Taataadhitai Tadigibatom - 6

Episode 6

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

"హు...రడీ చేసి పట్టుకోవాలట... ఇదేమైనా పకోడీల పొట్లమనుకొనుచున్నాడా?" ఆ ఉత్తరాన్ని పదహారు ముక్కలుగా చింపేస్తూ అన్నాడు వీరభద్రం.

అప్పుడే హాల్లోకి వచ్చిన పార్వతమ్మ భర్త వైఖరి చూసి సందేహంగా అడిగింది.

"ఏమిటా కాగితం? దాన్నలా చింపేస్తున్నారేమిటీ?"

"మంచి మానవుణ్ణి కనుక చింపేశాను. అలాకాక ఈ లేఖను పోలీసులకు అందించినచో నీ అల్లుణ్ణి ఈపాటికి అరెస్టు చేసి వుందురు."

"అయితే అల్లుడుగారు రాసిన ఉత్తరమూ అదీ? ఏం రాశారేమిటి?" ఆత్రంగా ముందుకొచ్చి అడిగింది.

"వారికి మనం పెళ్లి ముహూర్తాన బాకీ పడిన కట్నం నలభైవేలూ రెడీగా పూల బుట్టలో పెట్టి పట్టుకొని వుండవలెనట. వారు సంక్రాంతి పండుగనాడు మన గృహాన్ని పావనం చేసి దాన్ని స్వీకరించి మనల్ని ధన్యుల్ని గావిస్తారట." పార్వతమ్మ సంతోషంగా చూసింది.

"పోన్లెండి. పండక్కి మనం పిలువలేదని భీష్మించుక్కూచోకుండా తమకు తామే వస్తామని రాశాడు అల్లుడు ! ఈ ఏడైనా పంట డబ్బు రాగానే అందులోంచి నలబైవేలూ తీసి అతనికిచ్చేస్తే మర్యాదగా వుంటుంది." చెప్పిందామె.

"ఇవ్వని ఎడల ఏమి జరుగునో?" కోపంగా చూశాడు వీరభద్రం.

"ఏం జరుగుతుందీ? మన పరువు మంటలో కలుస్తుంది...అల్లుడు మంచివాడైతే మిమ్మల్నో 'పిసినిగొట్టు' గా జమ కట్టుకుని మనసులోనే తిట్టుకుంటూ ఆ డబ్బుకి నీళ్లొదులు కుంటాడు. చెడ్డవాడైతే ఆ అమ్మాయిని అగచాట్లపాలు చేస్తాడు. అయినా వాళ్ళపెళ్ళయి రెండేళ్ళయింది అప్పట్నించి 'అదిగో ఇదిగో' అంటూ ఆ డబ్బు ఇవ్వటానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఈసారి నోరు తెరచి అడిగాడు!"

"నోరుతెరచి అడగలేదు పెన్ను తెరచి రాడినాడు."

"పోనీ అలాగే అనుకోండి. ఈ సారి ఇవ్వకపోతే అతను ఊరుకోడు."

"ఊరుకొనక ఉరివేసుకుంటాడా? అట్లే కానీయమానండి. అయినా నేనిప్పుడు మావల సంఘానికి అధ్యక్షుడినన్న సంగతి మరచిపోయితివా?"

"అయితే మాత్రం?"

"కట్న కానుకలు ఇచ్చుటకానీ, స్వీకరించుటకానీ క్షమింపరాని నేరము. అందునా, సంఘమునకు పెద్దనైవుండి నేనే ఈ దుష్కార్యానికి తలపడుట ఆత్మహత్యాసదృశము."

"మరి ఆనాడు తర్వాతిస్తానని ఎందుకు చెప్పారూ?" కోపంగానే అడిగింది పార్వతమ్మ.

"అది ఆనాటి మాట! అప్పుడు నేను మావల సంఘమును ఏర్పర్చలేదు. కావున అట్లాంటివి ...కానీ ఇప్పుడు ఇచ్చుటకు వీలులేదనుచుంటిని!...దమ్ములున్నచో ఎదురుపడి అడగమను." మీసం తిప్పుకుంటూ అన్నాడు వీరభద్రం.

"చాల్లెండి సంబడం? మీ మొహం చూసి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడుగుతారుకూడానా?....అసలు ఆనాడు పెళ్లి చూపుల్లో మావాళ్లు మిమ్మల్ని సరిగ్గా చూడనిచ్చారు కాదు కనుక, మీకు నేను పెళ్ళానైపోయాను."

"ఓహో!...సరిగ్గా చూసివుంటే ఏమయ్యేదో?"

"మీ మొహం నాకు నచ్చలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పివుండేదాన్ని." సరిగ్గా అదే సమయంలో కూరల సంచీతో లోపలకు అడుగుపెట్టిన నారాయణ ఆమాటవిని కిసుక్కున నవ్వేశాడు.

