Taataadhitai Tadigibatom - 7

Episode -7

తాతా ధిత్తై తరిగిణతోం

జీడిగుంట రామచంద్రమూర్తి

"ఏవమ్మా ! చెల్లెమ్మా! అందరూ కులాసాయేగా ? మా వీరభద్రుడితో మాట్లాడేకంటే నీతో యోగక్షేమాలు విచారించటమే ఈజీగా వుంటుంది ఏడీ? మీ చిన్నవాడు కనిపించడేం?"

"ప్రయివేటు చెప్పించుకోవటానికి వెళ్లాడు అన్నయ్యా!"

"పండక్కి హైదరాబాదు నించి అమ్మాయిలూ అల్లుడూ వస్తున్నారా?" కాఫీ తాగటం పూర్తయ్యాక అడిగాడు మళ్లీ.

"ఇదిగో ఇప్పుడే అల్లుడి దగ్గర్నించి ఉత్తరం వచ్చింది పండక్కి వస్తారట."

"అయితే పండగ సందడంతా మీ ఇంట్లోనే వుంటుందన్నమాట !" చిదంబరం అన్నాడు వీరభద్రాన్ని చూస్తూ.

"సందడి సంగతికేమొచ్చెగానీ ఇప్పుడొక సమస్య వాటిల్లిందిరా చిదంబరం."

వీరభద్రం గొంతులో దిగులు ధ్వనించింది.

"సమస్యా? ఏమిట్రా అదీ?"

"అనాడు అమ్మాయి పెళ్లిలో అల్లుడికి నేను కట్నం కింద ముప్పయ్ వేలు బాకీ పడితిని."

"ఔనౌను. చెప్పావ్. త్వరలో ఇచ్చేస్తానంటూ అతనికి కాయితం కూడా రాసిచ్చినట్టున్నావ్

గా?"

"అదే ఆ బాకీ తీర్చమని అల్లుడుగారు ఇప్పుడీ ఉత్తరం ద్వారా తాఖీదు పంపించినారు.

వారు పండుగకు వచ్చినప్పుడు నేను రోఖ్ఖము వారి చేతిలో పెట్టుటకు సిద్ధముగా

వుండవలయునట."

"ఓస్ ! ఇంతేకదా? ఎలా అయినా అది ఇవ్వాల్సిందేగా? ఇచ్చెయ్ ! నీకు ఏదైనా ఇబ్బందైతే

చెప్పు ! ఇప్పుడే నా రైతు డబ్బిచ్చాడు దాన్ని నేను నీకు సర్దేస్తాను నాకు తర్వాత

ఇద్దువుగాని" అంటూ జేబులోంచి నోట్ల కట్టలు తీయబోయాడు చిదంబరం.

అతని ప్రయత్నాన్ని వారించాడు వీరభద్రం.

"డబ్బు గురించి ప్రాబ్లమ్ లేదురా! కానీ, కట్నకానుకలు ఇచ్చుటా, పుచ్చుకొనుటా మా

మావల సంఘం నిషేధించింది" అని చెప్పాడు.

"ఓ అదా నీ బాధ? ఎవరికీ తెలియకుండా అల్లుడి చేతిలో పెట్టేయ్ అప్పుడు గొడవ

వుండదు." సలహా ఇచ్చాడు చిదంబరం.

"వీల్లేదు మిత్రమా! అలా చేసి ఆత్మద్రోహం గావించుకోలేను!"

"అయితే ఆ మాట అల్లుడితో ఖచ్చితంగా చెప్పేయ్ అయినా నువ్వసలే 'టెర్రర్' వి కదరా?

నీకు ఎదురుపడి అడిగే దమ్ము నీ అల్లుడికి వుండద్దూ?"

"ఆ మాట వాస్తవమే ! కానీ వానివద్ద బ్రహ్మాస్త్రం వుంటుంది కదా?" చిదంబరానికి అర్థం

కాలేదు.

"అదేరా! ఈ మధ్య దినపత్రికల్లో మనం చూస్తూనే వున్నాం కదా?"

"దినపత్రికల్లోనా?

ఏమిటీ? ఏ విషయం?"

