Taataadhitai Tadigibatom - 4

Episode 4

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

'విజిట్స్' కి బయల్దేరిన వీరభద్రం చేతిలో 'పేకబెత్తం' కనిపిస్తోంది. అతని వెనకాల వెండిచెంబుతో మంచినీళ్ళ గ్లాసు పట్టుకుని 'ప్యూను' ఫాలో అవుతున్నాడు. పక్కగా గ్రౌండులో కొంతమంది పిల్లలు అల్లరి చేస్తున్నారు వాళ్ళు వీరభద్రాన్ని చూసి స్థాణువుల్లా నిలబడిపోయారు.

"ఏమిటి గ్రౌండులో అఘోరిస్తున్నారు" వాళ్ళను చేరుకొని అడిగాడు.

"ఇప్పుడు మాకు త్రిల్లండి!" తలవంచుకునే బదులిచ్చాడు ఓ కుర్రాడు.

"డ్రిల్లు మేస్టారింకనూ రాలేదా?" మళ్లీ తీవ్రస్వరంతో అడిగాడు వీరభద్రం.

భయం వల్ల పిల్లలెవరూ పెదవి విప్పలేదు.

"ఇంకా రాలేదండయ్యా!" ప్యూన్ చెప్పాడు.

సరిగ్గా అదే క్షణంలో దూరంనించి 'లెప్ట్ రైట్' అనే 'మార్చింగ్' వినిపించటంతో ప్యూన్ అటువైపు చూశాడు. గేటులోంచి డ్రిల్లు మాస్టరు రావటం కనిపించింది. కాకీనిక్కర్లో తెల్లని షర్టు 'టక్' చేసుకుని మెడలో పెద్ద 'విజిల్' వేలాడదీసుకుని ఫ్రెంచికట్ మీసాలతో తమాషాగా కనిపిసున్నాడు డ్రిల్లు మేస్టారు అనంతం.

అతన్ని చూసి వెంటనే వీరభద్రానికి చెప్పాడు ప్యూను.

"చిత్తం ! అదిగో ...డ్రిల్లు మేస్టారు వచ్చేస్తున్నారండి!"

"లెఫ్ట్ రైట్...లెఫ్ట్...రైట్...లెఫ్ట్..రైట్...! హాల్ట్!" మార్కింగ్ చేస్తూనే వచ్చిన అనంతం అక్కడ ఆగిపోయాడు.

వీరభద్రం కోపంగా చూస్తూ అన్నాడు. "ఆపండి మీ విన్యాసములు! గ్రౌండునందు తప్ప వీధిలో 'లెఫ్టురైట్లూ అబౌట్ టర్నులూ' వద్దని తమకు వంద పర్యాయములు పక్కానించితిని...మీకు లెక్కలేకపోయినది!"

"అది కాదు సార్...వీధిలో మొదలెడితేనే కానీ గ్రౌండ్ లోకొచ్చేసరికి నాకు మూడ్ వస్తుందండి!" బెరుగ్గా చూస్తూ చెప్పాడు అనంతం.

"సరే...తమరి చిత్తము! ఇంతకూ ఈ దినమింత ఆలస్యంగా దయచేశారేమిటి? ఈ మాసమున పూర్తి శాలరీ తీసుకోనవలయునన్న కోరిక తమకు లేదా?"

"చిత్తం! స్టార్టవటం ఎర్లీగానే స్టార్టయ్యానండి...తీరా బయటకొచ్చేసరికి మా బంధువొకాయన ఎదురయ్యాడండి...మళ్లీ ఆయన్ని లోపలకు తీసుకెళ్ళి పది నిమిషాలు ఆయనతో గడిపి పనయ్యాక తిరిగి ఆయన్ని బస్టాండులో గిదపెట్టివచ్చానండి...ఆయన జాతకాలు అద్భుతంగా చెప్తాడు కదా...అనీ...!" 'జాతకం' అనే మాట వినగానే వీరభద్రం డౌనైపోయాడు.

"నిజమా? ఆయన అంత గొప్పగా చెప్పగలడా?" ఆత్రంగా అడిగాడు.

"ప్రామిస్సండి...ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత రాజీవ్ గాంధీకీ కూడా ఆయన జాతకం చెప్పాడండి!"

