తాతా ధిత్తై తరిగిణతోం 53

తాతా ధిత్తై తరిగిణతోం 53

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 "విష్ణుమూర్తా? పాల సముద్రంలో వుంటాడు కదూ?" వెటకారంగా అడిగాడు.

"యస్! మా మేడపేరు పాలసముద్రమే" చెప్పింది అశ్విని.

"చాల్లే ఊరుకో! నెల్లూరినించి పారిపోయి వచ్చినందుకు నెరజాణలాగే మాట్లాడుతున్నావ్" వ్యవహారం ముదురుతోందని గ్రహించిన శ్రీరామ్ కల్పించుకున్నాడు.

"చూడండి ఇన్స్పెక్టర్ మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆమెది నెల్లూరు కాదు కేశవపట్నం వాళ్లనాన్నగారి పేరు నిజంగానే విష్ణుమూర్తి! పెద్ద బిజినెస్ మాగ్నెట్ నేను ఆమెకు తాళికట్టిన భర్తని! మాదిరాజుపాలెం. మా పెళ్ళయి నాలుగు నెలలయింది కావాలంటే వాకబు చేసుకోండి." అన్నాడు.

"వాకబులు అనవసరం. మతలబులు తెల్సినవాణ్ణి. అసలు నాపేరేమిటో తెలుసా? ఆవలింతల అప్పారావ్ ఎదుటివాడు ఆవలించకుండానే పేగులు లెఖ్ఖ పెట్టి చెప్పగలను బొంబాయ్ రెడ్ లైట్ ఏరియాలోనూ, శ్రీకాకుళం నక్స్లైట్ ఏరియాలోనూ పనిచేసొచ్చిన వాణ్ణి. సర్వీసెంతో తెలుసా? ట్వంటీ ఇయర్స్. అమ్మాయిల్ని లేపుకొచ్చి లాడ్జీల్లో పెట్టేవాళ్ళు ఎలాంటి కథలు చెప్తారో నాకు బాగా తెలుసు!" మీసం మెలివేస్తూ చెప్పాడు ఇన్స్పెక్టర్.

శ్రీరామ్ కి విసుగొచ్చింది సహనం నశించిపోయింది. తాము భార్యాభర్తల మన్న విషయాన్ని అతని చేత ఎలా నమ్మించాలో అర్థం కాలేదు. ఈలోగా అశ్వినికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

"ఇదిగో. ఇన్స్పెక్టరు గారూ మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, నా మెడలో మావారు కట్టిన మంగళసూత్రం చూడండి. కాలికి మెట్టెలు కూడా వున్నాయి ఇవిగో." అంటూ వాటిని చూపించింది.

"బందర్లో వందరూపాయలు పారేస్తే అలాంటి గిల్టీ కవరింగు వస్తువులు బోలెడు దొరుకుతాయి తల్లీ."

"ఇంతకీ ఏవంటారు మీరూ?" సీరియస్ గా అడిగాడు శ్రీరామ్.

"మళ్లీ అనమంటావా. అయితే విను! ఈ అమ్మాయి పేరు సీతామాలక్ష్మి ఊరు నెల్లూరు నువ్వు మోసం చేసి తీసుకొచ్చావు మాలాంటి వాళ్ళకు అనుమానం రాకూడదని 'గిల్టు' మంగళసూత్రం మెడలో కట్టావ్ వీళ్ల నాన్నగారు పోలీసు కంప్లయింటిచ్చారు ఇవాళ్టి పేపర్లో ఈ అమ్మాయి ఫోటో వేయించి ప్రకటన కూడా ఇచ్చారు. చెప్పాడతను శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు.

"ఫోటో వేయించి ప్రకటన ఇచ్చారా?" అడిగాడు.

యస్! ఇదిగో పేపరు కట్టింగు." జేబులోంచి తీసి అతని చేతికిచ్చాడు ఆత్రంగా ఆపేపరు కట్టింగులో వున్న బొమ్మ వైపు చూశాడు అశ్వినికీ ఆఫోటోలోని అమ్మాయికీ అసలు పోలికే కన్పించలేదు.

'ఈ ఫోటోలో అమ్మాయికీ మా అశ్వినికీ పోలికే లేదు కదా సర్?" తిరిగిచ్చేస్తూ అడిగాడు శ్రీరామ్.

"అఫ కోర్స్! ఒకోసారి ఫోటోలో మనిషికి అసలు మనిషికీ తేడాలుంటాయి."

"మరి అలాంటప్పుడు మా ఆవిడే ఈ 'ఫోటోలో అమ్మాయని' ఎందుకనుకోవాలీ? మీ ఆవిడో లేకపోతే మీ వెనకాల వున్న ఆ కానిస్టేబుల్ గారి ఆవిడో అయ్యుండచ్చుగా?" చిరాకు పడుతూ అడిగాడు.

"జోకా? సంతోషించాంకానీ, నువ్వురాలేదు. ఆ ఫోటో కింద ఏం రాసుందో అది చదువు. ఇన్స్పెక్టర్ కూడా చిరాగ్గానే అన్నాడు.

"మీరే చదివి వినిపించండి."

'ఉ! శ్రద్ధగా విను! అమ్మాయి పేరు సీతామాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు చిలకాకుపచ్చ రంగు చీరా, నీలిరంగు బ్లౌజూ వేసుకుంది రంగు చామనఛాయా చెవులకు రింగులున్నాయి బహుశా బెజవాడ ప్రాంతాల్లో వుండవచ్చు ఆచూకీ తెలియపరిచినవారికి యాభైవేల బహుమతీ ఇవ్వబడుతుంది చూశావా? ఎంత కరెక్టు గా సరిపోయాయో" పేపరు కటింగ్ లో విషయాన్ని చదివి వినిపించి మళ్లీ జేబులో పెట్టుకున్నాడు ఇన్స్పెక్టరు.

శ్రీరామ్ కి ఒళ్లు మండిపోయింది.

"ఏమిటండీ సరిపోయింది? చూడండి తన కట్టుకున్నది చిలకాకు పచ్చరంగు చీరా? తను వేసుకున్నది నీలిరంగు బ్లౌజా?" వాటిని పట్టి చూపిస్తూ అడిగాడు.

"చూడు మిస్టర్! తెలివితేటలు నీకే సొంతమనుకోకు! డిపార్ట్ మెంట్ లో 'ట్వంటీ ఇయర్స్' సర్వీసున్న వాణ్ణి ఆవలించకుండానే పేగులు లెఖ్ఖ పెట్టగలవాణ్ణి! ఇప్పుడంటే ఆ అమ్మాయి తెల్లచీర కట్టుకుంది కానీ మీరీ హోటల్లోకి 'ఎంటరై' నప్పుడు చిలకాకు పచ్చరంగు చీరె కట్టుకుంది నీలం రంగు బ్లౌజు వేసుకుంది తన 'కలర్' కూడా చామనఛాయే. అదిగో, చెవులకు రింగులు కనిపిస్తూనే వున్నాయి కరెక్టుగా బెజవాడలోనే దొరికింది. ఇవన్నీ చూసింతర్వాతనే ఈ హోటలు మేనేజరు మాకు 'ఇన్ఫర్మేషన్' ఇచ్చాడు. ఇక వాదించి ప్రయోజనం లేదు పదండి స్టేషన్ కి."