Rating:             Avg Rating:       466 Ratings (Avg 2.98)

సిల్లీఫెలో - 1

Listen Audio File :

 

 

 

                                                      సిల్లీఫెలో - 1


                                                                                                                                                                                    - మల్లిక్


సమయం....
సాయంత్రం నాలుగు గంటలు! అదొక గవర్నమెంటు ఆఫీసు. గవర్నమెంటు ఆఫీసు ఎలా వుంటుందో ఆ ఆఫీసు కూడా ఎంచక్కా అలాగే వుంది.

కారి డార్స్ లో గోడల మీద కిళ్ళీ ఉమ్ముల డిజైన్లతో, అక్కడక్కడా వున్న టాయిలెట్స్ వాసనల ఘుమఘుమలతో గదుల్లో పెయింట్ పోయిన అలమారాతో, కాళ్ళు ఊగే టేబుల్స్ తో, ఆ టేబుల్స్ మీద  నలిగిన కాగితాలున్న దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్స్ తో, సీట్లలో ఏ ఎక్స్ ప్రెషన్ లేని మొహాలేస్కుని కూర్చున్న మనుషులతో చాలా కళకళలాడుతుంది ఆ ఆఫీసు.

బుచ్చిబాబు ఓసారి గోడగడియారం వంక చూసి బస్సున నిట్టూర్చాడు. ఆ తర్వాత తన సీట్లో అసహనంగా కదిలాడు.

అతని ప్రక్కసీట్లోని వెంకట్ బుచ్చిబాబు వంక చూసాడు.

"ఏం.. పనెక్కువుందా?" అడిగాడు వెంకట్.

బుచ్చిబాబు తల అడ్డంగా ఊగించాడు.

"సిల్లీ - పనెక్కువుంటే నేనేమైనా భయపడ్తానా?" అని సమాధానం చెప్పి ఫైల్లో తల దూర్చాడు.

ఓ నిముషం గడిచింది.

మరోసారి గోడ గడియారం వంక చూసి బస్సున నిట్టూర్చాడు బుచ్చిబాబు. నాలుగు క్షణాలు గ్యాప్ ఇచ్చి "చుపుక్" అని నోటితో శబ్దం చేసాడు. మరో ఎనిమిది క్షణాలు గ్యాప్ ఇచ్చి తల అడ్డంగా ఊపుతూ "హా" అన్నాడు.

అతన్ని గమనిస్తున్న వెంకట్ ఊరికే ఉండలేకపోయాడు.

"ఏ క్యా హాల్ బన్ రఖా తునే ఏంటి నీ బాధా? పనెక్కువ లేదంటున్నావ్. మరెందుకు అంతగా హైరానా పడుతున్నావ్?" అని అడిగాడు.

"అంటే నాకు ఇంటికి త్వరగా వెళ్ళే పనుంది" నసిగాడు బుచ్చిబాబు.

"అలాగైతే ఊర్కే హైరానా పడ్డం ఎందుకు? బాస్ ని పర్మిషన్ అడిగి వెళ్ళిపో" ఉచిత సలహా ఇచ్చాడు వెంకట్.

"ఏమో బాబూ... అర్థంకాని తిట్లు సిల్లీగా తిడ్తాడేమోనని నా భయం"

"ఎందుకు తిడతాడు? అయినామనమేవైనా ఎప్పుడూ పర్మిషన్లు అడుగుతుంటామా ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే అడుగుతాం గానీ.. మరేం ఫరవాలేదు. వెళ్ళి అడుగు" అని వెంకట్ ధైర్యం చెప్పాడు.

పర్మిషన్ కోసం మనం చెప్పే కారణాలు మనకి రీజనబుల్ గానే వుంటాయ్ గానీ బాస్ కి మాత్రం అవి సిల్లీగా ఉంటాయ్. అదే కదా బాధ" అంటూ సీటు లోంచి లేచి భారమైన గుండెతో మేనేజర్ ఏకాంబరం క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు బుచ్చిబాబు.

ఏకాంబరం ఫైళ్ళలోకి తీవ్రంగా చూస్తున్నాడు. బుచ్చిబాబు మెల్లగా దగ్గాడు.

ఏకాంబరం తలెత్తి చూడలేదు.

బుచ్చిబాబు మరికాస్త గట్టిగా దగ్గాడు.

ఏకాంబరం తలెత్తి చూశాడు.

"నువ్వా? ఒహటే దగ్గులు వినిపిస్తే నా క్యాబిన్ లోకి ఎవరో క్షయ రోగి వచ్చేశాడేమో అనుకున్నా అన్నాడు బుచ్చిబాబు వంక సీరియస్ గా చూస్తూ.

"అంటే మీరు అనను చూళ్ళేదనీ..." నసిగాడు బుచ్చిబాబు బుర్ర గోక్కుంటూ.

"అందుకని అంత ఘోరంగా దగ్గాలా మరీనూ? సార్ అని పిలవొచ్చుకదా? ఏంటి విషయం?" కళ్ళెగురవేసాడు ఏకాంబరం.

"అంటే... అదీ... మరేమో..." బుచ్చిబాబు సందేహిస్తూ చెప్పేలోగా టైపిస్టు లత హడావిడిగా ఏకాంబరం క్యాబిన్ లోనికి వచ్చింది.

"ఏమ్మా? ఆ అర్జంట్ లెటర్ టైప్ చేశావా?" ఆమెని అడిగాడు ఏకాంబరం.

"చేశానండీ"

లత తన చేతిలోని లెటర్ ని ఏకాంబరం చేతికి అందించింది. లెటర్ ఆసాంతం చదివిన ఏకాంబరం లత వంక చూసి "కిల్లారి కత్తి!" అన్నాడు.

వెంటనే లత కిలకిలా నవ్వి మెలికలు తిరిగిపోతూ "థాంక్యూ సార్!" అంది.

"థాంక్సా? ఎందుకూ?"

"ఎందుకేంటి సర్.. లెటర్ తప్పులు లేకుండా టైపు చేసానని నన్ను "కిల్లారి కిత్తి" అని మెచ్చుకున్నారుగా?!" అమాయకంగా అడిగింది.

"అది మెచ్చుకోవడం కాదు. కిల్లారికిత్తి అంటే తిట్టు. నువ్వు లెటర్  నిండా తప్పులు కొట్టావ్. దీన్ని మళ్ళీ టైప్ చెయ్" అంటూ లెటర్ ని లత ముందుకి విసిరాడు ఏకాంబరం.

లత ఆ లెటర్ అందుకుని రెండడుగులు గుమ్మంవైపు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి మేనేజర్ ఏకాంబరం వైపు చూసింది.

"సార్... కిల్లారి కిత్తి అంటే అంటే ఏంటి సార్? భయం భయంగా అడిగింది లత.

"వద్దులెమ్మా... అర్థాలడక్కు! అది భయంకరమైన తిట్టు!" అన్నాడు ఏకాంబరం.

"ఫరవాలేదు సార్. నేను తట్టుకుంటాను. చెప్పండి. మీరు దాని అర్థం చెప్పకపోతే మళ్ళీ రాత్రంతా నిద్రపట్టదు. రాత్రంతా నిద్ర పట్టకపోతే మళ్ళీ రేపు శలవు పెట్టాల్సి వస్తుంది."

"అమ్మో శలవా? వీల్లేదు! నీ ఖర్మ, చెప్తా ఇలారా" అంటూ దగ్గరికి పిలిచాడు ఏకాంబరం.

 

                                                        (ఇంకావుంది.)