"అంటే?...ఆయనతో జాతకం చెప్పించుకున్నవారు హత్యలకు గురయ్యేదరా ఏమిటి కొంపదీసి?"

"అలా క్కాదండి! అంత గొప్పవారికి మాత్రమే జాతకాలు చెప్పగల 'లెవల్' మనిషండి...ఎలాగా వచ్చాడు కదా అని మా అమ్మాయి జాతకం ఒకసారి చూపించాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అనంతాన్ని వారిస్తున్నవాడిలా, అతని చేతులు పుచ్చుకుని అడిగాడు వీరభద్రం.

"అత్తయిన ఒక్కసారి తమరు వారిని నాకు 'ఇంతడ్యూస్' కానించాలి...నా జాతకమును కూడా చూపించుకుంటాను!"

"లాభం లేదు సార్!" నిరాశగా పెదవి విరిచాడు అనంతం.

"అనగా ఏమిటి తమరి భావన?....నా భవిష్యత్తు బాగుండదనా? లేక నాకసలు భవిష్యత్తే లేదనా?" కోపంగా చూస్తూ అడిగాడు వీరభద్రం.

"నో...నో...నో...అదికాదు సార్...ఆయన ఇంతకు ముందే వెళ్ళిపోయాడు....ఆయన గార్ని బస్సెక్కించి సెండాఫ్ చెప్పివచ్చినందుకే నాకింత ఆలస్యమైంది."

"ఇంతకీ తమరి కుమార్తె జాతకము చూసి ఏమిచెప్పారాయన?" ముందుకు నడుస్తూ అడిగాడు.

"చిత్తం...ఆ విషయమే తమరితో నేను స్వయంగా మనవి చేసుకోవాలనుకున్నాను...మీరే అడిగారు!" చేత్తో గుండుమీద రాసుకుంటూ భయంభయంగా చూస్తూ. కొంచెం తత్తరపాటుతో చెప్పాడు అనంతం.

"నాతోనా? ఏ విషయం?" అడిగాడు వీరభద్రం.

"అదేసార్!...మా అమ్మాయి జలజ పెళ్లి విషయం!" అర్థం కానివాడిలా చూశాడు వీరభద్రం... మళ్లీ చెప్పాడు అనంతం.

"చిత్తం...ఈ స్కూల్లో నాతో పనిచేసే ఓ ఉపాధ్యాయుని కొడుకుతోనే మా జలజకి వివాహం జరుగుతుందని చెప్పాడండి!"

"అటులనా? అయినచో?" అనుమానంగా చూస్తూ అడిగాడు.

"అంటే....అంటే....ఈ స్కూల్లో నాతోపనిచేసే ఉపాధ్యాయులేవరికీ అంత వయస్సున మగపిల్లలు లేరుకదండీ తమరికి తప్ప!" వీరభద్రం తుళ్ళిపడ్డాడు.

"డ్రిల్లుమాస్టారూ! ఏమిటి తమరు వాగుచున్నది?...అయిననూ ఈ పాఠశాలనందు 'నాతో' మీరు పనిచేయుచున్నారు తప్ప. 'మీతో' నేను పనిచేయుట లేదు." కోపంగా అన్నాడు.

"చిత్తం!...ఆ మాట నిజమే సార్!...కానీ జాతక విషయాన్ని కొన్నింటికి మనకు అనుగుణంగా మనమే అన్వయించు కోవాలని ఆ శాస్త్రమే ఉద్ఘోషిస్తోంది. మీ పెద్దబ్బాయికీ ఈ ఏటితో డిగ్రీ అయిపోతుంది కదా? ఒక్కసారి తమరోచ్చి మా జలజను చూసుకుంటే ఏమో? ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో ఎవరు చెప్పగలరు చెప్పండి?" వణికిపోతూనే ఆడపిల్ల తండ్రిగా మనసులోని మాటను చెప్పేశాడు అనంతం.

వీరభద్రానికి పుండుమీద ఆవకాయ రాసినట్టుంది.

