Navvula Najarana

"బండూ అటకెక్కడం "

ఎన్.జగన్నాథ్.

“ ఆ బీరువా తాళం చెవి ఎక్కడుంది ?” అని ఏదో మాములుగా అడిగినట్లు అడిగాడు బండూ.

ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు తన ముఖంలో భావం అతి అమాయకంగా కనబడేట్టు జాగ్రత్త పడ్డాడు .

“ ఎందుకేం, మీకా తాళం చెవి ?” అని ఎదురు ప్రశ్న వేసింది లత. మొగుడి ముఖం మీద అతి అమాయకపు ముద్ర చూడగానే తనకి అనుమానం వేసింది.

అడుగుతూనే " ఇప్పుడు మళ్ళా డబ్బెందుకు మీకు ? నిన్నేనేగా బోల్డంత తీసుకువెళ్ళారు నా దగ్గర్నుంచి "? అని.అంత వరకు గుప్తంగా ఉన్న అతని ఉద్దేశాల మీద బురఖా పీకి వేసింది.

“ అయితే ఏమిటి నువ్వనేది ? నేను గొడుగుకూడా కొనుక్కోకూడద ఏమిటి ? ఇహ రేపటి నుంచి గుడ్డలు కూడా కుట్టించుకోవద్దంటావు గాబోలు !చినిగినవె వేసుకుని ఆఫీసుకు పోమ్మంటావా ఏమిటి ?”అంటూ ఒక్కసారిగా పెద్ద స్థాయిలో గందరగోళం చేస్తూ వుపన్యాసం దంచేశాడు బండూ.

“ అయినా మీకీ మధ్య సిగరెట్లు మహా ఎక్కువయాయి.ముందర అది తగ్గించేస్తాను " అంటూ స్త్రీ సహజమైనా చాతుర్యంతో సంభాషణని తన యిష్టం వచ్చిన వేపు మళ్లించేసింది లత.

“ ఊ..ముందర ఓ వంద రూపాయలిట్లా పడేయ్యి.నీ పోరు నాకనవసరం " అని బండూ అతి ధైర్యంగా అసలు విషయంలోకి వచ్చాడు.

“ గొడుగు కొత్తదెం కొనక్కర్లేదు.మీరు క్రిందటి సంవత్సరం కొన్న గొడుగు ఉందింట్లో " అని లత కూడా అంతటి ఖరాఖండీగానూ జవాబు చెప్పింది.

“ ఎక్కడుందా గొడుగు ?” అంటూ తలెత్తి దూలాలు, వాసాలూ పరీక్ష చేస్తూ ప్రశ్నించాడు బండూ.తన గొడుగు ప్రతి సంవత్సరమూ మాయమై పోతుంటుందని అతనికో నమ్మకం.

“ నేను దాన్ని ఒక గుడ్డలో చుట్టి జాగ్రత్తగా అటకమీద దాచాను " అంది ఆ యిల్లాలు.

“ ఎప్పటి గొడుగదీ ? ఆ పిడి విరిగిపోయిన గొడుగా ఏమిటి ? అది నే చచ్చినా వాడను సుమా ! నాకు మాత్రం కాస్త డిగ్నిటీ అంటూ ఉండాలా అక్కర్లేదా ?” అన్నాడు బండూ.

“ ఆ పిడి విరిగిపోయినది, ముందటేటిది.అది మీ రెండో గొడుగు.యిప్పుడు నేను అటకమీద జాగ్రత్త చేసినది మీ అయిదవ గొడుగులెండి " అంటూ కేవలం తల పంకించినందువల్ల భర్తని తబ్బిబ్బు పెట్టడం ఎలాగో ప్రదర్శించింది లత.

“ సరే అయితే, ఉంటే చూపించోసారి, నాకేదయితేనేం గొడుగు వుంటే చాలు " అని చాలా నిష్కామిలాగా మాట్లాడాడు బండూ,ఆ గొడుగుని ఈపాటికి బొద్దింకలు కొట్టేసి వుంటాయని మనసులో మాత్రం గట్టి నమ్మకమే పెట్టుకుని. మరుక్షణంలో ఒక స్టూలు తీసుకు వచ్చి, అటక క్రింద పెట్టింది లత.

