Rating:             Avg Rating:       423 Ratings (Avg 2.91)

తాతా ధిత్తై తరిగిణతోం 26

తాతా ధిత్తై తరిగిణతోం 26

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Read and enjoy latest telugu comedy serials, telugu funny serials with funny images

 

తండ్రి వైపు విచిత్రంగా చూసింది అశ్విని అటూ ఇటూ నడుస్తూ ఆవేశం నిండిన స్వరంతో చెప్పాడు విష్ణుమూర్తి మళ్లీ.

"శ్రీరామ్ తండ్రితో మీ పెళ్ళిసంగతి మాట్లాడదామని పొద్దున్నే వాళ్ళ వూరెళ్ళాను. ఆరు నూరైనా, నూరు ఆరైనా మీ పెళ్ళి జరగదన్నాడు. అయినా నచ్చచెప్పాను. నువ్వు మోజుపడ్డ ఆ శ్రీరామ్ పేరుకి తగినట్టుగానే వున్నాడు కనుక....వాళ్ళనాన్న 'దశరథుడంత సౌమ్యంగా వుండకపోతాడా' అనుకున్నాను. కానీ నువ్వన్నట్టు గొప్ప చండశాసనుడు. అంతేకాదు...వేపకాయంత వెర్రీ...ముంజికాయంత మూర్ఖత్వం కూడా వున్న ముదనష్టపు మనిషిలా వున్నాడు. మనిద్దర్నీ విడివిడిగానూ కలగలిపీ...ఎన్ని మాటలన్నాడో తెలుసా?...కొన్ని శాపాలు కూడా పెట్టాడు...తల్చుకుంటే నాకు బీపీ రైజయ్ పోతోంది ఇందాకట్నించీ ఆ!"

"సారీ డాడీ! నా కారణంగా మీకంత అవమానం జరుగుతుందని ఊహించలేకపోయాను...మీరా ఇంటికి వెళ్ళకుండా వుండాల్సింది." బాధగా అందామె.

"ఫర్వాలేదులే బేబీ!...అన్నీ మన మంచికే! నువ్వసలు ఆ 'మాడుపెనం' ముఖానికి కోడలు కాకపోవటమే మంచిది. వాడి 'ఫేసు' చూస్తే వాంతులవుతాయి. వాడి భాష వింటే పిచ్చెక్కుతుంది."

"కానీ...నేను ప్రేమించేది శ్రీరామ్ ని డాడీ!..అతని ఫేసు నాకు నచ్చింది. అతని మాటలు వినకుండా నేనుండలేను...అందుకే నా మనసేనాడో అతనికి ఇచ్చేశాను."

"బేబీ!" కోపంగా అరిచాడు విష్ణుమూర్తి.

తండ్రిలో అంతటి ఆగ్రహావేశాల్ని చూసిన అశ్విని వెంటనే బదులు చెప్పలేక పోయింది. విష్ణుమూర్తి ఈ లోగా తనను తాను కొంత 'కంట్రోల్' చేసుకుని....నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు మళ్లీ.

"చూడు బేబీ! ఇన్నాళ్ళూ నువ్వడిగిందల్లా ఇచ్చాను...చెప్పిందల్లా చేశాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నామాట విను బేబీ!..ఇది ఆజ్ఞకాదు...అర్థింపనుకో. నువ్వు మెచ్చిన ఆ శ్రీరామ్ కాకపోయినా నీకు అన్నివిధాలా నచ్చే నవ మన్మథుణ్ణి చూసి నెల రోజులు తిరిగేలోగా పెళ్ళిచేస్తాను. పెళ్ళయ్యాక నీ భర్తని ప్రేమించి జీవితాన్ని సుఖమయం చేసుకో..."

సోఫాలోంచి ఛివాల్న లేచింది అశ్విని. "ఆడది ఒక్కసారే ఒక్కర్నే ప్రేమిస్తుంది డాడీ."

"షటప్!...నాకు జ్ఞానం వచ్చాక ఆ డైలాగ్ ని చాలా సినీమాల్లో విన్నాను. ఒక్కసారే ప్రేమించి...ఆ తర్వాత మనసు మార్చుకోవటానికి వీల్లేనంత 'అట్లాంటిక్ ఓషనూ' ఎవరెస్టు మౌంటెనూ' కాదు ప్రేమంటే. అది 'అయిస్ క్రీం' లాంటిది కాదంటే కర్పూరంలాంటిది. పెళ్ళయిన పదిరోజులకో ముప్పయ్ రోజులకో కరిగి చక్కాపోతుంది...కానీ 'పెళ్ళి' అలాంటిది కాదు...అది శాశ్వతం. దేవుడు ముడివేసే బంధం. అర్థమైందా?" తీవ్రంగా చూస్తూ అడిగాడు.