"కావచ్చు...కానీ మీ కుమార్తెకు మాత్రం మా సుపుత్రుడితో రాసి పెట్టలేదు. అర్థమైందా?" అంటూ ముందుకు నడిచాడు. అయినా అనంతం తనపట్టు విడిచి పెట్టలేదు...ఆడపిల్ల తండ్రికి అర్థింపులు తప్పవని తెలుసు...పైగా వ్యవహారాన్ని కొంతవరకూ లాక్కొచ్చాడు కదా? "మీరంతా కోపంగా డిక్లేర్ చేస్తే నేను అవుటైపోవాల్సిందే కానీ ఒక్కమాటమాత్రం దయుంచి వినండి. మా జలజ నాకంటే అందంగా వుంటుంది...తొమ్మిది పాసైంది. రామాయణ భారతాల్ని పారాయణం చేసింది...రామదాసు కీర్తనలు నేర్చుకుంది.

" వేడుకుంటూ వెంటపడ్డాడు. "క్వాలిఫికేషన్లు వల్లించకండి. మా జ్యేష్ఠపుత్రుని మేరేజి వాడు జన్మించినప్పుడే సెటిలైంది...నా సోదరి కుమార్తె శ్యామసుందరిని మావాడికిచ్చి వివాహము జరిపించెదనని ఆమెకు ఏనాడో 'వరడి'చ్చితిని...అర్ధమైనదా?" అంటూ సీరియస్ గా అతనివైపు చూసి విసురుగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు వీరభద్రం.

* * *

క్లాసులో తెలుగు లెక్చరర్ వరూధిని పాఠం చెప్తున్నాడు. విద్యార్థులందరితో పాటు శ్రీరామ్ కూడా పాఠాన్ని శ్రద్ధాగా వింటున్నాడు. పక్క బెంచీలో కూర్చున్న అశ్విని అతన్నే రెప్పవాల్చకుండా చూస్తోంది....లెక్చరర్ పాఠాన్ని కొనసాగిస్తూనే వున్నాడు. అంతలో అశ్వనికి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది....వెంటనే, నోట్ పుస్తకంలోంచి ఓ తెల్లకాగితం చింపి దానిమీద 'లవ్' గుర్తువేసింది.

ఆ గుర్తు మధ్యగా 'ఐ లవ్ యూ' అని రాసింది...ఆ కాగిత్తాన్ని 'బంతి' లా చుట్టి శ్రీరాం మీదకు విసిరింది. శ్రీరాం గమనించకపోయినా ఆ 'బంతి' లెక్చరర్ దృష్టిలో పడనే పడింది. ఆ సంగతి గ్రహించని అశ్విని 'కాగితం బంతి'ని తీసుకొమ్మంటూ శ్రీరామ్ కి సైగలు చేసింది..విషయం అర్థం చేసుకున్న శ్రీరామ్ కి ఏం చేయాలో తోచలేదు. ముఖం మీద ముచ్చెమటలు పోశాయి. అంతలో లెక్చరర్ అతని దగ్గరగా వచ్చాడు.

ఆ 'కాగితం' బంతిని తీసి విప్పి అందులో వున్న వాక్యాన్ని ముందుగా మనసులో చదువుకుని ఆ తర్వాత ముసిముసి నవ్వులతో క్లాసులో అందరికీ చదివి వినిపించాడు.

"అందమైన ఆడపిల్ల 'ఐ లవ్ యూ' అని బెనర్ కడితే 'ఐస్క్రీం' లా "ఐ లవ్ యూ!" విద్యార్థులంతా ఆయనవైపు వింతగా చూశారు... లెక్చరర్ అంతలో శ్రీరామ్ దగ్గరగా వచ్చి తన కర్చీఫ్ తో అతని ముఖంమీది చెమటలు తుడిచాడు.

"అందమైన ఆడపిల్ల 'ఐలావ్ యూ' అని బెనర్ కడితే 'ఐస్ క్రీం' లా కరిగిపోవాలయ్యా! అంతేకానీ ఇలా చెమటల్తో తడిసి ముద్దయిపోకూడదు. బెస్టాఫ్ లక్" అంటూ ఆ కాగితం బంతిని అతని చేతిలో పెట్టాడు. శ్రీరామ్ అందరివైపూ అయోమయంగా చూశాడు.

అందరూ తనవైపే చూసి ముసిముసిగా నవ్వుతున్నట్లు గ్రహించి సిగ్గుపడ్డాడు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)