“ దీని మీంచి అటకమీదకెలా ఎక్కటం ? ఇంకేదయినా బాగా ఎత్తుగా ఉన్నది వుండాలి.” అని అభ్యంతరం లేవదీశాడు బండూ.

“ మన పనివాడు రాముడు దీనిమీంచి అటకమీడికి ఎక్కేస్తాడు.ఇట్లా పట్టుకుని,ఇలా వెళ్లాడుతాడు మొదట.ఆ తర్వాత గబుక్కున ఒక పాదం ఇలావేసి, అటకమీదికి తీసుకెళ్ళిపోతాడు" అంటూ లత యాక్షన్ చేసి చూపించింది.

ఆపని ఎంతో సులభమయినట్లు కూడా ముఖభావం ద్వారా సూచించింది. బండూ ఆవిడవేపు అమిత సంశయంతో ఓసారి చూశాడు.కాని అంతట్లో అతని ధైర్యం నిద్ర లేచింది.అంచేత స్టూలు మీద నుంచుని అటక అంచు పట్టుకున్నాడు.

“ ఆ..అంతే !ఈసారి అలా వెళ్ళాడుతూనే, శరీరం పైకి గుంజుకోండి.యింకా బాగా నడుం వరకూ వెళ్ళిపోవచ్చండీ " అని లత మంచి హుషారుగా ప్రోత్సాహిస్తోంది.

బండూ, క్రింద వున్న స్టూలుని ప్రక్కకి లాగివేసి, తనే అక్కడ నుంచుని చేతులు త్రిప్పుతూ బండూకి సలహాలు చెబుతోంది.కానీ ఎంత ప్రయత్నీంచినా బండూ తన ముక్కి మూలిగిన తర్వాత అటక అంచు దగ్గరకి గడ్డం వచ్చేవరకే లేవగలిగాడు.

“ ఇంకాపైకి-యింకాపైకి వెళ్ళవచ్చు " లతకి ఉత్సాహం ఎక్కువవుతుంది.తను పమిట చెంగు దోపుకుని, తన చేత్తో బండూ అరికాళ్ళకి ఊతం యివ్వడం ఆరంభించింది.

“ఖి కి "-కిచకిచలు ఏర్పడటం వల్ల,బండూ కాళ్ళు గట్టిగా విదిలించుకున్నాడు.అంచేత రెండున్నర అడుగులు క్రిందికి జారి వూరుకుంది.

“ఇ శ్ శ్ శ్ శ్శు - అదేమిటండీ మీరు ? ఏమంత కష్టం ?వొక కాలు యిట్లా వేసెయ్యడం. ఆ తర్వాత వొక్క వూపులో పైకి వెళ్లిపోవడమును " అని అక్కడ వున్నా స్టూలే అటక అనుకుని ఎక్కి చూపించింది.

బండూ మళ్ళీ తన శక్తినంతటినీ ఉపయోగించి గడ్డం అటక అంచు వరకూ వచ్చేలాగా లేచాడు.

“ఆఁ...ఆఁ...అంతే ఇంకొంచం పైకి " అంటూ లత కేకలు వేసింది.బండూ అరికాలికి మళ్ళీ ఊతం ఇవ్వడం ఆరంబించింది.

అప్పుడే వచ్చింది పక్కింటి రాధమ్మగారు.అతి వాగుడుతో పాటు అరువులడిగే దుర్గుణం కూడా ఉందావిడకి.

గుమ్మంలో నుండి " అమ్మాయ్ లతా...” అనబోయి, లత "పైకి పైకి "అంటూ వేస్తున్న కేకలు విని ఏం జరుగుతుందో చూద్దామన్న కుతుహలంతో లోపలి గదిలోకి వచ్చేసింది.వచ్చి చూస్తే అప్పుడే అటక పట్టుకు వెళ్ళాడుతున్న బండూ కనిపించాడు.అంచేత ఆశ్చర్యంతో అలాగే నుంచుండి పోయింది.

ఆ సమయంలో మళ్ళీ కితకితలు ఆరంభమయినందువల్ల బండూ బిగ పట్టిన శ్వాస కొంచెం వదిలి " నా అరికాళ్ళు ముట్టుకోకు...వదిలిపెట్టు " అని భార్యని హెచ్చరించాడు.

