సిల్లీ ఫెలో - 10

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 10

- మల్లిక్

 

"మొన్న ఆ పిచ్చికవారి పిడుగుపిల్ల మా నాన్నగారికి నచ్చలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే సిల్లీగా పెద్ద గొడవైపోయి వుండేది. ఇంక ఆయన ఊర్కోరని నాకు అర్థం అయిపోయింది. వర్సపెట్టి వేరే అమ్మాయిల్ని చూస్తూనే వుంటాడు. నా దుంప తెంచుతూనే వుంటారు. కాబట్టి ఈవేళే మా అమ్మానాన్నలకు నీ గురించి చెప్తాను. వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను. దానికి నీ సహకారం కూడా కావాలి.

"ఏంటది?"

"నువ్వు ఆఫీసుకు శలవుపెట్టి రెండ్రోజులు మా ఇంట్లో వుండాలి"

"మీ ఇంట్లోనే... బాబోయ్ ఎందుకు?" గుండెమీద చేయ్యేసుకుంటూ అడిగింది సీత.

"మామూలుగా చెప్తే మా నాన్నగారు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి నువ్వు ఓ రెండు రోజులుండీ నీ ప్రవర్తన ద్వారా మా అమ్మానాన్నల మనసు దోచుకోవాలి" అన్నాడు బుచ్చిబాబు.

"ఎలా?" అయోమయంగా అడిగింది సీత.

"నీ వల్ల కాదంటే మన పెళ్లికాడు అంతే! తర్వాత నీ యిష్టం సినిమాల్లో చూడ్డంలేదా? అంతే. ఈ పెద్దవాళ్ళకి అలాగయితేనే నచ్చుతుంది. ప్లీజ్ సీతా! సీతా మనకోసం ఈ చిన్నపని చేయవూ? మనకోసం కాకపోతే పోనీ నాకోసం" సీత గడ్డం పుచ్చుకుని బ్రతిమలాడాడు బుచ్చిబాబు.

"సరేలే...." సీత వప్పుకుంది. కానీ నేను మీ ఇంట్లో ఉండటానికి మీ అమ్మానాన్నా ఒప్పుకుంటారా అని?"

"ఆ విషయం నీకు మా అమ్మానాన్నలతో మాట్లాడిన తరువాత చెప్తాను.

సీత వాచ్ వంక చూసింది.

"అమ్మో చాలా టైముంది. మా వార్డెన్ ఏడుస్తుంది. మనమింకా పోదాం" అంటూ లేచి నిలబడింది. బుచ్చిబాబు కూడా లేచి నిలబడ్డాడు.

ఇద్దరూ ఆ బఠానీలు అమ్మే కుర్రాడిని దాటి ముందుకెళుతుండగా ఆ బఠానీల కుర్రాడు ఇలా అన్నాడు.

"ఏం సార్ ఇంత పిసినిగొట్టువి? నా దగ్గర రూపాయి బఠానీలు కొనుంటే నేను వెళ్ళిపోయుండేవాడిని కదా. చక్కగా అమ్మగార్ని ముద్దు పెట్టుకుని వుండేవాడివి. ఒక్క రూపాయికోసం ఎంత మంచి ఛాన్సు వదలుకున్నావు సార్! థూ!"

వాడు మాటలకి సీత ఫక్కున నవ్వింది.

"బుచ్చిబాబు "ఈ" అని అరుస్తూ బాధగా జుట్టుపీక్కున్నాడు."

*            *               *

"దిక్కుమాలిన వెధవ... సన్నాసి వెధవ... ఏబ్రాసి వెధవ... మాయదారి వెధవ...

పచార్లు చేస్తూనే బుచిబాబుని తిడుతూనే వున్నాడు పర్వతాలరావు. బుచ్చిబాబు తలవంచుకొని నిల్చున్నాడు.

"పాపం తిట్టకండీ" అంది పార్వతమ్మ.

"తిడ్తానా చీరేస్తానా? మన వంశంలో ఇప్పటిదాకా ఏ వెధవయినా ప్రేమించి పెల్లిచేసుకున్నడా అని?" హుంకరించాడు పర్వతాలరావు.

"వెధవల్లేం ప్రేమించారు" నసుగుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఏంటి కూస్తున్నావు?" సరిగా వినిపించక మళ్ళీ అడిగాడు పర్వతాలరావు.

"అబ్బ, మీరు ఊర్కోండి. ఎందుకలా అరుస్తారు? అసలు అప్పుడే పెళ్ళివద్దని అనేవాడు ఇప్పుడు చేసుకుంటానని అంటున్నాడు. అందుకు సంతోషించండి."

"అవును. నా నెత్తిన కిరీటం పెట్టడానికే పెళ్ళిచేసుకుంటున్నాడు తింగరి వెధవ"

"అసలు ఆ అమ్మాయెవరో ఏంటో తెలీకుండా వద్దని అరుస్తారేం అర్థంపర్థం లేకుండా?"

"నాన్నగారెప్పుడూ అంతే... సిల్లీగా" అన్నాడు బుచ్చిబాబు.

 
"సరే చెప్పరా .... ఇంతకీ ఆ అమ్మాయిని కన్న వెధవవడో ..." అన్నాడు పర్వతాలరావు.

"సీతవాళ్ళ అమ్మానాన్నలు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు నాన్నా" చెప్పాడు బుచ్చిబాబు.

"అయ్యయ్యో పాపం... ఆ యాక్సిడెంట్ చేసిన వెధవవడో గానీ..." జాలిపడుతూ అన్నాడు పర్వతాలరావ్.

"పాపం....ప్చ్" అంది పార్వతమ్మ.

"చిన్నప్పటి నుండీ వాళ్ళ మేనమామే ఆమెని పెంచాడు. ఆమె మేనత్త చాలా గయ్యాళిది. చదువు పూర్తయి ఉద్యోగం దొరికేదాకా ఓపిక పట్టి తరువాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుండి ఉద్యోగం చేసుకుంటోంది" చెప్పాడు బుచ్చిబాబు.

"మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే ఆనవాయితి లేదు. అయినా ఉద్యోగం చేసే పిల్ల మనకెందుకురా? లక్షణంగా కాపురం చేసే పిల్లకావాలిగానీ...." దీర్ఘాలు తీశాడు పర్వతాలరావు.

"అంటే. ఉద్యోగం చేసేవాళ్ళు లక్షణంగా కాపురం చెయ్యరా నాన్నా?"