Taataadhitai Tadigibatom - 3

Episode 3

తాతాధిత్తై తధిగిణతోం...

జీడిగుంట రామచంద్రమూర్తి

విశాలమైన ఆవరణలో అదో పురాతనమైన భవనం...దాని కాంపౌండు గోడలు ఎత్తుగా వున్నాయి. గేటుకి పైన వున్న 'ఆర్చి' మీద 'రావుబహద్దూర్ రామభద్రం మోమోరియల్ పాఠశాల వరండాలో ఓ గది ముందు 'హెడ్ మాస్టర్' అని రాసి వున్న బోర్డు వ్రేలాడుతోంది...ఆ గది తలుపు తోసుకుని వీరభద్రం లోపలకు నడిచాడు. గదిలో గోడనున్న దేవుళ్ళ క్యాలెండర్లన్నింటికీ చెప్పులు విడిచి మరీ నమస్కరించాడు.

తర్వాత తన సీటులో కూర్బోబోతూంటే బయటనించి ఎవరో 'తుమ్మటం' వినిపించి ఆగిపోయాడు. అతనికి కోపం ముంచుకొచ్చింది. బల్లమీది పేకబెత్తం తీసుకుని బయటకొచ్చి అటూ పరికించి చూసి అడిగాడు.

"ఎవర్రా అదీ? ఎవడా తుమ్ముల మనిషి?" ముక్కుపొడుం దట్టించి అటుగా వెడుతున్న రంగారావు మేష్టారు బిక్కచచ్చిపోయి చూశాడు.

వీరభద్రం ఆయన్ని సమీపించాడు.... "తమరేనా రంగారావుగారూ తుమ్మినదీ?" సీరియస్ గా చూసి అడిగాడు.

"ఛీ...చిత్తం!" భయంగా చూస్తూ బదులు చెప్పాడు రంగారావు...సరిగ్గా అదే క్షణంలో మళ్లీ తుమ్ము రాబోతూంటే పై మీద కండువా అడ్డం పెట్టుకుని ఆపుకునే ప్రయత్నం చేశాడు.

"అనగా...ఏమిటి మీ ఒపినియను?...తుమ్ముటకు వేళాపాళలూ సమయా సమయములూ, హద్దు పద్దులూ అవసరము లేదా?...నేను తల్చుకున్నచో తమ శాలరీనందు పాతిక రూపాయలు 'కోత' విధించగలను...ఏమనుకోనుచుంటిరో?" కోపంగా అతనివైపు బెత్తం ఝుళిపిస్తూ చెప్పాడు వీరభద్రం.

'కోత' మాట వినగానే రంగారావు బెదిరిపోయాడు.

"చిత్తం ! ఆ కోతి పని మాని మాత్రం చేయకండి ప్రభూ!"

"ఏమంటిరీ? కోతిపనా?"

"ఛ ! 'కోత' అనబోయి 'కోతి' అన్నాను కాబోలు క్షమించండి !...అసలే ఆడపిల్లలు గలవాణ్ణి!...పైగా నేను కావాలని తుమ్మలేదండి..ముక్కుపొడుం తుమ్ము...లెక్కలోకి రాదండి !" చేతిలో వున్న నశ్యం డబ్బాను చూపిస్తూ చెప్పాడు.

ఆ డబ్బాని వీరభద్రం లాక్కున్నాడు.

"ఇకమీదట తమరు పాఠశాలలో నశ్యం పీల్చుట నిషేధించుటమైనది. జలుబు చేసినచో స్కూలుకి సెలవు లెటరు పంపించి ఇంటి దగ్గర వైద్యం చేయించుకోండి" అంటూ ఆ డబ్బాను దూరంగా విసిరేసి విసవిసా తన 'రూం' లోకి వెళ్లిపోయాడు.

రంగారావు బిక్కమోహంతో చూశాడు... మళ్లీ తుమ్మబోయి తమాయించుకున్నాడు.... కుర్చీలో కూర్చున్న తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ తెరచి చూస్తున్న వీరభద్రం దగ్గరకు గుమాస్తా గురవయ్య వచ్చాడు.

అతని చంకలో 'లెదర్బ్యాగ్' కనిపిస్తోంది.

"ఇవాళ ఒకటో తారీఖండయ్యా!...మీరు చెక్కు రాసిస్తే బ్యాంకుకి వెళ్లి డబ్బు తెచ్చి అందరికీ జీతాలిస్తానండి!" అణుకువగా చెప్పాడు.

