సిల్లీ ఫెలో - 71

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 71

- మల్లిక్

 

"ఊర్కోండి లిల్లీగారు! ఊర్కోండి! మంగారావుగారు వెళ్ళిపోతున్నందుకు మీకు బాధకలగడం సిల్లీయేకాదు. సహజమే! కష్టాలెప్పుడూ కలకాలం ఉండవు. కొద్దిరోజుల్లో కొత్త మేనేజరు వస్తాడు.అతను మంగారావు కంటే మిమ్మల్ని ప్రేమగా చూస్కుంటాడేమో యెవరికి తెలుసు?" అన్నాడు బాధగా మొహం పెట్టి.

బుచ్చిబాబు వెనకాల నిలబడ్డ మోహన్ హవ్వ..... హవ్వ అంటూ మూతిమీద కొట్టుకున్నాడు.

లిల్లీ చివాలున తలెత్తి బుచ్చిబాబు వంక ఓసారి సీరియస్ గా మింగేసేలా చూసి మళ్ళీ తలవంచుకుని కొంగునోట్లో దోపుకుని "ఊహూ.. ఊహూ..." అంటూ కుమిలిపోయింది.

ఇప్పుడు అనకూడనిది నేనేమన్నానని అలా మింగేసేలా చూసింది అని ఆశ్చర్యపోయాడు బుచ్చిబాబు.

మంగారావుని కూడా పలకరించక పోతే బాగుండదని బుచ్చిబాబు అతని క్యాబిన్ లోకి వెళ్ళాడు. మంగారావు "క్యార్... క్యార్" మని ఏడుస్తూ బుచ్చిబాబుని గాఠిగా కౌగలించుకుని "చూశావా బుచ్చిబాబు... యెంత అన్యాయం అయిపోయిందో హత్తెరి" అని అన్నాడు వెక్కుతూ.

పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా ఏడవడమంటే ఇదే కాబోలు అనుకున్నాడు బుచ్చిబాబు. నిజంగా ఆ ట్రాన్స్ ఫర్ బుచ్చిబాబూ, ఇంకా అలాంటి కొంతమందీ చేసిన కంప్లయింట్స్ వల్ల వచ్చిందని ఆ క్షణంలో మంగారావుకి తెలిస్తే బుచ్చిబాబుని పీక పిసికి కిటికీలోంచి అవతలికి తోసేసి ఉండేవాడే!"

మంగారావ్ ఇంకా బుచ్చిబాబుని కౌగలించుకునే వెక్కసాగాడు.

"ఊరుకోండి సార్... ఊర్కోండి" మంగారావ్ వీపుమీద తట్టాడు బుచ్చిబాబు. "పెంటకుర్రు చాలా మంచి ఊరని విన్నాను సార్... అక్కడ చాలా రిచ్ కస్టమర్లు ఉంటారట" అన్నాడు.

ఆ మాట వినగానే మంగారావు బుచ్చిబాబు భుజం మీద నుండి మొహం తీసి హన రెండు చేతులూ బుచ్చిబాబు భుజాలమీద వేసి "అవునా? నిజంగానా?" అని సంతోషంగా అడిగాడు తన కన్నీళ్ళని ఆనంద భాష్పాల్లోకి మార్చుకుంటూ.

"అవున్సార్. నిజం" అన్నాడు బుచ్చిబాబు.

మంగారావు అరచేతి వెనుక భాగంతో కన్నీళ్లు తుడుచుకున్నాడు.

"వెధవా... అక్కడ నీకు ఒక్క కస్టమరూ తగల్డు. తగిలినా ఏ వెధవా ఒక్క పైసా కూడా ఇవ్వడు" మనసులో కసిగా అనుకున్నాడు బుచ్చిబాబు.

మధ్యాహ్నం లంచ్ టైమ్ లో మంగారావు రిలీవ్ అయి వెళ్ళిపోతే అక్కడికి కొత్త మేనేజరుగా ఎవరొస్తారన్న విషయం మీద స్టాఫ్ మధ్య చర్చ జరిగింది.

ఒకరేమో ఢిల్లీ నుండి చుంచూలాల్ వస్తాడని అంటే, మరొకరేమో కలకత్తా నుండి కంగాళీ బెనర్జీ వస్తాడని అంటారు.

ఇంకొకడేమో బొంబాయి నుండి కంగార్ కార్ వస్తాడని ఘంటాపథంగా చెప్పాడు.

ఇలా చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు.

బుచ్చిబాబు లాంటి వాళ్ళయితే ఎవరైతే ఏంటిలే... మనకి ఒరిగేది ఏమీలేదు అని సైలెంట్ గా ఊర్కున్నారు.

ఆ సాయంత్రమే మంగారావుకి ఫేర్ వెల్ పార్టీ జరిగింది.

పార్టీ ప్రారంభంలోనే మంగారావు భోరున ఏడ్చాడు.

అతని ఏడుపు చూసి కొందరు సహృదయులు "ఊర్కోండి సార్... ఊర్కోండి అక్కడ కూడా మీకు మంచి కస్టమర్లు దొరుకుతార్లే!" అని ఊరడించారు. ఆ సహృదయుల్లో మంగారావు గురించి హెడ్డాఫీసుకి ఆకాశరామన్న ఉత్తరాలు రాసినవాళ్ళు కూడా ఉన్నారు.

పార్టీలో అందరూ మనసులో తిడుతూ పైకి పొగుడుతూ మంగారావు మీద ప్రసంగాలు చేశారు. పార్టీ అయిపోయింది. అందరూ మంగారావుకి షేక్ హ్యాండిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు. చివరగా మంగారావు లిల్లీ దగ్గరకు వచ్చాడు.

"ఇప్పుడు నేనో చిన్న పని చెయ్యబోతున్నా... మీరెవరూ అపార్థం చేస్కోరని భావిస్తాను" అక్కడి వాళ్ళని ఉద్దేశించి అన్నాడు మంగారావు.

"చేస్కోం" అన్నారు అందరూ కోరస్ గా.

"లిల్లీ నా కూతురులాంటిది" అన్నాడు మంగారావు.

అందరూ ఫకాల్మని నవ్వి "అవును... అవును" అంటూ బుర్రకాయలూపారు.

"కూతుర్ని దగ్గరకు తీస్కుంటే తప్పులేదనుకుంటాను?"

"అస్సలు లేదు" పగలబడి నవ్వుతూ అన్నారు.

మంగారావు లిల్లీని దగ్గరికి తీసుకున్నాడు.

అందరూ కసిగా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు.