తాతా ధిత్తై తరిగిణతోం 19

తాతా ధిత్తై తరిగిణతోం 19

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Read and enjoy latest telugu comedy serial tata dithai thakidimitom colony

 

"అదేంటయ్యా అంత భయపడి పోతున్నావ్?...సిగరెట్ కాల్చటం ఘోరమూ నేరమూ కాదులే!... ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి అదో ఫ్యాషన్!...అలవాటు కానంతవరకూ ప్రమాదంలేదు. నేను సరదాగా అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ' పైప్' పీలుస్తూంటాను'' చేతిలో 'పైప్' చూపిస్తూ అన్నాడు విష్ణుమూర్తి.
"అసలతను ఏమీ చేయలేడు డాడీ. వఠ్ఠి చాక్ పీస్!" ఇంకా ఆ నవ్వు కంటిన్యూ చేస్తూనే చెప్పింది అశ్విని. అయినా శ్రీరామ్ కి కోపం కానీ, పౌరుషం కానీ రాలేదు.
"బేబీ వాటీజ్ దిస్? అతను నీకు కాలేజీలో బెస్ట్ ఫ్రెండే కావచ్చు కానీ ఇప్పుడు మనింటికి వచ్చిన గెస్టు. వేళాకోళం చెయ్యకూడదు. మర్యాద చెయ్యాలి. మైండిట్."
నవ్వును బలవంతంగా ఆపుకుందామే. మళ్లీ ముగ్గురూ మేడదిగి హాల్లోకొచ్చి కూర్చున్నారు. శ్రీరాం కుటుంబ విషయాలను అడిగి తెల్సుకుని వీరభద్రం అడ్రస్ కూడా తీసుకున్నాడు విష్ణుమూర్తి.
"ఇక నేను బయల్దేరాను సార్." పదినిముషాల పిచ్చాపాటీ తర్వాత లేచాడతను. అప్పుడే నా తొందరేముంది? ఏకంగా డిన్నర్ చేసి వెలుదువు గాని!"
"థాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్...కానీ...ఇవాళ కాదు సార్! మరోసారి ఎప్పుడైనా వస్తాను." చెప్పులు తొడుక్కుంటూ చెప్పాడు.
"మరోసారి ఎప్పుడో అంటే కుదర్దు రేపే రావాలి!...పండగ భోజనం మా ఇంట్లోనే!....ఎలాగో నువ్ మీ ఊరు వెళ్ళటం లేదుగా? పండుగపూట హాస్టల్లో పడి వుండటం ఎందుకూ?...నీకోసం వెయిట్ చేస్తూంటాం....వచ్చెయ్."
అతను ఏ సంగతీ చెప్పకుండా బయటకు నడిచాడు. "అతన్ని కార్లో డ్రాప్ చేసిరా బేబీ!" అన్నాడు విష్ణుమూర్తి.
"నో...నో!...ఫరావాలేదండీ! నే వెడతాను" ఖంగారుగా చెప్పేసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఫక్కున నవ్విందామె.
"ఏమిటి బేబీ అది? మాటిమాటికీ అలా నవ్వితే అతనేమనుకుంటాడు చెప్పు?" మందలించాడు విష్ణుమూర్తి.
"కాదు డాడీ! అతన్ని చూస్తే నవ్వొచ్చింది. వట్టి బెదురు గొడ్డుని 'లవ్' చేయటం నాకు వింతగా తోస్తోంది...అసలు అతన్ని పెళ్ళిచేసుకుంటే ...నువ్ సుఖపడగలవా అనే అనుమానం వస్తోంది."
"చూస్తూండు డాడీ. అతన్ని హీరోని చేస్తాను. ఆ తర్వాతే పెళ్ళి చేసుకుంటాను." ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్పింది.
"అలా అన్నావ్ బావుంది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావ్. నీ ప్రయత్నాల్లో నువ్వుండు...నేను అట్నించి ప్రొసీడైపోతాను." గుప్పెట మూసి బొటనవేలు పైకెత్తి చూపిస్తూ మెచ్చుకోలుగా అన్నాడు విష్ణుమూర్తి.
*               *            *
వీధి అరుగు మీద కూర్చుని పుస్తకంలోని పాఠాన్ని లోలోపలే చదువుకుంటున్నాడు లక్ష్మణమూర్తి.
పక్కగా మరికొంచెం దూరంలో తివాసీ మీద కూర్చుని 'పేకముక్క' లతో ఒక్కడే ఆడుకుంటున్నాడు వీరభద్రం. అంతలో నారాయణ "భలేమంచి చౌకబేరము" అనే పాటను పాడుకుంటూ అటే వెడుతూండటం చూసి పిలిచాడు.
"ఒరే!
 ఇట్రా!...ఈ పేకనించి ఒక్క ముక్క తీసి, వేయుము" అంటూ కొన్ని కార్డులు వాడి చేతిలో పెట్టాడు.