"మంచిది!" అంటూనే డ్రాయరు సొరగులోంచి చెక్కు పుస్తకం తీసి అందులోంచి ఓ చెక్కు చిమ్పాడు. దానిమీద తారీఖు వేయబోయి గోడమీది కేలండర్లోకి చూశాడు. గురవయ్య అలాగే చూస్తున్నాడు.

"లాభం లేదు...ఇవాళ శుక్రవారం..ధనలక్ష్మిని కదపకూడదు...శాలరీలు రేపీయవచ్చు...వెళ్లు!" అన్నాడు వీరభద్రం.

"రేపు బ్యాంకు శలవండి....ఎల్లుండి ఆదివారమండి!" వినయంగా చెప్పాడు గురవయ్య.

"కనుక శాలరీలు సోమవారమే!" చెక్కుని మళ్లీ సొరుగులో వేసి డ్రాయరు మూసేశాడు వీరభద్రం.

గురవయ్య నిరాశగా బయట కొచ్చాడు...వరండాలో ఎదురైన రంగారావుని చూసి చెప్పాడు.

"ఇవాళ మనకి జీతాలు లేవండి!"

"ఎందుకనీ?" ఆదుర్దాగా అడిగాడు రంగారావు.

"శుక్రవారం కందండీ!...ధనలక్ష్మిని కదపకూడదన్నారు మన చాదస్తం గారు !"

"ఖర్మ ! ఏం చేస్తాం?.." నుదిటి మీద కొట్టుకుని ముందుకు నడిచాడు రంగారావు.

"ఏమిటి రంగారావ్ గారూ? ఖర్మంటున్నారు? ఏం జరిగింది?" పక్కనున్న క్లాస్ రూంలో పాఠం చెప్తున్నా శరభయ్య మేస్టారు రంగారావు మాట విని అడిగాడు.

గురవయ్య మోసుకొచ్చిన విషయాన్ని ఆయనకు చెప్పాడు రంగారావు. మరో అయిదు నిమిషాలకు ఆ వార్త అందరికీ చేరిపోయింది.

"ఏం చేస్తాం చెప్పండి?....సర్దుకుపోవాలి...అయినా ఇవాళ మనకేవన్నా ఇది కొత్తా?....ఒకటో తారీఖు ఖర్మం చాలక శుక్రవారం వస్తే. ఎప్పుడైనా జీతాలు తీసుకున్నామా?" శంకరం మేస్టారన్నారు.

"మనిషి మంచివాడే! కానీ ఓ పాలు మూర్ఖత్వం రెండుపాళ్లు చాదస్తం ఎక్కువ గురుడికి" కామెంట్ చేశాడు కామేశం.

"అయినా మనకి ధైర్యం లేకపోతోంది మాస్టారూ ! పై అధికారులకి ఒక్క పిటీషన్ తగిలిస్తే" రంగారావ్ ఇంకా ఏదో అనబోయాడు...అయితే శంకరం అడ్డంపడి మందలింపు స్వరంతో వెంటనే చెప్పాడు.

"మీరు చెప్పేది మరీ బావుందండీ !...పై అధికారులకి కంప్లయింట్ చేయటానికి ఇదేవన్నా గవర్నమెంటు స్కూలా?...చేతనైతే ఆయనగారి చెప్పుచేతల్లో కాళ్లెట్టుకుని మనమే మరోదారి చూసుకోవాలి!"

"అసలీ ప్రయివేటు స్కూళ్ళన్నీ ఇంతే గురువుగారూ !...అంతవరకూ ఎందుకూ? హైదరాబాదులో మా కోడలు అదేదో కాన్వెంటులో పనిచేస్తోంది. నెలకు ఎనిమింది వందలు చేతిలో పెట్టి పదిహేను వందలు తీసుకున్నట్టుగా సంతకం పెట్టించుకుంటారట!...అది చాలక ఏడాదేడాదీ ఎండాకాలం శలవుల్లో ఉద్యోగంలోంచి పీకేస్తారట...!" శరభయ్య చెప్పాడు.

"అదీ మరీ దారుణంలెండి!" శంకరం కామెంట్ చేశాడు.

"కనక సర్దుకుపోవాల్సిందే !" అంటూనే దూరంగా చూసిన శరభయ్య ఉలిక్కిపడ్డాడు.

దూరంనించి వీరభద్రం అటే వస్తూ కనిపించాడు.

"అమ్మో...ఆ చాదస్తంగారు ఇటే వస్తున్నారు...పదండి...పందండి!" గబగబా తన క్లాస్ రూం వైపు పరిగిడుతూ తక్కినవాళ్ళను హెచ్చరించాడు శరభయ్య..తక్కిన టీచర్లు కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు నిష్క్రమించారు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)