యిచ్చాను.నీకిద్దమంటే యిదిగో యిది వుంది " అంటూ ఓ మూలనున్న ఓ ముంత తెచ్చి యిచ్చాడు సిగ్గుగా.

“ ఏమిటది ?” గోపాలం చూడకుండానే అడిగాడు.

“కల్లు...ఆ మధ్య తలదాచుకోవడానికి తాటి చెట్టు ఎక్కి,పనిలో పనిగా పనికి వస్తుందని కల్లు గీసా...తాగు...తాగు...” అన్నాడు లాడెన్.

“ తర్వాత్తాగుతాను గానీ, నేను చెప్పేది విను లాడెన్ జీ. నువ్వు ఇండియా వస్తే టెంపరరీగా అమెరికా వాళ్ళ దాడి నుంచి తప్పించుకోవచ్చు.పై పెచ్చు నీకు బోల్డు పబ్లిసిటీ వస్తుంది,. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడం కన్నా, మా ఇండియాలో ఆక్రమించుకున్న స్థలాల్లోని గుడిసేల్ని పీకేయడమే కష్టం కాబట్టి...” అన్నాడు గోపాలం.

లాడెన్ తన దగ్గరున్న కంప్యుటర్ టెక్నాలజీతో తన అనుచరులను సంప్రదించి " సరే " అన్నాడు.

*****

ఇండియాకు వచ్చి, ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి, అక్కడ కబ్జా చేయబడ్డ భూములను తిరిగి స్వాధీన పరుచుకోవడం మొదలు పెట్టాక తెలిసింది లాడెన్ కు...అదెంత కష్టమో...! డజన్ల కొద్దీ రౌడీలు ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు.

ఒకడు బాంబులతో,యింకొకరు కత్తులతో మరొకడు పిస్తోళ్లతో కాపలా కాస్తున్నారు.ఒకడ్ని సఫా చేస్తే, యింకొకడు బయలుదేరుతున్నాడు.

ఒక దగ్గర గుడిసేలన్నీ పీకేయించి, మరో దగ్గరికి వెళ్ళొచ్చేలోగా పీకేయించిన గుడిసెల స్థానంలో మళ్ళీ గుడిసెలు వెలుస్తున్నాయి.

లాడెన్ కు తల తిరిగిపోయింది.తనెంత గెరిల్లా టైపులో ట్రై చేసినా కుదరడం లేదు.యిక తన విశ్వరూపం చూపించక తప్పదనుకున్నాడు.వెంటనే తన అనుచరులనురంగంలోకి దింపాడు.

అమెరికాలో అటాక్ చేసిన టైప్ లో స్టేట్ గవర్నమెంట్ ఆయుధాలతో కబ్జా చేసిన వాళ్ళ పని పట్టలాని అనుకున్నాడు. కానీ, అది కుదరక పోవడంతో తనే స్వయంగా రంగంలోకి దిగాడు. యముండ...టైపులో నేను లాడేనుండ అని మెషిన్ గన్ లు,బాంబర్ లు బయటకు తీసాడు.

నానా హంగామా చేసాడు.తన చరిత్ర అంతా క్యాసెట్స్ రూపంలో తయారుచేసి,కబ్జాదారులకు పంపించాడు.

అతి కష్టం మీద తాను అనుకున్నది సాధించాడు.పదిహేను రోజులు సుదీర్ఘ పోరాటం తర్వాత హైదరాబాద్ లో కబ్జా అయిన భూములకు విముక్తి కలిగింది.కాకపొతే ఈ ప్రయత్నంలో చాపు దప్పి కన్నులొట్ట పోయినట్టయింది లాడెన్ పరిస్థితి.

కడప బాంబు జస్ట్ లో మిస్సయి అతని వీపుని కొద్దిగా డామేజ్ చేసింది.వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రిలో జాయిన్ చేసాడు గోపాలం లాడెన్ ని.

సరిగ్గా అప్పుడే,అక్కడే అతని ఖర్మ కాలింది.గవర్నమెంట్ ఆస్పటల్ ట్రీట్ మెంట్ రుచి అర్థమైంది.ఓ డొక్కు,తుక్కు సగం విరిగిన ఇనువ మంచం మీద గిరాటేసారు లాడెన్ ను.

“ అయామ్ లాడెన్ " అన్నాడు కోపంగా లాడెన్.

“హ్హి హ్హి హ్హి "అని నవ్వి " సద్దాం హుస్సేన్ అయినా,ఈదీ అమీన్ అయినా మా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇలాగే వుంటుంది " అంటూ భుజం మీద గుచ్చాల్సినవి ఒళ్ళు నుండి మోకాల్లో గుచ్చారు.