అంచేత ఊతం యివ్వడం మానేసి ఆమె ఒక పక్కకు తప్పుకుంది.రాధమ్మ మాత్రం ఇహముందు ఏం జరుగుతుందో తెలియక అక్కడే నుంచుంది.

బండూ శరీరాన్ని ఒక్కసారి గుంజుకుని, ఒక కాలు విసురుగా అటక మీదికి వేసే ప్రయత్నం చేశాడు.నిజానికి అతను కూడా తను త్రికరణ శుద్దిగా అటక ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు భార్యని నమ్మించడం కోసమే అలా కాలు విసిరాడు.

అటక మీదికి ఎలాగూ కాలు విసరలేనని అనుకున్నాడే గాన, అలా విసురుగా ఊపిన కాలికి మధ్యలోనే ఏదో తగుల్తుందని కాని, అంచేత చేతులు పట్టుతప్పిపోయి తను అడ్డదిడ్డంగా క్రింద పడిపోతానని గాని అనుకోలేదు.

బండూ నేలమీద కుప్ప కూలిపోగానే వంటింట్లో గోడబల్లమీద నున్న యిత్తడి సామానంతా భూకంపం వచ్చినట్లు గడగడ లాడిపోయింది.అటూ ఇటూ చెల్లాచెదురుగా పరుచుకుపోయిన అవయవాలన్నిటినీ పోగు చేసుకుని బండూ లేచి కూర్చోగానే అతనికి కనిపించిన దృశ్యం - రాధమ్మ తన రెండు దవడలు గట్టిగా నొక్కుకుంటూ ఆ గదిలోంచి పారిపోతుండటం.

“ ఇదేమిటి ?” అనే అర్ధంతో అతని భార్య కేసి చూస్తే అక్కడ కనిపించిన దృశ్యం ఆమె పమిట చెంగు అడ్డం పెట్టుకుని నవ్వుతూ వుండడం !కోపం తెచ్చుకుని మందలించబోతుంటే ఆమె వచ్చి బండూని భుజం పట్టుకుని,కుదుపుతూ " ఏమండోయ్, మీరావిడని బ్రహ్మాండమైన తావు తన్నారు పాపం !”అంది.

“ ఏమిటీ,ఆవిడకి నా కాలు తగిలిందా ?” ఆ తర్వాత బండూకి కూడా నవ్వు ఆగలేదు.తను క్రిందపడ్డ సంగతి కూడా మరచిపోయాడు.తనకు తగిలిన దెబ్బలు కూడా నొప్పెట్టలేదు.

ఎంచేతంటే అతనికి బ్రహ్మానందం కలిగింది.అసలు ఎన్నాళ్ళునుంచో ఆ అధిక ప్రసంగపు ఇల్లాలికి యిటువంటి శాస్తి ఏదయినా చేయాలని బండూకి మనసులో ఒక కోరిక వుండేది.

ఆఖరికి నవ్వు ఆగిన తర్వాత వళ్ళంతా వంకర టింకరలు తిప్పుతూ లేచి నిలబడి " పద యిప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుందాం " అన్నాడు.

లత జంకుతూ "యింతకీ గొడుగు తియ్యనేలేదు.అటకమీంచి "అంది అసలు విషయాన్ని జలగలా పట్టుకుని.

ఇది వరకైతే ఈ విషయాన్ని ఎత్తితే చీదరించుకునేవాడేగాని, ఇప్పుడు తన మనసులో చాలాకాలం నుంచీ వున్నకోరీక తీరినందువల్ల మెత్తపడ్డాడు.

అయినా కనుబొమ్మలు మాత్రం కొంచం ముడిపెట్టి " ఇదిగో, యిటు చూడు.కాలి క్రిందకి ఏదయినా బాగా ఎత్తుగా ఉన్నది వేస్తేగాని ఆ అటక ఎక్కే ప్రయత్నం మళ్ళీ చెయ్యను " అని ఖచ్చితంగా చెప్పేశాడు.

“ అయితే స్టూలు మీద కూర్చీ పెట్టనా ఏమిటి ?” అంది లత ఎంతో ఉత్సాహంగా.

“ కుర్చీ దాని మీద నిలుస్తుందో లేదో అసలు " అని బండూ అంటూ వున్నా, లత పట్టించుకోకుండా చక చక నడుస్తూ "కుర్చీవి రెండు కాలు పూర్తిగా అనుతాయి బల్లమీద " అని ధైర్యం చెప్పింది.

