Shivatandavam - Comedy Serial

Listen Audio File :

 Comedy Audio Serial

1 వ భాగం.

అదొక ఊరు.

ఏ ఊరైతే మనకేం? అల్లాంటి ఊళ్ళు ఆంధ్రదేశంలో అనేకానేకం ఉన్నాయి. అయితే, ఏ ఊళ్ళోనూ జరగని విశేషం ఆ రోజు ఆ ఊళ్ళో జరిగిపోతుంది! 'మగాళ్ళ హోటలు ప్రారంభోత్సవం' హోటల్ అన్నపూర్ణ, కనకదుర్గ, శ్రీలక్ష్మి, కావేరి, మనోరమ, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అంటూ తెలుగు దేశంలో స్త్రీలింగం హోటళ్ళు బోలెడున్నాయి.

అట్లాంటిది ఈ హోటల్ కి 'మగాళ్ల హోటల్' అని పేరు పెట్టడం విశేషం కాదా? ఈ హోటలు కట్టిన లేదా స్థాపించిన శ్రీ అప్పారావు దొరవారు భార్యా బాధితులు! పెళ్ళిగాక మునుపు చాకులాగా మెరిసిపోయిన దొరవారు పెళ్ళయ్యాక భార్యరత్నం చెప్పుచేతల్లోకి వెళ్ళిపోవలసివచ్చింది. పెళ్ళి చేసుకున్నంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదని - పెళ్ళయిన ఇరవై ఏళ్ళకి శ్రీ అప్పారావు దొరవారు తెలుసుకున్నారు.

అప్పటికి వారి లారీలూ, రైసు మిల్లులూ, సినిమా థియేటరు వగైరాలు శ్రీమతి అప్పారావుగారి వశమైపోయాయి. వాటిమీద వచ్చే రాబడి మొత్తం ఆవిడగారే తీసుకుంటున్నారు. పర్యవేక్షణ కూడా స్వయంగా ఆమెగారు చూసుకుంటున్నారు. శ్రీ అప్పారావు దొరవారు గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు.

ఆయన ఊరంతటికీ పులి, భార్యామణికి మాత్రం పిల్లి- మ్యావ్. ఆస్థిపాస్తులు శ్రీవారి స్వార్జితమైన ఆదాయం మాత్రం శ్రీమతిగారికే చేరాలి. అది రూలు! శ్రీవారి సరదలకీ, క్లబ్బుల్లో కాలక్షేపానికీ ఆవిడగారే దయతలచి వందో వెయ్యో ఇస్తుంది.

ఆ ఇచ్చినదానితో సరిపెట్టుకోవడం శ్రీవారు డ్యూటీ. పిల్లలకి అర్ధో, రూపాయో ఇచ్చి ముచ్చట తీర్చుకోవడానికి కూడా దొరవారికి హక్కులేదు. తనకి తెలీకుండా పిల్లలకి డబ్బులిచ్చి పాడుచేయకూడదని ఆర్డరు వేసింది. డబ్బులివ్వని తండ్రితో పిల్లలు మాత్రం ఎన్నాళ్ళు సఖ్యంగా వుంటారు? అందుచేత కన్నబిడ్డలు కూడా కట్టుకున్న మనిషికి బానిసలై పోయేరు.కొన్నేళ్ళపాటు శ్రీఅప్పారావు దొరవారికి తాను అనుభవించే నరకమేమిటో తెలిసేది కాదు.

తర్వాత్తర్వాత – ఆంధ్రదేశంలో 'అఖిలాంధ్ర స్త్రీ ద్వేషం సమాజం' పుణ్యమాని తానెంత దయనీయమైన స్థితిలో వున్నాడో తెలుసుకోగలిగాడు. 'అఖిలాంధ్ర స్త్రీ ద్వేషీ సమాజా'నికి అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ కె.శివరామారావు. శివరామారావు ఆజన్మ బ్రహ్మచారి, ఆంజనేయ ఉపాసకుడు మగజాటికి మార్గదర్శి! పత్రికల్లో శివరామారావు వ్యాసవిన్యాసాలూ, పలు పట్టణాల్లో అతని గంభీరోపన్యాసాలు తెలుగుదేశాన్ని ఒక ఊపు ఊపుతున్నాయి.

అఖిలాంధ్ర స్త్రీద్వేషీ సమాజం తాలూకు హెడ్డాఫీసు హైదరాబాదులో వుంది. అది పెరిగి పెద్దదై తెలుగు దేశమంతటా బ్రాంచీలు పెట్టుకుంది. శివరామారావు తలపెట్టిన ఉద్యమ ప్రభావం శ్రీ అప్పారావు దొరవారి మీద బాగా పనిచేసింది. తాను స్వతంత్రంగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో శివరామారావు సలహా మీద ఒక హోటలు పేరు 'మగాళ్ళ హోటలు'. దాని ప్రారంభోత్సవం జరుగుతోంది. శివరామారావే రిబ్బను కత్తిరించాడు.

కరతాళ ఆధ్వనుల, కొన్ని నినాదాలు! శివరామరావు గంభీరోపన్యాసం ఇట్లా సాగింది. “సోదరులారా! దొరవారు ప్రారంభించిన ఈ మగాళ్ళ హోటలు మూడు పూలూ ఆరు కాయలు వర్ధిల్లాలని నేను భగవాన్ ఆంజనేయుల్నిమనసారా ప్రార్థిస్తున్నాను.

