Taataadhitai Tadigibatom - 10

Episode-10

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

"గుండా?...గుండేమిటీ?" ఆశ్చర్యపోతూ అడిగింది అశ్విని.

"గుండంటే అదే అంటే గుండు సున్నా మార్కులన్న మాట! నా బాధ నీకర్థం కాదు కానీ నాయందు దయుంచి వెళ్లిపో" చేతులు జోడించాడు శ్రీరామ్.

"ఆల్ రైట్...వెళ్లిపోతాను కానీ ఒక్క షరతు"

"ఏమిటీ?"

"అశ్వినీ 'అయ్ లవ్ యూ' అనాలి!"

"ఛస్తే అనను" అని అందామనుకున్నాడు.

కానీ సరిగ్గా అదే క్షణంలో బయట ఏదో అలికిడి కావడంతో వార్డెన్ వస్తున్నాడనుకుని బెదిరిపోయాడు. "అశ్వినీ ఐలవ్ యూ" అనేశాడు గబగబా.... "ఛ!....అలాగేనా చెప్పటం?....ఖచ్చితంగా అయ్ హేట్ యూ అన్నంత అసహ్యంగా చెప్పావు!" శ్రీరామ్ నిస్సహాయంగా చూశాడు.

అంతలో అశ్విని అతనికి దగ్గరగా వచ్చింది. అతని రెండు భుజాల మీద చేతులు వేసింది.....అతని కళ్ళల్లో ప్రేమ నింపుకో! మనస్పూర్తిగా "నిన్ను ప్రేమిస్తున్నాను అశ్వినీ అని చెప్పు" ఇక తప్పదనుకున్నాడు శ్రీరామ్.

"మూడ్" తెచ్చుకున్నాడు.

ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. దాన్ని ప్రేమగా నొక్కుతూ చెప్పాడు "అశ్వినీ....! అయ్ లవ్ యూ!" ఆ స్పర్శకు అశ్విని పులకరించిపోయింది.

"థాంక్యూ శ్రీరామ్! థ్యాంక్యూ వెరీమచ్!...చాలు....ఈ రోజుకీ తృప్తి చాలు...ఇంటికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను. ఆ నిద్రలో రంగురంగుల కలలు కంటాను...నీతో కలసి రామోజీ ఫిల్మ్ సిటీలో విహరిస్తున్నట్లు ఆ కలలో కమ్మగా పాడుకుంటాను....వస్తానూ!" అతని చేతి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది.

"శెలవ్" విసుగ్గా నమస్కారం పెట్టి చిరాగ్గా చెప్పాడు శ్రీరామ్.

"నో...!శెలవ్ కాదు! సే లవ్!" అంటూ లాలనగా చూసి మళ్ళీ కన్నుకొట్టి కిటికీలోంచి బయటకు జంప్ చేసిందామె. శ్రీరామ్ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

"ఇదెక్కడి 'లవ్' రా బాబూ? రోజు రోజుకీ శృతి మించి రాగాన పడుతోంది!" అనుకున్నాడు.

దీనికేదైనా విరుగుడు కనిపెట్టాలి అనికూడా ఆలోచన చేశాడు. కొన్ని క్షణాల తర్వాత అతనికో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది...వెంటనే " నోట్ బుక్" లోంచి ఓ తెల్లకాగితం చింపి దానిమీద రాయటం ప్రారంభించాడు.

* * * *

అదో అధునాతనమైన భవంతి...! పోర్టికోలో ఖరీదైన కారుంది. భవంతికి ముందు విశాలమైన 'లాన్' లో అశ్విని 'స్కిప్పింగ్' చేస్తోంది...మరోవైపు, కుర్చీలో కూర్చున్న విష్ణుమూర్తి తన చేతిలోని కాగితంలోకి తదేకంగా చూస్తున్నాడు...వుండి వుండి 'పైవ్' పీలుస్తూ 'గుప్పుగుప్పు'న పొగ వదుల్తున్నాడు.

