Taataadhitai Tadigibatom - 8

Episode-8

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

"ఇక్ష్వాకుల బారసాలనాడో, అశోకుని దండయాత్రనాడో నాకే సరిగ్గా గుర్తులేదు ఆయన్ని మర్చిపోతానేమోనని అప్పుడప్పుడు ఇదిగో ఇలా ఆయన ఫోటో చూసుకుంటూటాను." అంటూనే జేబులోంచి తన తండ్రి ఫోటో తీసి ఆమెకు చూపించాడు.

ఆ ఫోటోలోకి పరిశీలనగా చూసింది ఆశ్విని."ఆహా! కుచ్చులకిరీటం ఒక్కటి తక్కువైందన్నమాటేగానీ శ్రీకృష్ణదేవరాయల్లా కనిపిస్తున్నారు మీ నాన్నగారు."

"అవును! అందుకే ఆయన భాషకూడా అదే స్థాయిలో వుంటూంటుంది ఖర్మం చాలక మీరు నన్ను పెళ్ళి చేసుకుని మా ఇంటికి కాపురానికొచ్చినా ఆయన భాష వినలేక మూడోనాడే నానించి విడాకులు తీసుకుంటారు!" చెప్పాడు శ్రీరామ్.

"మొత్తానికి 'శ్రీరామచంద్రమూర్తి' అని పేరు పెట్టినందుకు పితృభక్తి పరాయణుడివనిపించుకుంటున్నావ్!" నవ్వేసిందిఅశ్విని. భక్తేమిటి నా బొంద? భయం."

'అయితే ననేంటే నీకు ప్రేమలేదా?' నిష్ఠూరంగా అడిగింది క్షణం సేపు "ఏం చెప్పాలా?" అని ఆలోచించి తర్వాత తన పక్కనే వున్న 'రావిచెట్టు' ను చూపించి అన్నాడు. మీరంటే నాకు ఈ మహావృక్షం అంత ప్రేముంది! ఏం లాభం? పెళ్లికి దారి తీయని ప్రేమ శుద్ధ వేస్టని మా ఫ్రెండు చెప్పాడు ఆ విషయం తెలిసుండీ ఇంకా ప్రేమించటం మూర్ఖత్వమనిపించుకుంటుంది నేను మూర్ఖుడ్ని కాలేను అశ్విని గారూ!"

వద్దులే! అయినా మూర్ఖుడివి నువ్వెందుకవుతావ్? నేను మూర్ఖురాల్ని ! మూర్ఖత్వం నాదీ ! అందుకే నువ్వు నన్ను 'గారూ' అని మన్నించి మాట్లాడుతూ నేను మాత్రం 'నువ్వు' అంటూ ఏకవచనం సంయోగం చేస్తున్నాను 'సినీమా హీరో' లా అందంగా వున్నావూ క్లాసులో ఎప్పుడూ ఫస్టుమార్కులు తెచ్చుకుంటావూ ఓ అందమైన ఆడపిల్ల పిలచివస్తే కాదు పొమ్మనవులే అనుకుని ఓవరయ్యాను కదా! అందుకని నేను మూర్ఖురాల్ని' బెంచీ మీదనించి చివ్వున లేచిపోయింది.

అశ్విని మనసు నొప్పించినందుకు శ్రీరామ్ బాధపడ్డాడు. అశ్వినీ ! ప్లీజ్ ! నా మనసేమిటో నా బ్యాక్ గ్రౌండేమిటో తెలుసుకోకుండా చొరవచేసి ప్రేమించిన నేరం నూటికి నూరుపాళ్లూ నీదే! అయినా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను! దయవుంచి నన్ను మర్చిపో" అన్నాడు తప్పుచేసిన వాడిలా తలవంచుకుని.

పెల్లుబికి వస్తున్న కన్నీళ్ళను బలవంతాన ఆపుకునే ప్రయత్నం చేస్తూ అక్కణ్ణించి విసవిసా నడిచివెళ్లిపోయింది అశ్విని భారంగా నిట్టూర్చాడు శ్రీరామ్ !

*                      *             *

ఊరంతా సంక్రాంతి సంబరాలతో కొత్త అందాల్ని సంతరించుకుంది. వీరభద్రం మేస్టారి ఎత్తరుగుల ఇంటిపక్కనే వున్న కొబ్బరిచెట్టు మీదనించి, దక్షిణమూర్తి దగ్గరే వుండి నారాయణతో కొబ్బరి బొండాలు దింపిస్తున్నాడు. వీరభద్రం వీధి అరుగుమీద కూర్చుని పేపరు తిరగేస్తున్నాడు. దూరంనించి 'గంగిరెద్దు ను ఆడించే అప్పలస్వామి సన్నాయి ఊదుతూ వస్తున్నాడు ఆ ఎత్తరుగుల ఇంటికి చేరుకుంటూ ఉండగానే ఆ ప్రయత్నంగా వీరభద్రాన్ని చూసి సన్నాయిని హఠాత్తుగా ఆపేసి గబగబా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతున్నాడు.
అయితే ఆ దృశ్యం వీరభద్రం చూడనే చూశాడు
అయ్యా ! అప్పలస్వామి గారూ ! పిలిచాడు
అప్పలస్వామి ఆగిపోయి భయంగా చూశాడు
ఇలా దయచేయండి అని పిలిచాడు వీరభద్రం మళ్లీ
రానంటూ 'మొరాయిస్తున్న గంగిరెద్దుని బలవంతగా లాక్కుంటూ వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు అప్పలస్వామి.

ఏమిటి తమరి ఉద్దేశ్యం? అందరి ఇళ్ళముందూ నీ వృషభాన్ని ఆడించి మా ఇంటి ముందు మాత్రం ఆగక దాటిపోవుచున్నావు తమరి ఒళ్ళు ఎలా వుందేమిటి?" అతనిమీద ఉరిమేడు వీరభద్రం.

'చిత్తం! అయ్యగారు పేపరు చదువుతున్నారు కదా? మా సన్నాయి వాద్యం తమరికి ఇబ్బందీ గట్రా అవుతుందనిపించి సడీసప్పుడూ సేయకుండా ఎల్లిపోతారనుకున్నా! ఇపుడు తమరే పిల్సి ఆడించమంటున్నారుగా ఆడిస్తా బాబూ!" భయంగా చూస్తూ చెప్పాడు. కొబ్బరిబొండాలు దింపటం పూర్తిచేసిన నారాయణ కూడా అక్కడకు చేసుకున్నాడు.

అప్పలస్వామి తన సన్నాయి సవరించుకుని ఊదటం ప్రారంభించాడు కానీ గంగిరెద్దులో చలనం లేదు భయంభయంగా వీరభద్రం వైపు దొంగ చూపులు చూస్తుండిపోయింది.
అప్పలస్వామి ఖంగారు పడ్డాడు.
"పెద్దయ్యగారు  సూత్తారంట! ఆడరా బసవన్నా! బాగా ఆడితే పై మీది కండువా ఇస్తారు. నీకు పన్నెం వుంటుంది ఆడ్రా!" సన్నాయి ఊదటం ఆపి బుజ్జగించాడు.
అయినా గంగిరెద్దులో చలనం లేదు.


(ఇంకావుంది)