"వరకట్నపు మరణములు ఇప్పుడు నేనా బాకీ తీర్చనిచో, నా కుమార్తె మీద అతగాడు పెట్రోలు పోసి తగులబెట్టి అనంతరం, తన భార్య ఆత్మహత చేసుకోన్నదని ప్రకతించునేమోనని అనుమానముగా వుంది ! ఊరంతా నాకు భయపడుతుంటే నేను మాత్రం ఈ దిశమగ్రహానికి గల దిగ్గవలసిన దుస్థితి ఏర్పడింది." దిగులు నిండిన స్వరంతో చెప్పాడు వీరభద్రం.

"మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?"

"అదే దిక్కుతోచడం లేదు. నీవు వకీలువి కదా? కీలెరిగి వాతపెట్టగల దిట్టవి ఏదో ఒక గట్టి సలహానిచ్చి పుణ్యం కట్టుకో !" అంటూ ఆశగా చిదంబరం చేతులు పట్టుకున్నాడు.

"సలహా అంటే" ఆలోచనలో పడ్డాడు చిదంబరం.

"అవును మిత్రమా ! ప్రస్తుతం ఈ పనదక్కి గండం గడిచి గట్టెక్కే ఉపాయం ఏదైనా చెప్పు! ఈ మిత్రుని ఆపద తీర్చు. ఆలోచిస్తూనే చిదంబరం రెండు క్షణాలు అటూ ఇటూ పచార్లు చేశాడు.

"ఆ ! ఓ పని చెయ్యి! ముందు సామదానాన్ని ప్రయోగించు! ఈ ఏడు పంటలు బాగా దెబ్బతిన్నాయని చెప్పి వాయిదా అడుగు ! ప్రస్తుతానికి గండం గడుస్తుంది. ఒకవేళ నీ అల్లుడు ససేమిరా అంటే అప్పుడు దండోపాయం వుండనే వుంది."

"దండోపాయమా? అంటే?" ఆసక్తిగా చూస్తూ అడిగాడు వీరభద్రం.

అతనికి దగ్గరగా వెళ్లి చెవిలో రహస్యంగా చెప్పాడు చిదంబరం.

"ఈ ఉపాయం ఫలిస్తుందంటావా?" అనుమానంగా అడిగాడు వీరభద్రం.

"లేడిస్ సెంటిమెంట్ కి తిరుగుడుండదు కనుక మీ ఆపద దృష్టిలో పడేలా అలా నాటకం

ఆడేవంటే ఇక తక్కిన కథ ఆటోమేటిగ్గా ఆవిడే చూసుకుంటుంది." ఇంతలో వంటింట్లోంచి

పార్వతమ్మ వచ్చింది.

"భోజనానికి లే అన్నయ్యా!"

"లేదమ్మా ! ఇంతకుముందే మా రైతు మినప సున్నెపెట్టి కొబ్బరి బొండాలు కొట్టిచాడు కడుపు 'ఫుల్' గా వుంది అయినా కారెక్కి కూచుంటే రెండు గంటల్లో ఇంటి దగ్గరుంటాను!" చెప్పాడు చిదంబరం.

ఆ తర్వాత మరి కాసేపు వీరభద్రంతో పిచ్చాపాటీ మాట్లాడి, వాళ్ళ దగ్గర శలవు తీసుకున్నాడు.

* * *

శ్రీరామ్ సీరియస్ గా తలవంచుకుని పరీక్ష రాస్తున్నాడు. అంతలో అతని పాదాల దగ్గర ఓ కాగితం వుందా వచ్చి పడింది ఉలిక్కిపడి చూశాడు. ఆ కాగితం వుండను తీసుకోమంటూ సైగలు చేస్తోంది పక్క బెంచీమీద కూర్చుని పరీక్ష రాస్తున్న అశ్విని.

శ్రీరామ్ కి చెమటలు పోస్తున్నాయి ఆ దృశ్యాన్ని వాచర్ గమనించాడు. అతని దృష్టి 'కాగితం వుండ' మీద పడింది. నెమ్మదిగా వచ్చి దాన్ని చూసి చదివాడు తనలో తనే ముసిముసిగా నవ్వుకున్నాడు తర్వాత అశ్విని దగ్గరకు వెళ్లాడు. ఎవ్వరికివ్వమంటావ్ చిట్టి తల్లీ? అడిగాడు. అశ్విని ఖంగారు పడలేదు శ్రీరామ్ ని చూపించింది.