“అయితే ఎట్లా మరి ? అంతకంటే హాయిగా కొత్త గొడుగు కొనుక్కోవడమే నయం కదా ! వెధవ వంద రూపాయలు ఏం లెక్క మనకి ?” అన్నాడు బండూ.

“ మిగిలిన ఆ రెండు కాళ్ళు నేను పట్టుకుంటాలెండి "

“ ఏమీ వద్దులే "అని ఖరాకండిగా చెప్పేశాడు. ఎన్నడూ లేనంత ఖచ్చితంగా చెప్పాడు కదా అని ఆవిడ కూడా ఆ విషయం వదిలేసింది.ఒక్క క్షణం ఆగి, తన జలగ ప్రవృత్తిని అనుసరిస్తూ"పోనీ ఆ కుర్చీ మీదా స్టూలు పెట్టానా?”అంది.

“ కుర్చీ మీద స్టూలు పెడతావా ? బుద్ధిలేదా ఏమిటి నీకు ?కుర్చీ విరిగిపొదూ ?” అని గట్టిగా కసిరేశాడు.

అసలు తన ఉద్దేశం కొత్తగా గొడుగు కొనుక్కోవటమన్న విషయం ఇప్పటికీ జ్ఞాపకం వచ్చింది.

“ అయితే కుర్చీ చేతుల మీద ఒక పీట పెట్టి దాని మీద స్టూలు పెడితేనేం పోనీ" అంది లత.

బండూ యీ కొత్త ఇంజనీరింగ్ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు.

“ ఏమిటీ, పీటమీద స్టూలు పెట్టి...దాని మీద కుర్చీయా ?” అన్నాడు అయోమయంగా.

“కాదండి.ఈ కుర్చీ చేతులమీద పెద్దపీట పెట్టి, దాని మీద స్టూలు పెడదాం " అని స్పష్టంగా చెప్పింది లత.

ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకుని,బండూ ఆ దృశ్యం ఊహించుకున్నాడు.ఆ తర్వాత అతి అనుమానంగా " ఇవన్నీ పట్టుకునెదవరు ?” అని అడిగాడు.

“ నేను పట్టుకుంటానండి " అంది లత ఉత్సాహంతో.

“ నో " అని ఖచ్చితంగా చెప్పేశాక,లత ముఖం చిన్నపోవటం చూసి బండూకి కాస్త తృప్తి కలిగింది.

ఆమెకు యిప్పుడే కాస్త శృంగభంగం చెయ్యాలనే సంకల్పం కలిగింది.అంచేత "నువ్వీ హంగామా అంతా చేసే బదులు ఆ కుర్చీ మీదనే స్టూలు పెట్టకూడదూ ? మధ్యన ఆ పీట ఎందుకు మళ్ళీ ?హ హ..తెలివయిన దానివే మొత్తానికి ?” అని ఎగతాళి చేశాడు.

“ అదేమిటండీ, నేను మొదట్లో అట్లాగే చెప్పాను కదా, మీరే కదూ అలా పెడితే కుర్చీ విరిగిపోతుందన్నారు ?”

“ నువ్వు ఉన్నవీ లేనివీ నేనే అన్నానంటున్నావేమిటి ? కుర్చీ ఎందుకు విరిగిపోతుంది. మంచి బలమయిన కుర్చీ అది.హాహాహా " అంటూ ఒక్క అరక్షణంలో కుర్చీ మీద స్టూలు పెట్టేసి,చక చక అటక మీదకి ఎక్కేశాడు బండూ.

ఆ తర్వాత పెద్ద సర్కను పీటు చేసినవాడిలాగ నడుం మీద చేయి పెట్టుకుని,నిటగ్గా నుంచోబోయాడు.కాని సరంబీ తలకి తగిలి నడుము దగ్గర వంగినవాడు వంగినట్టుగానే తొక్కుడు హార్మోనియంలాగా అటకమీద కూలబడిపోయాడు.

కొంచెం సేపయ్యాక వంట్లో నొప్పులు తగ్గి,కళ్ళు కూడా అక్కడి చీకటికి అలవాటు పడ్డాక,ఆ అటక మీద తనకు అత్యంత ప్రియమైన వస్తువులు చాలా వున్నట్లు కనపడ్డాయి.

