Rating:             Avg Rating:       429 Ratings (Avg 2.91)

సిల్లీ ఫెలో - 11

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 11

- మల్లిక్

 

"చక్కగా అడిగావురా బాబూ"

"అయినా మీరు నో అని సిల్లీగా అనడానికి నాకేం కారణం కనిపించలేదు నాన్నా"

"చిన్నవాళ్ళు మీకు తెలీదు. పెద్దవాళ్ళం మేమయితే కట్టుబాట్లు, సంప్రదాయం అన్నీ చూసి చేస్తాం. నీకు లక్షణంగా వుండే పిల్లను చేస్తాం గానీ పనికిమాలిన దాన్ని తెచ్చి చెయ్యంకదా?" అన్నాడు పర్వతాలరావు.

"జీవితాంతం ఆ అమ్మాయితో కాపురం చేసేది నేనయినప్పుడు పనికిమాలిన అమ్మాయిని చేసుకుని జీవితం నాశనం చేసుకోవాలని నేను కూడా అనుకోనుకదా? ఆ అమ్మాయిని మీకు తెచ్చి పరిచయం చేస్తాను నాన్నా. కావాలంటే రెండురోజులు మనింట్లో వుంచుకుని చూడండి. అప్పుడు కూడా ఆ అమ్మాయి నచ్చలేదని మీరంటే నేను చేసుకోను సరేనా?" అడిగాడు బుచ్చిబాబు తల్లితండ్రులు ఇద్దరి మొహాలవంకా మార్చి మార్చి చూస్తూ.

"మరింకేం?" సరేనండి" పర్వతాలరావు భుజాలుపట్టి ఊపుతూ అంది పార్వతమ్మ.

"ఏంటా ఊపడం నా తలపండు ఊడి నేలమీద రాలేలా? ముందా వెధవ చేతులు నా భుజాల మీద నుండి తియ్" అన్నాడు పర్వతాలరావు.

"ఛీ... ఏంటండీ ఆ పాడు మాటలు?" మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది పార్వతమ్మ.

"పర్వతాలరావు బుచ్చిబాబు వంక చూస్తూ అన్నాడు "సరేనోయ్ వెధవాయ్. అలాగే కానీయ్".

బుచ్చిబాబు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ "థాంక్యూ డాడీ" అన్నాడు.


*            *            *

ఆటో బుచ్చిబాబు ఇంటి ముందు ఆగింది, దాంట్లోంచి సీత, బుచ్చిబాబు దిగారు. బుచ్చిబాబు చేతిలో సూట్ కేసుతో ఇంటివైపు అడుగులు వేసాడు. అతని ప్రక్కనే నడుస్తూ బరువెక్కిన గుండెతో సీత అంది.

"నాకేంటో భయంగా వుంది.

"భయమెందుకూ? మనమేమయినా రాక్షస కోనలోకి అడుగు పెడుతున్నామా? మా నాన్నగారు కాస్త కఠినంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది గానీ ఆయన చాలా మంచివారు. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా?" అడిగాడు బుచ్చిబాబు.

సీత ఉన్నాయ్ అన్నట్టు తల ఊపింది.

ఇద్దరూ ఇంటి గుమ్మం దగ్గర ఆగారు.

"ఇప్పుడు మనం ఇలా లోపలికి అడుగు పెట్టగానే మా అమ్మానాన్న మనకోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని వుంటారు. నేను నిన్ను పరిచయం చెయ్యగానే నువ్వు వాళ్ళిద్దరి కాళ్ళకీ మొక్కు" అన్నాడు బుచ్చిబాబు.

"మరీ అంత యిదిగా కాకాపడ్తున్నట్లు చేస్తే బాగోదేమో? నమస్కారం పెడితే చాలదా?" సందేహంగా చూస్తూ అడిగింది సీత.

"చాలదు. మన పెళ్ళి జరగడం కోసం కొన్ని నేను చెప్పినట్లు చేయాల్సిందే!! పద" అంటూ లోపలికి అడుగుపెట్టాడు బుచ్చిబాబు.

సీత బితుకు బితుకు మంటూ అతన్ని అనుసరించింది.

బుచ్చిబాబు ఊహించిన విధంగానే పర్వతాలరావు, పార్వతమ్మ హాల్లో సోఫాలో కూర్చిని వీళ్ళకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు తన చేతిలోని సూట్ కేసుని గోడవారగా పెట్టాడు.

సీతను చూడగానే పార్వతమ్మ సోఫాలోంచి లేచి నిలబడి "రామ్మా...రా!"  అంది సాదరంగా. పర్వతాలరావు మాత్రం ఆమెని ఎక్స్ రే కళ్ళతో గమనించసాగాడు.

"ఈ అమ్మాయే సీత! మా అమ్మా నాన్నా!!" పరిచయం చేశాడు బుచ్చిబాబు.

అతని నోటివెంట వాక్యం పూర్తి అయ్యి అవకముందే సీత గభాల్న వంగి వాళ్ళిద్దరి పాదాలకూ నమస్కరించింది.  

అంత హఠాత్తుగా ఆమె క్రిందికి వంగేసరికి పర్వతాలరావు గబుక్కున కాళ్ళు పైకెత్తి సోఫామీద పెట్టుకున్నాడు.

"ఏంటమ్మా ఇప్పుడు నువ్వు చేసింది?" కళ్ళు మిటకరిస్తూ అయోమయంగా ప్రశ్నించాడు పర్వతాలరావు.

"పరిచయం చేశాను కదా? మీ కాళ్ళకి మొక్కింది నాన్నా!" చెప్పాడు బుచ్చిబాబు.

"అంతేకదా? క్రిందికి వంగి కాళ్ళు పట్టి లాగి పడేస్తుందేమో అని భయపడి చచ్చాను. నాకేం తెలుసు ఈరోజుల్లో పెద్దలంటే ఇంత గౌరవం వుండే వాళ్ళుంటారనీ!"

"చాల్లెండి మీది మరీ చోద్యం. నువ్విక లేమ్మా!" అంటూ సీతని భుజాలు పట్టి లేవదీసింది పార్వతమ్మ.

"సీతకి పెద్దలంటే గౌరవమే కాకుండా సాంప్రదాయబద్ధంగా వుండడం అంటే ఎంతో ఇష్టం నాన్నా" హుషారుగా అన్నాడు బుచ్చిబాబు.

"నువ్వు చెప్పనక్కర్లేదు లేవోయ్ వెధవాయ్. తెల్సుకోగలనులే" అన్నాడు పర్వతాలరావు సీత మీద నుండి దృష్టి మరల్చకుండా.

సీత పైట చెరగును భుజాల మీదుగా  నిండుగా కప్పుకుంది.

పార్వతమ్మ కూడా సీతని రెప్పవాల్చకుండా చూడసాగింది.

కోల మొహం, పెద్ద కళ్ళు, సన్నని ముక్కు, చిన్న నోరు, నొక్కుల నొక్కుల జుట్టుతో పెద్ద జడ, బాగా గంజి పెట్టిన ఇస్త్రీ చేసిన బెంగాల్ కాటన్ హాఫ్ లైట్ శారీలో పచ్చని శరీర ఛాయతో అందంగా వుంది  సీత.

వాళ్ళిద్దరూ అలల రెప్ప వాల్చకుండా చూస్తుంటే సీతకి ఇబ్బందిగా అనిపించి తల వంచుకుని నేలచూపులు చూడసాగింది.

"చూడమ్మాయ్..." దీర్ఘాలు తీస్తూ అన్నాడు పర్వతాలరావు.

సీత ఆయనవంక చూసింది.