"అయ్ బాబో!...నాకు పేకాట రాదండీ" అన్నాడు నారాయణ, చేతిలో వున్న పేకముక్కల్ని చూసుకుంటూ.
"నీకు రాకపోయినా నష్టం వాటిల్లదు! నాకు వచ్చు కదా! చెప్పినట్టుచెయ్యి." ఓ కార్డువేసి మళ్లీ నారాయణని ఓ కార్డు వేయమన్నాడు వీరభద్రం. అంతలో పార్వతమ్మ అక్కడకు వచ్చింది.
"ఇవాళ ఆదివారమేగా? మీ స్కూల్లో మేస్టారుర్లను ఎవర్నైనా రమ్మని పిలవకపోయారా పేకాటకీ? వాడి పనెందుకూ పాడుచెయ్యటం?" అని భర్తతో చెప్పి,
"నువ్ రారా నారాయణా! చెరువు కెళ్ళి నీళ్లు తేవాలి!" అంది.
క్షణం ఆలస్యం చేయకుండా అదే అదననుకొని ఆ 'ఫ్రేం' లోంచి మాయమైపోయాడు నారాయణ.
వీరభద్రానికి భార్యమీద పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపాన్ని పక్కనున్న కొడుకుమీద ప్రదర్శించబోయాడు.
"తమరేం అఘోరిస్తూన్నారూ? రీడింగా? చదువుకుంటున్నాను." భయపడిపోతూ బదులిచ్చాడు లక్ష్మణమూర్తి.
"అఘోరించారు. మనసులో చదువుకున్నది మోకాలుకు పోవును. పైకి చదువుకున్నది బుర్రకెక్కును పైకి అఘోరించు."
వెంటనే పాఠాన్ని గబగబా పైకి చదవటం ప్రారంభించాడు లక్ష్మణమూర్తి. మధ్యమధ్యన తండ్రి అడుగుతున్న ప్రశ్నలకు బెదురు బెదురుగా సమాధానాలు చెప్తున్నాడు.
అంతలో రెండుకార్లు వేగంగావచ్చి ఆ ఇంటిముందు ఆగాయి.
ముందు ఆగిన కార్లోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు.
"వీరవాసం వీరభద్రరావుగారిల్లు ఇదేనా మాస్టారూ?" ఒకాయన వీరభద్రాన్ని చూసి అడిగాడు.
అతనివైపు గుర్రుగా చూశాడు వీరభద్రం.
"ఇది ఎవరి గృహం అనుకుని ఇక్కడ దిగారో తమరు?" ఎదురు ప్రశ్నవేశాడు.
ఆ భాష కొంచెం అర్థం కానట్టుగా బిత్తరపోయి చూశాడు ఆ పెద్దమనిషి ఈ లోగా రెండో వ్యక్తి సమర్థించుకుంటూ చెప్పాడు.
"వారిదే అనుకుని వచ్చామండి..."
"అనుకుని కూడా మళ్లీ అడుగుటలో అంతర్యమేమిటో?...నన్నొక వెర్రి వెంగళప్పను చేయుటకా?"
ఈ సారి రెండవ వ్యక్తి కూడా బిత్తరపోయాడు.
"రామరామ!...అంత మాటెందుకు మేస్టారూ? పొరపాటైపోయింది. ఇంతకీ వారు ఇంట్లో వున్నారా!" అడిగాడు వెంటనే.
ఆ ప్రశ్నవిన్న వీరభద్రం వెంటనే శివమెత్తిన వాడిలా లేచి అన్నాడు కొంచెం ఆవేశంగా.
"అబ్బే...లేరు!...వారు ఇంట్లో ఎందుకుండెదరూ ఇవాళ ఆదివారము కనుక, స్కూలు శలవు కనుక జోలె భుజానికి వేసుకుని యాచనకు వీధుల వెంబడి తిరుగుచున్నారు...హు. ఇంట్లో వున్నారా? అదో ప్రశ్న."
ఆ పెద్దలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
అంతలో రెండో కారులోంచి విష్ణుమూర్తి దిగి వచ్చాడు.
"మీరుండండయ్యా. వీధిలో వాళ్ళతో గొడవ పడతారెందుకూ? బహుశా ఆ కుర్రాడు వీరభద్రంగారి రెండో అబ్బాయయ్యుంటాడు. ఆ ''ఉగ్రనరసింహం" అతగాడి ట్యూషన్ మాస్టారు కాబోలు అసలా 'ఫేసే' దరిద్రంగా వుంది. అతనితో మాట్లాడి 'టైం' వేస్తూ చేయకండి...ఇవాళ స్కూలుకి శలవే కనక మేస్టారు ఇంట్లోనే వుండి వుంటారు. రండి లోపలకు వెళ్ళి విచారిద్దాం!" అంటూ గబగబా లోపలకు దారితీశాడు. తక్కిన పెద్దలిద్దరూ వీరభాద్రాన్ని ఓ పురుగుని చూసినట్టు చూసి విష్ణుమూర్తి వెంట నడిచారు.
"ఆ లోపలకు వెళ్ళిన పిదప మీరు విచారించవలసిందే!" అంటూ పళ్ళు పటపటా నూరుతున్నాడు వీరభద్రం.
అదే క్షణంలో ఓ కారులోంచి క్రిందకు దిగిన డ్రైవరు బీడీ నోట్లో పెట్టుకుని జేబులో అగ్గిపెట్టె లేదని గ్రహించి వీరభద్రం దగ్గరకు వచ్చి అడిగాడు.