మగాళ్ళ హోటలంటే ఏమిటర్థం? అసలీ హోటలు యొక్క పరమార్ధం ఏమిటి? సీరియస్ గా చెబుతున్నాను సోదరులారా - మగాడు ఆడదాని చేతికూడు తిని చెడిపోతున్నాడట. ఆడది వంట మాత్రమె చేయదు. అందులో మాయ మంత్రాలు కూడా రంగరించి పోస్తుంది.

ఆ తిండి తిని మగాడు తన పవరు పోగొట్టుకుని ఆమెకు దాసోహమంటున్నాడు. ఆమె చెప్పినట్టల్లా గంగిరెద్దు మాదిరి తల ఊపుతూ తన వ్యక్తిత్వాన్నీ.... సొంత తెలివితేటల్నీ మంగగలుపుకుంటున్నాడు. తరతరాలుగా సాగుతున్న ఈ తంతుని మన తరమైనా అంతం చేయాలి. అందుకు దొరవారు కూడా కంకణం కట్టుకున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను.

ఇక్కడ హాజరైన ప్రేక్షక మహాశయుల్లో తొందరపడి పెళ్ళి చేసుకున్న దురదృష్టవంతులెంతోమంది ఉండవచ్చు. పెళ్ళయిందంటే మగాడు సగం చచ్చినట్టే లెక్క... ఆడదానిమీద కోపం వచ్చినా కళ్ళెర్ర చేయలేడు. చెయ్యెత్తి కొట్టలేడు. గట్టిగా ఒకమాట అనలేడు. తన కోపాన్ని దిగమింగుకుని గుండెపోటు తెచ్చుకుంటున్నాడు. లేదా ఏ చెంబో, తపేళా మీద విరుచుకుపడి ఆ కసి తీర్చుకుంటున్నాడు.

కనీసం ఇంట్లో అలిగి ఒకటి రెండు రోజులు గాంభీర్యం నటించాలన్నా ఇల్లాలి మాయలు ఆ ప్రయత్నాన్ని కూడా చంపేస్తున్నాయి. మామూలు రోజుల్లో సదా కూరలు వండే ఇల్లాలు - ఇంటాయన అలిగినప్పుడు అతనికిష్టమైన మటన్ కర్రీనో, చికెన్ మషాళనో, గుత్తివంకాయో, పప్పు దోసకాయో ఏదిష్టమైతే అది ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తుంది.

పిల్లలచేత ఆ కూరల లిస్టునీ వాటి టెస్టునీ పొగిడిస్తుంది. ఆడదాని చేతి కూటికి అంకితమైన మగాడు తనకిష్టమైన కూరల పేర్లు వినగానే ఏమవుతాడు? అలగడం మానేసి అన్నం పెట్టుకుని కంచం ముందరేసుకుని కూచుంటాడు.

లేకపోతే, అర్థరాత్రి దొంగలాగా వంటింట్లో జొరబడి వడ్డించుకు తింటాడు. అలికిడైతే అంతా తెలిసిన ఇల్లాలు జాలిపడటం మానేసి కుక్కో, పిల్లో వచ్చిందని పక్కగదిలోంచి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తుంది. ఇన్ని అవమానాలు పడుతున్నాడు మగాడు. మగాడ్ని పడగొట్టడానికి ఆడవాళ్ళు ప్రయోగించే ఆస్త్రాల్లో వంటస్త్రం చాలా శక్తి వంతమైనదని ఈపాటికి మీరు అర్థం చేసుకునే వుంటారు.

అల్లాంటి అస్త్రాన్ని తిప్పికొట్టాలంటే ఇల్లాంటి మగాళ్ళ హోటలు ఊళ్ళో ఒకటైనా వుండాలి. సోదరులారా! మీకు మీ ఆడవాళ్ల మీద కోపమొస్తే నిర్భయంగా ఇంట్లో అలగండి. ఇంటి భోజనం మానేయండి. ఆ అలక పీరియడ్లో మగాళ్ళ హోటలుకొచ్చి భోంచేయండి. ఈ హోటలు ముఖ్యంగా బ్రహ్మచారుల కోసం.

ఇంట్లో అడిగివచ్చే మగాళ్ళకోసం పెట్టబడింది. మీకు ఏ కూరలు కావాలో అవన్నీ అడిగి చేయించుకునే అవకాశం యిక్కడ ఎంతైనా వుంది. నలభీములను మించిన వంటవాళ్ళు ఇక్కడే వున్నారు. మూర్తీ భవించిన మగతనం ఈ హోటలుకో శ్రీరామరక్షగా వుంది. అందుచేత స్త్రీ ద్వేశీ సమాజ సభ్యులందరికి ఈ మగాళ్ళ హోటలు ఒక వరప్రసాదమని కూడా నేను మనవి చేస్తున్నాను.

ఇల్లాంటి హోటళ్ళు ఆంధ్రదేశమంతా విస్తరించాలని స్త్రీ ద్వేషీ సమాజ ఆధ్యక్షునిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అఖిలాంధ్ర స్త్రీ ద్వేషీ సమాజం....”

“వర్ధిల్లాలి!”

“స్త్రీ ద్వేషీ ఉద్యమం"

“వర్ధిల్లాలి!”

మారుమోగే కరతాళధ్వనుల మధ్య నినాదాలమధ్య శివరామారావు కారెక్కి వెళ్ళిపోయాడు - పక్క ఊళ్ళో సభని జయప్రదం చేయడానికి.

NEXT  EPISODE