“ అరె,మన టెన్నిస్ బూట్లు వున్నాయే యిక్కడ !ఇంకేం ?రేపటి నుంచి మళ్ళీ రన్నింగు మొదలు పెట్టవచ్చు "అంటూ బూట్లు క్రింద పడేశాడు.

“ అవెందుకండీ అనవసరంగా " అని లత కేక వేసింది పైకి వినబడేట్టు. కాని ఆలోపుగా బండూ తన చెస్టు ఎక్ స్పాండరు కూడా క్రిందికి పడేశాడు.తన టెన్నిసు రాకెట్ బాగుచేయించే సంకల్పం పైకి చెబుతూ అదీ క్రిందకూ జార్చాడు.

అంతలో కరేలా కనిపించింది.

చిన్నతనంలో దాంతో ఎన్నెన్ని వీరకృత్యాలు చేసాడో జ్ఞాపకం వచ్చింది.అందుచేత ఇక మీదట యిరుగు పొరుగు కుర్రాళ్ళని పోగు చేసి ప్రతిరోజు వాళ్లకి కరేలా త్రిప్పటం నేర్పే ఉద్దేశ్యంతో ఆ కరేలా కూడా క్రిందకి పడేశాడు.

అది లత పాదాలకి ఒక్క పావంగుళం పక్కగా పడింది. ఆ తర్వాత క్రికెట్ బ్యాటు చేత్తో పుచ్చుకుని 'సిక్సర్ 'కొట్టే విధానమేమిటో అటక మీదనుంచే లతకి చూపించబోయాడు బండూ.

అందుచేత వెళ్ళాడుతున్న ఎలాక్రిక్ బల్బు ఊగడం మొదలుపెట్టింది.అది చూచి బల్బు పాడయిపోయిందేమోనని భయపడి.లత ఒకసారి స్వీచ్ వేసి లైటు వెలిగాక ఊరడిల్లింది.కాని అతి ఆదుర్దాగా అతనిని మందలించడం మొదలు పెట్టింది.

“ ఏమిటండీ ఇలా ఆరంభించారు. ఆ పార వస్తువులన్నీ ఎందుకు దిగుమతి చేస్తున్నారు? ఇప్పటికే క్రింద కావలసినంత చెత్త వుంది,ఇంటి నిండా.అది చాలాదూ ?” కాని బండూ యిప్పుడు ఉత్సాహం అపరిమితంగా వృదయిపోయింది.

పెళ్లి చేసుకోక ముందు తన జీవితం ఎంత హాయిగా స్వతంత్రంగా ఉండేదో జ్ఞాపకం వచ్చింది.అంచేత అప్పటి ప్రతి వస్తువు క్రిందికి గిరవాటు వేయడం సాగించాడు.

ఆఖరికి అతనికి కాలేజిలో ఉన్నప్పుడు కొనుక్కున్న పాఠ్య పుస్తకాలు కనిపించాయి.

దుమ్మూ అదీ దులుపి వాటిని పొట్టకి హత్తుకుంటూ "ఈ పుస్తకాలు అసలు అటకమీదికి ఎవరు ఎక్కించారు ? యేమిటనునున్నారివి...లిటరేచర్ !క్లాసిక్కు యివన్నీ !వాటిని తీసుకొచ్చి యిలా దుమ్ములో పారేస్తావా ? మనదేశం యింతటి అధోగతికి ఉత్తపుణ్యానికి దిగజారిపోయిందా? ఏ దేశంలో షెల్లీ పద్యాలు, మూషికమూత్రంలో నాని పసువుపచ్చాగా అయిపోతాయే,అటువంటి దేశం యింకేమవుతుంది ?” కోపంగా అన్నాడు బండూ.

“ నాబుద్దే గడ్డితిన్నది.మళ్ళీ నా బొందిలో ప్రాణం వుండగా మిమ్ముల్ని అటక ఎక్కించను. ఇప్పటిమట్టుకు మిమ్ముల్ని కరుణించి ఈ తుక్కు వస్తువులన్నీ పైన పారేసి దిగిరండి. మీరా గొడుగు తియ్యకపోయినా పరువాలేదు " అంది లత చెంపలు వాయించుకుంటూ.