"అచ్చర లచ్చలు ఇలువ చేసే మాట న్నారమ్మగోరూ!..అదేం సిత్రమోగానీ అయ్యా గారంటే పాలిచ్చే పశువుల కాణ్ణించి పాలుతాగే పసిబిడ్డల వరకూ అందరూ హడలే కదండీ!" కూరలసంచి ఆమెకు అందిస్తూ అన్నాడు.

"అఘోరించావులే!...నకిలింపులు చాలించు!" నారాయణపై కళ్ళెర్ర చేశాడు వీరభద్రం. వస్తున్న నవ్వును చటుక్కున ఆపేశాడు నారాయణ.

"సిత్తం! తమరు ఉరిసిచ్చ ఎయ్యనంటే ఓ మాట సెప్పాలనుకుంటున్నాను బాబూ!" వినయంగా చేతులు కట్టుకుని చెప్పాడు.

"ఏమిటో అఘోరించు"

"తమరి ముకారవిందంలో ఏటి రాసుందో కానీ ఆ మొహంలోకి సూత్తా సూత్తా తమర్ని ఎవరూ కూడా ఏదీ అడగలేరండి. అడుగుతారనే వుంటదండీ...తీరా తమరి మొహం సూడగానే మాటపడిపోద్దండి"

"ఎందువల్లనో" గర్వంగా చూస్తూ అడిగాడు వీరభద్రం.

"సిత్తం! అదే అర్థం కాదండిమరి! వుప్పుడు నేనున్నానండి? పాతికేళ్ళకాడినించీ తమరికాడ పనిసేత్తన్నాకదండీ!..అయినా ఇప్పటికొచ్చి 'టవున్లో కొత్త సినిమా రిలీజైందీ సూసొత్తా ఓ పదిప్పించండీ' అని ఎప్పుడైనా తమర్ని అడిగానాండీ?...లేదు...అడగనండి..అదంతే!" చెప్పాడు నారాయణ.

"అఘోరించావులే!...పొలానికి దయచేసి పనిచూసుకో...సినీమా చూస్తాడట సినీమా!... హూ" చిరాగ్గా చూసి గబగబా డ్రస్ చేసుకుని గబగబా డ్రస్ చేసుకుని గొడుగు చేతపట్టుకుని బయటకు వెళ్ళబోతూ భార్యతో చెప్పాడు. "పంచాయితీ కార్యాలయంలో మావల సంఘం మీటింగున్నది పోయివచ్చెదను. మన రైతు ధాన్యము అమ్మగావచ్చిన సొమ్ము తెస్తాడు. తీసుకొని భద్రపరచు.

" బయటకొచ్చిన వీరభద్రం గుమ్మంలో ఎదురుగా నిలబడివున్న గాడిదను చూసి ఠక్కున ఆగిపోయాడు.

"హు ! దుశ్శకునము!" విసుక్కుంటూ మళ్లీ లోపలకు వచ్చేశాడు. కోటూ, కండువా తీసి కుర్చీపైన వేసి అందులో కూలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో గుమ్మం ముందు కారాగింది. వీరభద్రం అటువైపు చూశాడు.

అప్పటికి, కారుదిగి లోపలకు వస్తున్న చిదంబరం కనిపించాడు. వీరభద్రానికి చిదంబరం బాల్య స్నేహితుడు...అందుకే ఉత్సాహంగా ఎదురెళ్ళి అతనికి స్వాగతం చెప్పాడు.

"ఓ...చిదంబరమా!...రమ్ము...రమ్ము! తమరి రాక విజయవాడనించేనా?" ఆ పలకరింపు విన్న చిదంబరం నీరుకారిపోయాడు.

"అబ్బా ! నీ ఇంటికొస్తే ఇదే ప్రాబ్లంరా వీరభద్రుడూ!...గుప్తుల కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగు వచ్చేస్తుంది నాకు!" అంటూనే కుర్చీలో కూర్చున్నాడు వీరభద్రం ముసిముసిగా నవ్వేశాడు.

"కాస్త ఆ గ్రాంధికం కట్టిపెట్టి వ్యవహారికంలో వ్యవహరించరా...నీకు పుణ్యం వుంటుంది" మళ్లీ అన్నాడు చిదంబరం.

"చూడు ఫ్రెండూ!..నాకూ అట్లే వ్యవహరించవలెనని అనిపిస్తుంది. కానీ బాల్యము నించీ వచ్చిన ధోరణి కదా?...పైగా మా పితృపాదులు రావ్ బహద్దూర్ బలభద్రం గారునూ, వారి పితృదేవులు రామభద్రం గారున్నూ అలాగే మాటలాడేవారు. ఆ లక్షణమే మాకూ సంప్రాప్తించింది!" నవ్వుతూ బదులిచ్చాడు వీరభద్రం.

ఈలోగా పార్వతమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. అందుకుంటూ అడిగాడు చిదంబరం.

(ఇంకావుంది)