అంతలో పనిమనిషి రంగన్న 'యాపిల్ జ్యూస్' తీసుకొచ్చి టీ పాయ్ మీద వుంచాడు. అప్పటికీ అశ్వినీ కూడా అక్కడకు చేరుకొని కుర్చీ మీదున్న 'నేష్కిన్' తీసుకుని ముఖం తుడుచుకుంటూ తండ్రికి ఎదురుగా కూర్చుంది...."హాయ్..డాడ్" అంటూ పలకరించింది. విష్ణుమూర్తి పలకలేదు...సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.

"ఏమిటి డాడీ అలావున్నావ్?...వాట్ హేపెండ్?" అని అడిగింది.

అయినా బదులు చెప్పలేదు. "ఒంట్లో బాగోలేదా?" మామూలు ధోరణిలో మళ్లీ అడిగి అక్కడున్న యాపిల్ జ్యూస్ గ్లాసు అందుకుని తాగుతోంది.

"ఒంట్లో బాగానే వుండి! కానీ...ఈ లెటర్లో వున్న 'మేటర్' చాలా 'చీప్' గా వుంది" అంటూ తన చేతిలోవున్న కాగితాన్ని ఆమెకు అందించాడు.

గ్లాసు టీపాయ్ మీద వుంచి దాన్ని చదవసాగిందామె. "గౌరవనీయులైన విష్ణుమూర్తి గారికి, మీ అమ్మాయి అశ్విని ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి మరీ తిరుగుతోంది. ఆడపిల్లకు అంత 'ఫ్రీడం' ఇవ్వటం మంచిది కాదని మనవి చేసుకుంటున్నాను.

తను, ఈ మధ్య 'శ్రీరామ్' అనే కుర్రాడితో తెగ తిరుగుతోంది...నిన్న అర్దరాత్రి ఆమెను అతని హాస్టల్ గదిలో చూసి ఆశ్చర్యపోయాను. పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని అనుమానంగా వుంది పైగా సదరు శ్రీరామ్ చాలా దుర్మార్గుడు.

రేపెపుడో మీ అమ్మాయిని 'కిడ్నాప్' చేసి మిమ్మల్ని లక్షలో, కోట్లో తెచ్చివ్వమని 'బ్లాక్ మెయిల్' చేయగలడు." ఇట్లు, "ఆకాశ రామన్న...." ఉత్తరం చదవటం పూర్తి చేసిన అశ్విని పొట్టచేత్తో పట్టుకుని కడుపుబ్బెలా నవ్వేసింది...ఆమె నవ్వటం పూర్తయేదాకా, అలాగే ఆమెవైపు విస్మయంగా చూసిన విష్ణుమూర్తి ఆ తర్వాత అడిగాడు.

"ఆ నవ్వుకి అర్థం ఏమిటి?" "పూర్ ఫెలో!" ప్రేమించటమే చేత కాదనుకున్నాను. ఆఖరికి ఆకాశరామన్న ఉత్తరాలు రాయటం కూడా రాదు!" అంది నవ్వుతూనే.

"ఎవరి గురించి బేబీ నువ్వు చెప్పేది?" శ్రీరామ్ డాడీ!...అతనే ఈ ఉత్తరం రాశాడు..! చెప్పింది.

"శ్రీరామ్ అంటే మీ క్లాసులో బ్రిలియంట్ గా వుంటాడని చెప్పావ్ అతనేనా/" "అవునతనే!...అతన్ని నేను లవ్ చేస్తున్నాను డాడీ!...కానీ...నా లవ్వన్నా, నేనన్నా అతను 'కేర్ లెస్' గా వుంటున్నాడు. మొన్నరాత్రి సెకెండ్ షో సినిమానించి వస్తూ సడెన్ గా అతని హాస్టల్ రూమ్ కి వెళ్ళాను.

ఆవిషయం మూడో కంటికి కూడా తెలీదు. మరి ఆవిషయం గురించి కూడా ఆ ఉత్తరంలో రాశాడు అంటే డెఫినెట్ గా ఆ ఆకాశరామన్న అతనే అని నాకు అర్ధమైపోయింది!"

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)