“ నువ్వు యిప్పుడు ఏం మాట్లాడకు ? ఆహా..ఈ మేఘదూతం ఇదిగో.అక్కడే వుండు.అసలు ఈ మహాకావ్యంలో వున్న ఉత్కృష్టత ఏమిటో చెబుతాను నీకు " అని బండూ అటకమీద పురాణం చెప్పే పోజులో కూచున్నాడు.

ఆ పుస్తకం మీద దుమ్ము మళ్ళీ ఓసారి దులిపాడు.అందులో పేజీలు తిరగేసి "తన్వీశ్యామా "అన్న శ్లోకం గొణగటం మొదలు పెట్టాడు.

“ చాలించండి బాబూ !చాలించండి !క్రిందకి దిగండి.దిగుతారా లేరా ?” అంటూ లత క్రిందనున్న టెన్నిసు బూటు ఒకటి పైకి విసిరేసింది.కాని కొన్నాళ్ళు క్రికెట్ ఆడినవాడు కనుక, బండూ ఆ బూటుని సునాయాసంగా "క్యాచ్ "పట్టుకుని " తన్వీ...ఏమనుకున్నావు తన్వీ" అని ఉగ్గాడిస్తూ,తన వాక్యంలో వున్నా ఉద్రేకాన్ని స్పష్టం చేసేందుకు ఆ టెన్నీసు బూట్ ని జోరుగా క్రిందికి విసిరేశాడు.

“ తన్వీ ! ఆహా..ఎంత మధురమైన శబ్దం !తన్వీ అంటే బక్క పలచగా,సన్నగా ఉన్నవనిత ! నువ్వు పెళ్ళికి ముందు ఉన్నట్లు ఎముకలపోగూ కాదు.యిప్పుడు ఉన్నట్లు ఉండ్రం ముక్కా కాదు. అదీ విన్నావా ?” అన్నాడు బండూ.

ఇక అతన్ని సముదాయించే ఆశ వదులుకుని, చెవుల్లో వెళ్ళు పెట్టుకుని, అవతలి గదిలోకి వెళ్ళిపోయింది లత. బండూ అలాగే అటకమీద కూచుని తనలో తానే ఆనందించాడు.

ఆ తర్వాత ఏమేమిటో గొణుక్కుంటూ ఆ పుస్తకాన్ని పొట్టకి అన్చుకుని క్రిందకి దిగాడు. కాలికి తగిలిన కరేలాని ఒన ప్రక్కకి దొర్లిస్తూ " ఏం కొంపరా బాబూ !ఎక్కడ చూసినా ఏదో ఒకటి అడ్డదిడ్డంగా పడేసి వుంటుంది "అని కోపంగా సణుక్కుంటూ గుడ్డలు దులుపుకుంటూ బయటికి వచ్చి కూర్చున్నాడు.

ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా కోపంతోటే కాళిదాసు కావ్యం చదువుకుని ఆనందించాడు.అంతటితో కావ్యతృష్ణ తృప్తిపడిపోవడం వల్ల కోపం మాత్రం మిగిలిపోయింది. అంచేత ఆ కోపాన్నివెంట తీసుకుని వూళ్ళోకి షికారు వెళ్లాడు.

ఆ మర్నాటి ఉదయం శుభ్రంగా ఎండకాసింది. కాని బండూ ఆఫీసుకి బయలుదేరే వేళకి ఆ ఎండ అంతర్థానమయిపోయి, వెళ్తురూ అదీ పోయి వాతావరణం తడిసిన గోనుగడ్డలా అయిపొయింది.

బండూ ఆఫీసు డ్రస్సు వేసుకుని గుమ్మం దిగబోయేటప్పటికి బటాణి గింజ సైజులో చినుకులు పడటం ఆరంభమైంది.

“ గొడుగేవ్ !గొడుగు సంగతి ఏమైంది ? నిన్నటి నుంచీ మొత్తుకుంటున్నాను.నాకొ గొడుగు కావాలని !కాని ఈ ఇంట్లో నామాటంటే లెక్కలేదేవరికీ !” అని పెద్ద పెట్టున కేకలు మొదలు పెట్టాడు.

" రాముణ్ణి అటకమీదకెక్కించి గొడుగు దింపించాలెండి " అంది లత అతి శాంతంగా.

(హాసం పత్రిక సౌజన్యంతో )