తాతా ధిత్తై తరిగిణతోం 34

తాతా ధిత్తై తరిగిణతోం 34

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"ఏమైంది బాబూ? ఏమిటా కాగితం? అమ్మాయి గారు రాసిందేనా?"

ఆమెకు బదులు చెప్పలేక వస్తున్న దుఖాన్ని ఆపుకోలేక, చేతుల్లో ముఖాన్ని కప్పుకొని విలపించాడు.

'కాలేజీ నించి అరగంట ఆలస్యంగా  వస్తే నేను తట్టుకోలేను' అంటూ తన కూతురికీ తనకూ మధ్యనున్న అనుబంధాన్ని పదిమందికీ సగర్వంగా చెప్పుకునే తాను ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థం చేసుకోలేక పోతున్నాడు. తన బేబీ చనిపోకూడదని భగవంతుణ్ణి శతవిధాల వేడుకున్నాడు. ఇంతలో కామేశం డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు.

"త్వరగా నా బిడ్డని పరీక్ష చేయండి డాక్టర్." ఆయన చేతులు పట్టుకుని గద్గదస్వరంతో ప్రాధేయపూర్వకంగా అన్నాడు విష్ణుమూర్తి.

"ఏమైంది అసలు?" మంచం మీద కూర్చుని ఆమె నాడిని పరీక్షచేస్తూ అడిగాడు డాక్టరు.

"ఆత్మహత్య చేసుకోవాలని నా నిద్ర మాత్రలన్నీ మింగేసింది." ఆయన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు.

"డోంట్ వర్రీ సార్. ప్రాణాపాయంలేదు నాడి కొట్టుకుంటుంది. మాత్రలు మరికొన్ని ఎక్కువగా వేసుకుంటే డేంజరయ్యేది  ఇప్పుడు అర్జంటుగా 'యాంటీడోట్' ఇస్తే మీ బేబీ కోలుకుంటుంది. త్వరగా నర్సింగ్ హోంకి తీసుకురండి." అంటూ లేచాడు డాక్టర్.

పనిమనిషి సాయంతో ఆమెను కారులోకి ఎక్కించాడు విష్ణుమూర్తి. అయిదునిమిషాల్లో ఆ కారు నర్సింగ్ హోం ముందు ఆగింది.

*           *    *

శ్రీరామ్ ని మర్చిపోయి గోపాలాన్ని పెళ్ళి చేసుకోమంటూ తన తండ్రి ఒత్తిడి చేయటం వల్లనే అశ్విని అలాంటి తీవ్రనిర్ణయం తీసుకుందని విష్ణుమూర్తి గ్రహించాడు.

అదృష్టవశాత్తు ఆ గండం గడిచి నర్సింగ్ హోం నించి అశ్విని క్షేమంగా ఇంటికొచ్చి మూడు రోజులైనా ఆమెకు ఎదురుపడి మాట్లాడేందుకు 'గిల్టీగా' ఫీలవుతున్నాడు. అందుకే ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతున్నాడు.

ఆఫీసులో కూర్చున్నంత సేపూ అశ్విని గురించే ఆలోచిస్తున్నాడు. శ్రీరామ్ ఆమె పెళ్ళి జరిపిస్తే తప్పేమిటి? అనే కోణం నుంచి కూడా ఆ ఆలోచనల్ని కొనసాగిస్తున్నాడు.

'తను తొందరపడి గోపాలాన్ని అల్లుడిగా చేసుకుంటానంటూ హనుమంతుకి మాట ఇవ్వకుండా వుండాల్సింది. అని కూడా అనుకున్నాడు.

ఏది ఏమైనా సమయం మించిపోలేదు కనుక చేసిన పొరపాటు సరిదిద్దు కోవాలని నిర్ణయించుకున్నాడు.

అందుకే ఆరోజు ఆఫీసుకి వెళ్ళేముందు హనుమంతు గదిలోకి వెళ్లాడు విష్ణుమూర్తి.

"ఏమిటి బావా నువ్వొచ్చావ్? హాల్లోంచి ఓ కేక పెడితే నేనే వచ్చి వాలిపోయేవాణ్ణిగా?" అంటూ ఎదురొచ్చి అడిగాడు హనుమంతు.

"నీతో కొంచెం ప్రయివేటుగా మాట్లాడాలి బావమరిదీ." అన్నాడు విష్ణుమూర్తి. అక్కడున్న సోఫాలో కూర్చుంటూ.

"ఏమైంది బావా?" అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు.

"ఏమైందో నీకు తెలుసుగా?" విష్ణుమూర్తి స్వరంతో ఆవేదన ధ్వనించింది.

"ఓ అశ్విని గురించా?"

"అవును బావమరిదీ అది తన కాలేజీలో చదువుతున్న ఓ కుర్రాణ్ణి ప్రేమించింది."

"అవును అందులో తప్పేముంది? ఆ వయసులో ఎవర్నో ఒకర్ని ప్రేమించకపోతే తప్పవుతుంది...అయినా కాలేజీ చదివేటప్పుడు ప్రేమించక పోతే కాటికి కాళ్లు చాపుకున్నప్పుడు ప్రేమిస్తారా ఎవరైనా?" జోక్ గా మాట్లాడుతున్నాననుకొని, తనకు తానే నవ్వుకున్నాడు.

అయినా విష్ణుమూర్తి గంభీరంగానే వున్నాడు.

ఇంతలో హనుమంతు మళ్లీ చెప్పాడు.

"చూడు బావా! తొందరగా పంతులు గార్ని పిలిచి ముహూర్తం పెట్టించేసి మా గోపాలంతో తనకు పెళ్ళి చేసేసి మరుక్షణంలో వాళ్ళిద్దర్నీ 'హనీమూన్' పంపించేయ్...అన్నీ అవే సర్దుకుపోతాయ్."

"ఆ విషయం మాట్లాడాలనే  వచ్చాను కానీ..."ఎలా చెప్పాలో ఎలా ప్రారంభించాలో తెలియక ఆలోచిస్తూ ఆగిపోయాడు విష్ణుమూర్తి.

"అర్థమైందిలే బావా. అశ్విని వేరే కుర్రాణ్ణి ప్రేమించింది కనుక ఈ పెళ్ళికి మావాడు ఏదైనా అభ్యంతరం చెప్తాడేమోనని నువ్ భయపడుతున్నావ్...అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. మా వాడు అమెరికాలో పెరిగినవాడు. ఆధునిక భావాలు వున్నవాడు...రేపు పెళ్లికాగానే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ తన దారికి తెచ్చుకోగల సమర్థుడు." గొప్పగా చెప్పాడు హనుమంతు.

"కానీ అశ్విని పెళ్లి మీ గోపాలంతో జరగదు బావమరిదీ!" వెంటనే చెప్పాడు విష్ణుమూర్తి.

షాక్ తిన్నట్టు చూశాడు హనుమంతు.