Taataadhitai Tadigibatom - 5

Episode 5

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

పాఠాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్క వాక్యం కూడా శ్రీరామ్ బుర్రలోకి ఎక్కటం లేదు. తనకేదో గొప్ప అవమానం జరిగిపోయినట్లు భావించాడు. +క్లాసు అయిపోయిన తర్వాత అశ్విని వెళ్ళిపోతూంటే ఆమె వెనకాల వెళ్లాడు.

"అశ్వనీ !" కోపంగా పిలిచాడు. అశ్విని ఆగిపోయి అటూ ఇటూ చూసింది.

"పిలిచింది నేను?... ఆకాశవాణి కాదు...దిక్కులు చూడకు!" అన్నాడు అదే టెంపోలో.

"నువ్వా? నిజమేనా?...ఇంతకాలంగా నీ వెంటపడి ప్రేమలేఖలు రాస్తూంటే ఎప్పుడూ కన్నెత్తి చూడకుండా, పన్నెత్తి పలుకరించకుండా తప్పించుకు తిరిగిన నువ్వు ఇప్పుడు నా వెంటపడి నన్ను పేరెట్టి నోరారా పిలిచావా?...నేనెంత అదృష్టవంతురాల్నీ? ఆ భగవంతుడు నన్నిప్పటికి కరుణించాడన్నమాట! నా జన్మ ధన్యం చేశాడు!...డాతువంగభహే!... "డాతువంగభహే? అదేం పిచ్చిమాట?" విసుగ్గా చూస్తూ అడిగాడు శ్రీరామ్.

"డాతువంగభహే అన్నానా? బహుశా నువ్వు నన్ను పలకరించిన ఆనందంలో 'హే భగవంతుడా' అనుకోబోయి అలా రివర్స్ లో అనేసి వుంటాను. అశ్విని మాట్లాడలేదు.

"నువ్వు అస్తమానూ ఇలాంటి పిచ్చిచేష్టలు చేయటం ఏమీ బాగాలేదు...." అంటూనే జేబులోంచి నలిగిపోయి ఉన్న 'ఐలవ్ యూ కాగితం తీసి ఆమె ముఖం మీదకు విసిరేశాడు.

"అవి పిచ్చి చేష్టలు కాదు మైడియర్ శ్రీరామ్! ప్రేమకు పరాకాష్టలు!" అంది అశ్విని కొంటెగా చూస్తూ.

''ప్రేమకూడా ఓ రకం పిచ్చే!''

''కావచ్చు...డానికి ట్రీట్ మెంట్ పెళ్లి! నువ్ 'ఉ' అన్నావంటే, ఇప్పుడే మా డాడీకి చెప్పి మన పెళ్లికి రేపే ముహూర్తం పెడితే మా డాడీ నన్ను ఉప్పుపాతరేస్తాడు...అంచేత నాపై అలాంటి ఆశలు పెట్టుకోకు....గుడ్ బై! అంటూ గబగబా ముందుకు వెళ్లిపోయాడు శ్రీరామ్. అతన్ని చూసి మనసులోనే నవ్వుకుంది అశ్విని!

* * *

హైదరాబాద్ లో మధ్యతరగతి కుటుంబాలూ ఓ మాదిరి సంపన్న కుటుంబాలూ కలిసి జీవించే విజయనగర కాలనీ అది! ఆ కాలనీలో ఓ సంపన్నుల పెరటివాటాలో రాజేంద్ర అద్దెకుంటున్నాడు. ముందుగదిలో కూర్చుని వారపత్రిక చదువుతున్న రాజేంద్ర ఓ నిముషం తర్వాత లోపల వున్న భార్యని పిలిచాడు.

"గీతా!...గీతా!" బదులు రాలేదు.

"ఏం చేస్తున్నావోయ్ లోపల?" అంటూ లోపలకు చూసి మళ్లీ పిలిచాడు.

