taataadhitai Tadigibatom - 1

Episode 1

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

'రాజుపాలెం' చాలా చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో ప్రాథమిక సౌకర్యాలు పెద్దగా లేవు...'ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన' పుణ్యమా అని ఈ మధ్యనే ఆ ఊరి నించి పక్కనున్న పట్నానికి పక్కా రోడ్డు పడ్డింది....అందువల్ల ఊళ్లోకి బస్సులు వస్తున్నాయి.

ఆ ఊరు పేరుకే 'రాజుపాలెం' తప్ప - ఊళ్ళో రాచరికం వెలగబెట్టే మహారాజు లెవరూ లేరు కానీ 'రావ్ బహుద్దూర్' వంశానికి చెందిన వీరభద్రం మాత్రం ఆ ఊరికి మకుటం లేని మహారాజుగా చలామణీ అయిపోతున్నాడు.

వీరభద్రం చూసేవాళ్లకీ చిత్రవిచిత్రంగా అనిపిస్తాయి. 'రాజుపాలెం'లో వున్న ఎలిమెంటరీ స్కూలుకి వీరభద్రం హెడ్ మేస్టారు గానూ, మేనేజరు గానూ కూడా వుంటున్నాడు. ఎందుకంటే, అది ఆయన తాతగారు కట్టించిన స్కూలు కనుక. ఆ తాతగారి పేరు రావుబహద్దూర్ బిరుదు పొందినవాడే.

అందుకే ఆ పూర్వీకుల హోదా వైభవాలూ, ఠీవీదర్పాలూ ఇప్పటి వీరభద్రం మేస్టారిలో 'చచ్చిన చింతలో మిగిలిపోయిన పులుపు' లా ఇంకా నిలిచిపోయాయి. వీరభద్రం మేస్టారు ఉభయ భాషాప్రవీణులు అంటే సంస్కృతాంధ్ర భాషల్లో కాదు ఆంగ్ల ఆంధ్ర భాషల్లో స్వచ్ఛమైన గ్రాంధిక భాషతో పాటు అడపదడపా, ఆగ్రహావేశాలు వచ్చినప్పుడు అలవోకగా ఆంగ్లాన్ని కూడా జోడించి మాట్లాడటం ఆయనకు అలవాటు.

వీరభద్రం మేస్టారి భార్యపేరు పార్వతమ్మ అలాంటి మొగుడితో వేగుతున్న ఆమెగారి సహనాన్ని చూసి జాలి పడవలసిందే. ఈ దంపతులకు ఒక ఆడపిల్ల, ఇద్దరూ మగపిల్లలూ వెరసి ముగ్గురు సంతానం. ఆడపిల్ల 'గీత'కి రెండేళ్ళ క్రితం రాజేంద్రతో పెళ్ళయింది. వాళ్ళిప్పుడు హైదరాబాదులో వుంటున్నారు. ఇక మగపిల్లల్లో పెద్దవాడు శ్రీరాం...పేరుకి తగినట్టే ఆజానుబాహుడు. నీలమేఘశ్యాముడు మాత్రం కాదు.

ఎర్రని ఎండలో ఏడడుగులు నడిస్తే కందిపోయేటంత తెల్లగా వుంటాడు. టౌనులో వున్న కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటూ హాస్టల్లో వుంటున్నాడు. రెండోవాడు లక్ష్మణమూర్తి తల్లితండ్రుల దగ్గరే పక్కవూళ్ళో పదోక్లాసు చదువుతున్నాడు.

ఊర్లో జనాలకీ, స్కూల్లో వున్న మేస్టార్లకీ, ఇంట్లో కుటుంబ సభ్యులకీ 'వీరభద్రం' పేరు చెప్తే వీరభయం. అందుకు కారణం ఏమిటని అడిగితే ఎవరూ చెప్పలేరు...ఆయన ముఖంలోకి ఎవ్వరూ, ఎప్పుడూ డైరెక్టుగా చూసి మాట్లాడలేరు. చూస్తేనే చాలు మాట పడిపోతుంది.

ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే 'రాముడి భార్య పేరు హిడింబి' అనీ 'తాజ్ మహల్' కట్టించింది 'ఇందిరాగాంధీ' అనీ తప్పుడు కూతలు కూస్తారు. అయితే తాళి కట్టించుకుని కాపురం చేస్తున్న కారణాన పార్వతమ్మ మాత్రం అప్పుడప్పుడు ఇక తప్పదనుకున్నప్పుడు దైర్యం చేసి మొగుడికి సలహాలు ఇస్తూంటుంది.