అశ్విని తలవంచుకుని బొటనవేలితో నేలమీద రాస్తూండిపోయింది.

"ఇక అట్టే విసిగించక నీ గదిలో కెళ్లి రెస్ట్ తీసుకో పరీక్షలైపోయాయి. కనుక కావాలంటే ఓ పదిరోజుల పాటు 'కొడైకెనాల్' కి వెళ్ళి మన గెస్ట్ హౌస్ లో రెస్టు తీసుకురా! కాస్తంత రిలాక్సింగ్ గా వుంటుంది. ఈ లోగా 'వెబ్ సైట్' లో ఏ అమెరికా సంబంధమో చూసుంచుతాను." అదే తన ఆఖరి మాటగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తనగదిలోకి వెళ్ళిపోయింది అశ్విని.
 


*           *           *

శ్రీరామ్ చాలా అసహనంగా వున్నాడు. ఇంటికొచ్చి మూడు రోజులైనా తాను అశ్విని ప్రేమించిన విషయాన్ని తండ్రి దగ్గర ప్రస్తావించే అవకాశం దొరకలేదు.

మాటిమాటికీ 'రసూల్ బాబా' ఇచ్చిన తావీజును కళ్ళకద్దుకుంటున్నాడు...బాబా ఇంటిదగ్గర్నించి కారులో తనను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేముందు అశ్విని ఇచ్చిన 'సెల్ ఫోన్' తీసి మాటిమాటికీ చూసుకుంటున్నాడు....దాని 'స్క్రీన్' మీద అశ్విని రూపమే ప్రత్యక్షమవుతోంది. మనసును అదుపులో పెట్టుకుంటూ 'విజయానికి అయిదు మెట్లు 'పుస్తకంలో అశ్విని మడతపెట్టిన చాప్టర్ ని పదేపదే చదువుకుంటున్నాడు. ఆరోజు, తన పొలంలోకి ఎరువుతోలించే పనిమీద, విజయవాడ నించి మిత్రుడు చిదంబరం వస్తే అతనితో కలిసి వీరభద్రం కూడా బయటకు వెళ్లాడు. భోజనాల సమయం మించిపోతుంది. సాధారణంగా ఆ ఇంట్లో వీరభద్రం తిన్న  తర్వాతనే, పిల్లలతో కలిసి భోజనం చేస్తుంది పార్వతమ్మ.

"నాన్నగారు వచ్చేసరికి ఇంకా ఆలస్యం అవుతోందో ఏమిటో! నువ్వూ తమ్ముడూ తినేయండి" అంది పార్వతమ్మ శ్రీరామ్ గదిలోకి వచ్చి.

"ఫరవాలేదులే! ఇవాళ నాన్నగారితో కలిసి తింటాను." అన్నాడు శ్రీరామ్ ఆ పుస్తకం చదువుతూనే.

కొంచెం విడ్డూరంగా చూసింది పార్వతమ్మ అది జరిగేపని కాదని ఆమెకు తెలుసు! ఆయన కంటపడటానికే భయపడే శ్రీరామ్. ఆయన పక్కన కూర్చుని ఎలా తింటాడూ...?

కానీ, పుస్తకం చదవటంలో పూర్తిగా నిమగ్నమైపోయిన 'శ్రీరామ్' ని మరి ఒత్తిడి చేయటం ఇష్టంలేక వంటింట్లోకి వెళ్ళిపోయింది.

అప్పుడు శ్రీరామ్ 'విజయానికి అయిదు మెట్లు పుస్తకంలో 'భయం' గురించిన చాప్టర్ చదువుకున్నాడు.

"భయం అనేది 'బూమెరాంగ్' లాంటిది. ఇది అవకాశానికి బద్ధ శత్రువు. దీనికి మనం ప్రాధాన్యత ఇస్తే మరింత రెట్టింపు పరిమాణంలో అది వెనక్కి వచ్చి మనల్ని మరింత భయపెడుతుంది. జీవితంలో ముందుకు సాగిపోవాలంటే....భయాన్ని అధిగమించక తప్పదు."

నిజమే! తాను నిర్భయంగా తండ్రితో, తన ప్రేమ గురించీ, పెళ్ళి గురించీ మాట్లాడకపోతే బంగారం లాంటి అవకాశం చేజారిపోతుంది.