అయినా జవాబు రాలేదు...పుస్తకం పక్కన పెట్టి పక్క గదిలోకి వెళ్లాడు. అక్కడ గీత కనిపించలేదు...వంటింట్లో చూశాడు...అక్కడా లేదు...రాజేంద్ర పెరట్లోకి వచ్చాడు. అక్కడ గోడ దగ్గర ఓ చిన్న స్టూలు మీద నిలబడలేక నిలబడుతూ గోడ అవతల వున్న ఇంట్లోకి చూస్తోంది గీత.

రాజేంద్ర కూడా నెమ్మదిగా అక్కడకు చేరుకొని అనుమానంగా గోడవతలకు చూశాడు. అవతల ఇంట్లో టీవీలో సినీమా కనిపిస్తోంది. ఆ ఇంటికిటికీ తెరచి ఉండటాన అందులోంచి టీవీ చూస్తోందామే.

"గీతా!" కోపంగా అరిచాడు రాజేంద్ర. గీత ఉలిక్కిపడి స్టూలు మీదనించి కిందపడబోయి నిలదొక్కుకుంది.

"ఇవాళ ఆదివారం!.....మొగుడు ఇంట్లోనే వున్నాడూ అనే ఇంగితం కూడా లేకుండా ఇక్కడ పీటమీద నిలబడి భరతనాట్యం చేస్తున్నావా? బుద్దుందా నీకు?" గద్దించాడు రాజేంద్ర.

"ఇవాళ టీవీలో నాగార్జున సినీమా వస్తోందండీ" పీట దిగిబోయి జవాబు చెప్పిందామె. రాజేంద్రకు ఆ 'ఎక్స్ ప్లనేషన్' నచ్చలేదు.

"టీవీలో నాగార్జున సినీమాలూ, చిరంజీవి సినీమాలు వస్తూనే వుంటాయి. కానీ వాటిని చూసే విధానం ఇదికాదు!. అంటూనే ఆమె చేయి పుచ్చుకుని బరబరా లోపలకు లాక్కొచ్చాడు. వీధి గదిలో ఓ మూలకు ఆమెను తీసుకెళ్లాడు.

"ఇదిగో...ఈ మూల ఎంచక్కా కలర్ టీవీ పెట్టుకోవాలి...ఇలారా...ఇక్కడ, టీవీకి ఈ మాత్రం దూరంలో సోఫా వేసుకుని అందులో కూర్చోవాలి. కూర్చున్నాక వేడివేడిగా జీడిపప్పో, పకోడీలో తింటూ టీవీలో వచ్చే సీరియళ్ళూ, సినీమాలూ చూడాలి. వాటిలో ఎవైనా బరువైన సన్నివేశాలొస్తే కన్నీరు పెట్టుకోవాలి. హాస్య రసాత్మకమైన సన్నివేశం వస్తే పక్క వాటాలో వాళ్ళకు వినిపించేలా ఘోల్లుమని నవ్వాలి. అంతేకానీ అలా పెరటి గోడదగ్గర పక్కింటి వాళ్ళ కరివేపాకు చెట్టు రెమ్మల్ని దొంగతనం చేస్తున్న భంగిమలో పీటమీద నిలబడి భరతనాట్యం చేయకూడదు." సీరియస్ గా చెప్పాడు రాజేంద్ర.

భర్త చెప్పిందంతా శ్రద్ధగానే విని మూతి మూడు వంకర్లు తిప్పింది గీత.