ఇంతకీ ఘనకీర్తి కలిగిన వీరభద్రం మేస్టారుకి జాతకాలపట్ల నమ్మకం జాస్తి. ఆఖరికి చిలకజ్యోస్యం మనిషి ఆయన కంటపడినా అతని పంట పండిందన్నమాటే. ఈ రకం జాతకాల పిచ్చికి సాయం చాదస్తాలూ, మూఢనమ్మకాలూ కూడా ఆయనకు ఎక్కువేనని చెప్పాలి. తిథి వార నక్షత్రాలు చూడందే పనులు ప్రారంభించడు.

శకునం చూసుకోందే వీధిలోకి అడుగుపెట్టడు. అదీ వీరభద్రం మాస్టారి క్యారెక్టరు. ప్రక్కన సజెషన్ లో ఉహరించిన నటీనటులను మనసులలో వుంచుకుని జరిగే కథను మీ మనో నేత్రాలతో తిలకించండి. అవి సంక్రాంతి రోజులు... అప్పుడే తెల్లవారింది ... 'రాజుపాలెం'లో వున్న రామాలయం ప్రహరీగోడ మీది స్పీకరులోంచి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తోంది.

వయసులో వున్న ఆడపిల్లలు కొంతమంది బిందెలు భుజాన వేసుకుని ఊరి చివరి చెరువుకి వెడుతున్నారు. రైతులు అరకలు పట్టుకుని ఎద్దుల్ని తోలుకుంటూ పొలాలవైపు నడుస్తున్నారు. పొడవుగా వున్న ఆ సన్నని రోడ్డు మీద కొన్ని ఇళ్ళముందు కన్నె పిల్లలు కలాపి జల్లి ముగ్గుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఓ చేత్తో తంబుర మీటుతూ, మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరిదాసు కీర్తన పాడుతున్నాడు. అలా పాడుతూనే ఓ ఎత్తరుగుల ఇంటిముందు కొచ్చాడు ఆ ఇల్లు వీరభద్రం మేష్టారిది.

"మమ్ము బ్రోవమనీ చెప్పవే రాధమ్మ తల్లీ" అని పాడుతూ ఆ ఇంట్లోకి భయం భయంగా చూస్తున్నాడు హరిదాసు అంతలో 'బియ్యం చేట' చేత పట్టుకుని పార్వతమ్మ ఆ ఇంట్లోంచి బయటకు రానేవచ్చింది.

"అదేమిటయ్యా దాసూ. కీర్తన తప్పు పాడుతున్నావేమిటీ?" చేటలోని బియ్యాన్ని హరిదాసు తలమీద మెరుస్తున్న రాగి పాత్రలో పోస్తూ అడిగింది.

"తప్పు పాడుతున్నానాతల్లీ? ఏమో? 'అయ్యగారి కంటపడి చస్తానేమో' నన్న భయంతో బహుశా తడబడి తప్పుగా పాడేవుంటాను తమరే వచ్చారు అదృష్టవంతుణ్ణి" అన్నాడు హరిదాసు తలమీది పాత్రను సవరించుకుంటూ.

అతని మాటలు విన్న పార్వతమ్మ నవ్వుకుంది.

"అయ్యగారంటే అంత భయం దేనికయ్యా దాసూ?" అడిగింది.

"ఏమో తల్లీ మహానుభావులు ఎందుకో వారి ముఖారవిందాన్ని తిలకించాలంటే చచ్చేటంత భయంతో మరోసారి లోపలకు చూస్తూ చెప్పాడు దాసు .

సరిగ్గా అదే క్షణంలో లోపల్నించి ఓ 'గాండ్రింపు' వినిపించనే వినిపించింది.

"ఏమోయ్! ఎక్కడ అఘోరిస్తున్నారూ?" అది వీరభద్రం మేష్టారు గొంతు ! ఆ గొంతు విన్న హరిదాసు హడలిపోయాడు.

"అమ్మో! అయ్యగారు!" అంటూనే పరుగులాంటి నడకతో పక్కింటికి పారిపోయారు.

లోపల అద్దం ముందు నిలబడి మీసాన్ని చిన్న దువ్వెనతో ట్రిప్ చేసుకుంటున్న వీరభద్రం హరిదాసుకి బియ్యం వేసి లోపలకు వస్తున్న పార్వతమ్మను అద్దంలోంచే చూసి కోపంగా అన్నాడు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)