తన మెదడుకు ఆ సూది గుచ్చుకోవడంతో... లాడెన్ కెవ్వున కేకేశాడు.

అలా మూడు రోజులు ఆ హాస్పటల్ లో నరకం అనుభవించి... నాలుగో రోజు గోపాలం రాగానే... “ గోపాలం...నన్ను హాయిగా ఆ అమెరికా వాళ్ళకే అప్పగించేయ్ " అన్నాడు ఏడ్పు గొంతుతో.

“ హా...వెయ్యి గొడ్లను తిన్న రాంబందు ఒక గాలివానతో సరి...అంటే యిదే మరి...” అనుకొని,” లాడెన్ జీ...మా పని పూర్తయింది.మాకిక కబ్జాదారుల బెడద లేదు.యిదిగోండి మీ ఫీజు "అంటూ పెద్ద స్టీలు డబ్బా నిండా రూపాయి, రెండు రూపాయలు,అయిదు రూపాయల నాణేలు యిచ్చాడు.

“ ఇదేంటి...నాకు డాలర్స్ లో, ఏ లక్షల్లో యిస్తారనుకున్నాను " అన్నాడు లాడెన్ కోపంగా.

“ మా స్థలాలు మావే అంటూ కోర్టు చుట్టూ నాయకుల చుట్టూ,గుండాల చుట్టూ తిరిగి...తిరిగి మేము కొన్న రేటు కన్నా, ఖర్చు పెట్టిందే ఎక్కువైంది.అందుకే అతి కష్టం మీద...క్షమించాలి మరి...” అన్నాడు గోపాలం.

చేసేది లేక పోనీలే అమెరికా బాధ నుంచి కొంత కాలం విశ్రాంతి దక్కించుకుంటాను.ఆ నాణేల డబ్బా నెత్తిమీద పెట్టుకుని ఆఫ్గానిస్తాన్ కు బయలుదేరుతుండగా ఫోను వచ్చింది లాడెన్ కు.

“ సాబ్...మీరిక్కడికి రావోద్దంటా "

“ క్యాబే...ఏమైంది ?అమెరికా వాళ్ళు మన బంకర్లు ఖతం చేసారా ?”

“ నహీ సాబ్...అమెరికా వల్ల మనకేం డేంజర్ ఎదురవ్వలేదు.కానీ సాబ్ ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారు కబ్జాదారులాట.భూబకాసురులట.అక్కడ హైదరాబాద్ లో వాళ్ళని మీరు తరిమేసి చంకలు గుద్దుకున్నారట...మా సత్తా దేఖో " అంటూ మన బంకర్లను కబ్జా చేసి, గుడిసెలు వేసుకున్నారు.

ఎంతకీ కదల్డం లేదు.గట్టిగా మాట్లాడితే ఏం చేసుకుంటారో చేసుకోండి.వెళ్లి జార్జిబుష్ కు చెప్పుకోండి అంటూ తెలుగులో బండబూతులు తిడుతున్నారు సాబ్ "

“ ఖా...మో...ష్...” అంటూ తన చేతిలో వున్నా మెషిన్ గన్ తో తల మీద గట్టిగా కొట్టుకున్నాడు లాడెన్. అంతే...అతని తల వరల్డ్ ట్రేడ్ సెంటరైంది.

“ థాంక్యూ మిస్టర్ గోపాలం...ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వ్యక్తిని మటాష్ చేసినదుకు,మేము ప్రకటించిన విధంగా నూట యిరవై కోట్లు యిస్తున్నాం.తీసుకోండి " అన్నాడు అమెరికా ప్రెసిడెంట్ జార్జిబుష్.

వాజ్ పేయ్ గోపాలం భుజం తట్టాడు.హైదరాబాద్ లో తలనొప్పిగా వున్న, కబ్జాదారుల ఆట కట్టించడమే కాక, భారదేశానికి మెడ నొప్పిగా వున్నతీవ్రవాద పోషకున్ని ఫినిష్ చేసినందుకు సి.యం.గోపాలాన్ని అభినందించి,పనిలో పనిగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆ నూట ఇరవై కోట్లు అప్పుగా యివ్వమని అడిగాడు.

గోపాలం ఆలోచనలో పడ్డాడు.

*****

ఇంతకు ఈ కథకు ఫినిషింగ్ టచ్ ఏమిటి ? ఎలా వుండాలి ? తీరా చూస్తే యిదంతా గోపాలానికి వచ్చిన కలలా వుండాలా ? హమ్మయ్య ఇలాగే బాగుంది...కలెందుకు...యిదే నిజమైతే బావుండు...అనేలా వుండాలా ?. ఫినిషింగ్ టచ్ ఏమిటో...మీ ఊహకే వదిలేస్తూ...