"భయం అనేది క్షణకాలం మాత్రమే బ్రతుకుతుంది ఒక్కసారి దాన్ని అధిగమిస్తే  అది మన చెప్పుచేతుల్లో వుంటుంది."

అందుకే తన తండ్రి దగ్గర ధైర్యంగా నిలబడాలనీ, మాట్లాడాలనీ తీర్మానించుకున్నాడు శ్రీరామ్. ఆ పుస్తకంలో రాసినట్టు టంగుటూరి ప్రకాశం పంతులుగారి లాగా దేశంకోసం ఇంగ్లీషువాడి తుపాకీకి ఎదురునిలిచి.." కాల్చుకోరా...కాల్చుకో" అని గుండె చూపెటంత ధైర్యం తనకు లేకపోవచ్చు. కానీ తన 'జీవితసమస్య కళ్ళముందుకు దూసుకుని వస్తూంటే...రా చూస్తాను! అనగలిగే ధైర్యం తనదగ్గరుంటే చాలు.

ఆ ధైర్యం తెచ్చుకుని అవసరమైతే తండ్రిని ఎదిరించాలి...ఆ సాహసాన్ని తనలో నింపుకుని తనను ప్రేమించిన అశ్వినిని స్వంతం చేసుకోవాలి. అసలు ప్రేమించటం కంటే, ప్రేమించబడటమే గొప్ప విషయమని ఎంతో మంది నిర్థారణగా చెప్పారు. అలాంటప్పుడు అన్నివిధాలా తనకంటే పదిమెట్లు పైన వున్న అశ్విని ప్రేమను పొందగలగటం ఎంత అదృష్టం? ఇప్పుడిప్పుడే ....రసూల్ బాబా ఇచ్చిన తావీజు కట్టుకున్నాక అశ్విని బహూకరించిన ఆ పుస్తకం చదివాక ప్రేమ ఎంత గొప్పదో, ఎంత బలమైనదో తాను అవగాహన చేసుకోగలుగుతున్నాడు. ఆ పుస్తకంలోని ఆఖరి పేజీలు తీసి వాటిలో 'ప్రేమ' ను గురించి రాసిన వాక్యాల్ని తాను ప్రత్యేకంగా ఎర్రసిరాతో 'అండర్ లైన్' చేసుకున్న ఆ వాక్యాన్ని మనసులో మరోసారి చదువుకున్నాడు శ్రీరామ్...''ప్రేమంటే సౌందర్యం. సౌందర్యమంటే ఆనందం సంపూర్ణ విజయానికి తొలిస్తంభం ప్రేమ. ప్రేమంటే అర్థం చేసుకోవటం. ప్రేమంటే సూర్యోదయంలో సూర్యాస్తమయాన్ని కూడా చూడగలగటం. నిశ్శబ్దాన్ని వినగలగటం. ఒక నమ్మకాన్ని మిగుల్చుకోవటం. ఋషుల పెదవుల మీది చిరునవ్వును అర్థంచేసుకోగలగటం. కొండ అంచులమీద ఆగిపోయిన సాయంత్రాలను పలకరించటం. సముద్ర కెరటాలను చూస్తూ వాటి చప్పుడులో సంగీతాన్ని వినగలగటం అన్నీ అంతా ప్రేమే."

ఓహ్. ఎంత గొప్పపరిశీలన?...

ఆ వాక్యాలను చదివిన శ్రీరామ్ కళ్ళు తనకు తెలియకుండానే చెమ్మగిల్లాయి. మనసేదో అర్థంకాని ఆర్ద్రతతో నిండిపోయింది....వాటిని రాసిన రచయితను అభినందించకుండా వుండలేకపోయాడు.

అంత గొప్ప ప్రేమని...అంతటి విశాలమైన ప్రేమని....అలాంటి ప్రకృతి సిద్ధమైన ప్రేమని తాను ఇంతకాలం చూడలేకపోయాడు...అనుభవించలేకపోయాడు. ఆస్వాదించలేక పోయాడు.

ప్రేమ తత్వాన్ని...మహత్యాన్నీ అశ్విని అవగాహన చేసుకున్నది కనుకనే...తాను పొమ్మన్నా తనను నీడలా వెంబడించింది. ఏమైనాసరే, అశ్వినిని వదులుకోకూడదు. అందుకు తండ్రిని, 'ఎదురించటమే' కాదు అవసరమైతే తన వాళ్ళను వదులు కోవడానికైనా సిద్ధపడాలి.

అలా సాగిపోతున్న శ్రీరామ్ ఆలోచనలకు తండ్రి గొంతు అంతరాయం కలిగించింది.