"చాల్లెండి మహా చెప్పారు ! కలర్ టీవీ కావాలని నేనేం కలవరించటం లేదు మనకున్న ఆ 'బ్లాక్ అండ్ వైట్' పోర్టబుల్ టీవీని అటక మీదనించి దింపి రిపేరు చేయించండి చాలు. ఈ మూల సోఫా లేకపోయినా, మనకున్న చాపవేసుక్కూచుని చూస్తాను...ఆఖరికి గుడిసెలో కాపురం వుండే మన పనిమనిషి రాజవ్వ కూడా టీవీ కొనుక్కుని కేబుల్ కనెక్షన్ తీసుకుంది...'మీ ఇంట్లో టీవీ అయినా లేదు..మీకు కాలక్షేపం ఎట్టా అవుతుందమ్మా' అని జాలిగా చూసి మరి అడుగుతుంటే సిగ్గుతో తల ఎత్తుకోలేక పోతున్నాను...తెలుసా?" అంటూ ఎదురుదాడి చేసింది.

రాజేంద్ర రెండు క్షణాలు ఆమెవైపు తీవ్రంగా చూశాడు... అంతలో అతనికి ఓ ఆలోచన రావటంతో గబగబా వెళ్లి లెటరుప్యాడూ, పెన్నూ, తెచ్చాడు. వాటిని గీత చేతిలో పెట్టి చెప్పాడు. ఆల్ రైట్!....నీకు కలర్ టీవీ కావాలి. అంతేగా? మళ్లీ నెల తిరిగేసరికి మనింట్లో కలర్ టీవీ కనిపిస్తుంది. ఒకే? నేను చెప్పినట్టు రాయి!" ఏం రాయిస్తాడో తెలియక అనుమానంగా చూసింది గీత.

అయినా రాజేంద్ర పట్టించుకోలేదు. తన ధోరణిలో చెప్పటం ప్రారంభించాడు. "మహారాజశ్రీ నాన్నగారికి మీ అమ్మాయి గీత అనేక నమస్కారాలు చేసి వ్రాయునది" అప్పటికి విషయం అర్థమైపోయిందామెకు.

"మా నాన్నకి ఉత్తరం రాయాలా? అంటే మా నాన్న మీకేమైనా లెటర్ రాశారా?" ఉత్సాహంగా అడిగింది.

"లేదు! రాయలేదు...ఎందుకు రాస్తాడూ? దేశంలో వున్న ముసలి అల్లుళ్ళక్కూడా సంక్రాంతి పండక్కిరమ్మంటూ వాళ్ళమావలు ఉత్తరాలు రాస్తున్నారు. ఫోన్లు చేసి బ్రతిమాలుతున్నారు. అయినా మీ నాన్న మాత్రం రాయడు. దుర్మార్గుడు! అందుకే నువ్ రాయి! మనకి రావాల్సిన కట్నం డబ్బు బాకీ నలభైవేలూ అర్జంటుగా పంపించమని రాయి. కలర్ టీవీసెట్టూ, సోఫాసెట్టూ కోనేసుకుందాం." బల్లమీద పెట్టేసింది గీత.

"ఏం? ఎందుకు రాయవ్?" పళ్లు పటపటా కొరుకుతూ అడిగాడు రాజేంద్ర

"మీకు తెలీదా? మా నాన్నంటే నాకెందుకో భయం." చెప్పింది.

"సరే...నీకు భయమైతే నాకేమిటి భయం? 'అల్లుడూ కడుస్వతంత్రుడు' నేను రాస్తాను" ఆ లెటర్ ప్యాడ్ లోంచి ఓ కాగితాన్ని బర్రున చింపి గబగబా రాసేశాడు. ఆ తర్వాత తనలో తాను చదువుకుంటున్న టైపులో గీతకు వినిపించేలా చదివాడు.

"మహారాజశ్రీ మావగారికి...వచ్చేస్తున్నాం... సంక్రాంతి పండుగకి వచ్చేస్తున్నాం...నాకు ఇవాల్సిన కట్నం బాకీ బాపతు నలభైవేలూ రెడీ చేసివుంచండి. ఇట్లు మీ అల్లుడు రాజేంద్ర" ఆ కాగితాన్ని కవరులో పెట్టి పోస్టులో వేసేందుకు వీధిలోకి నడిచాడు రాజేంద్ర.

( ఇంకావుంది)