'గుడ్! మంచి సెలక్షనే !" అంటూ ఆమెవైపు మెచ్చుకోలుగా చూసి, దాన్ని అతనికి అందించాడు ముసలి వాచరు.

బెదిరిపోతూనే ఆ కాగితంలోకి చోశాడు శ్రీరామ్. అందులోవున్న వాక్యాల్ని తనలో తనే చదువుకున్నాడు.

"ఇవాళ సాయంత్రం అయిదింటికి పార్కులో కలుసుకోవాలి! చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి!" సాయంత్రం పార్కులో ఆమెను కలుసుకుని తన మనసులో మాట చెప్పేసి ఇక ముందెన్నడూ తనకలా ప్రేమలేఖలు రాసి వేధించద్దని హెచ్చరించాలనుకున్నాడు.

సరిగ్గా అయిదయ్యేసరికి పార్కుకి చేరుకున్నాడు శ్రీరామ్.

"నాకు తెలుసు నువ్వు వస్తావని! ఎందుకంటే నువ్వు నన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నావ్ కనుక!" అప్పటికే పార్కుకి చేరుకున్న అశ్విని ఐస్ క్రీం తింటూ శ్రీరామ్ కి ఎదురుగా వచ్చింది. శ్రీరామ్ మాట్లాడలేదు కోపంతో ఉడికిపోతున్నాడు.

"మాట్లాడవేం? నువ్వు నన్ను లవ్ చేయటం లేదా?" రెట్టిస్తూ అడిగిందామె.

"ఈ విషయంలో ఇక మాట్లాడవలసింది ఏమీలేదని ఇదివరకే చెప్పాను! ఇప్పుడు మళ్లీ ఆఖరుసారిగా చెప్తున్నాను ఇలా నా వెంట పడి వేధించకు మా అత్తయ్యకి ఓ కూతురుంది ఆ పిల్లను నాకిచ్చి చేస్తానంటూ మా అత్తయ్య ఏనాడో మా నాన్నకి చెప్పింది అప్పుడు మా నాన్న తనకు మాట కూడా ఇచ్చేశాడు ఆ మాటకు కట్టబడి నేను మా అత్తయ్య కూతుర్ని చేసుకు తీరాలి!" పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసి అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు శ్రీరామ్.

అశ్విని కూడా అతని పక్కనే వచ్చి కూర్చుంది. "మహామహా కాన్ స్టిట్యూషన్స్" లోనే మార్పులూ చేర్పులూ చేస్తున్నారు అలాంటిది 'మామూలు మాట' మారిస్తే తప్పా? అయినా 'మేనరికాలు' చేసుకుంటే మూగపిల్లలూ, చెవిటిపిల్లలూ పుడతారట రేడియోవాళ్ళూ టీవీ వాళ్లూ గంటకోసారి గంటకొట్టినట్టు చెప్తున్నారు" అతన్ని దారికి తెచ్చుకోవాలన్న ప్రయత్నం మానలేదామె.

'చూడండి అశ్విని గారూ! మీరు నన్ను లైన్లో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదిరే వ్యవహారం కాదు మా నాన్నగారి మాట కాదని, నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను ! నేనేకాదు మా ఇంట్లో, ఆ మాటకొస్తే మా ఊళ్లో కూడా అందరూ మా నాన్నగారికి భయపడి తీరవలసిందే! అసలు ఆయన ముఖంలోకి చూడాలంటేనే అంతా హడలిపోతారు ఆయన గారి భాష ఎవ్వరూ వినలేరు."

"ఎందుకనీ?" అడిగింది అశ్విని వెంటనే.

"అడక్కండి! అదంతే! ఆయనగారి 'ఫేస్ వేల్యూ, భాష వేల్యూ" అంత గొప్పవి ఆ మాటకొస్తే నేను మా నాన్నగారి ఎదుటపడి, మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా?" అశ్విని ప్రశ్నార్థకంగా చూసింది.

ఇంతలో శ్రీరామ్ చెప్పాడు మళ్లీ.

ఇంకావుంది