Shivatandavam - Comedy Serial 20

Listen Audio File :

20 వ భాగం

" అతని పేరు కృష్ణా ! కానీ వాళ్ళన్నయ్య మాత్రం బుజ్జులూ అని పిలుస్తారట! వాళ్ళన్నయ్య పేరు రామారావుగారు "

పంకజం క్షణం ఆలోచింది అన్నది " ఊ...అయితే చాలా విషయాలు చెప్పెడన్నమాట " అని.

" బుజ్జులు పాపం చాలా మంచివాడు ఆంటీ! కోపం వచ్చి కొట్టేడేగాని లేకపోతే ఎవర్నీ ఎప్పుడూ కొట్టడు "

పంకజం ఆకస్మాత్తుగా లేచి నుంచుంది " ఏమిటీ ? కొట్టాడా ? నిన్ను కొట్టాడా " అని అంది,

అప్పటిగాని వసుంధరకు తను నోరు జారినట్టు తెలీదు. సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ " అబ్బే..కొట్టలేదు ఆంటీ ! తన చేత్తో నా చెంపమీద ఊరికే ఇట్లా అన్నాడు అంతే " అని అన్నది.

పంకజం వసుంధరను దగ్గరికి తీసుకుని ఆమె చెంపను పరిశీలించి చూసింది. అయిదు వేళ్ళు కనబడ్డాయి.

అంతే ! దెబ్బ చూసేసరికి పంకజం ప్రాణం విలవిల్లాడింది!

" అయ్యయ్యో..అయిదేళ్ళూ అచ్చుపడేలా కొడితే ఊరికే ఇట్లా అన్నాడని చెబుతావేమిటి ?"

వసుంధర పంకజానికి దూరంగా కదిలి చెప్పింది " అచ్చు పడితే ఏమైందిట ? కొందరు గట్టిగా కొట్టకపోయినా అచ్చు పడుతుంది. నాకేం బాధగా లేదని చెప్పానుగా ! అతనితో నువ్వు మాట్లాడితే నువ్వే అంటావ్...చాలా మంచివాడని ! కానీ అతను ఆడవాళ్ళతో మాట్లాడుతున్నట్టు చూస్తే వాళ్ళన్నయ్య ఊరుకోడట ! మనింటికి వచ్చేవాడే కాని వాళ్ళన్నయ్యకు భయపడి రాలేదు " అని.

" బేబీ " మూడీగా పిలిచింది పంకజం. వసుంధర మాటాలాపి ఆంటీవైపు చూసింది !

" చెంప దెబ్బలు కొందరిని దగ్గరకు చేస్తాయని నువ్వు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉండి బేబీ ! చాలా ఆశ్చర్యంగా ఉంది " అని ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది.

చీకటి పడింది.

పంకజం రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాస్తుంది.

అక్షరాలను అనుకుంటూ రాయడం వల్ల ఆ రాస్తున్నది ఏమిటో అర్థమవుతుంది.

ప్రియాతి ప్రాయమైన శివుడూ...... ఈ ఉత్తరాన్ని నాకోసం చాడువుతావమే ఉద్దేశ్యంతో రాస్తున్నాను. దయచేసి పూర్తిగా చదువు. కోపతాపాలు దూరం చేసుకుని చదువు. నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు ! జరిగిన కథ యావత్తూ నీకు చెబుదామని వస్తే తలుపు తీయలేదు. ఫోన్ చేస్తే మధ్యలోనే పెట్టేసేవు. కనీసం ఈ ఉత్తరం ద్వారానైనా అసలు రహస్యం నీకు చెబుతున్నందుకు సంతోషంగా ఉంది.

శివుడూ..........ఆ రోజు రాత్రి ఎంతో సాహసం చేసి నది దాటి నా కోసం వచ్చేవు. నేను కూడా వేయి కళ్ళతో నీకోసం ఎదురుచూస్తున్నాను. కానే అదే సమయంలో..................... అంటూ ఉత్తరం రాస్తూనే ఉంది.

రాస్తే ప్రతి అక్షరాన్ని బిగ్గరగా చదువుతూనే ఉంది, అయితే పక్క గదిలో పాప్ మ్యూజిక్ రికార్డ్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీసు చేస్తున్న వసుంధర పుణ్యామా అని...............ఆ ఉత్తరంలో సమాచారం ఏమిటో మనకి తెలియడం లేదు.చెవులు హోరెత్తే శబ్దంలో పంకజం ఏమి అనుకుంటూ రాస్తుందో ఎట్లా తెలుస్తుంది. కేవలం పెదాలు కదులుతున్నాయి. అనేక రకాల హావభావాలు కనిపిస్తునాయి. ఉత్తరం సాగుతూనే ఉంది.

పక్కగదిలో సౌండ్ దుంప తెంచుతూనే ఉంది. వసుంధర డాన్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఆ ఉత్తరం తాలుకూ పూర్తీ సారాంశం మనక్కూడా తెలిసే అవకాశం ఉండేది. వెర్రెక్కించే సంగీతం వల్ల ఆ అవకాశం లేకపోయింది.

పంకజం ఇంకా రాస్తూనే ఉంది. మధ్య మధ్య నిట్టూర్పులు దుఃఖం ఆరాటం ఆవేశం అనేకానేక అనుభూతులతో ఉత్తరం సాగుతూనే ఉంది.

ఉత్తరం చివరికి వచ్చేసింది. అప్పటికి పక్కగదిలో డాన్స్ గోల కూడా పూర్తయింది. అందుచేత ఇప్పుడు రాస్తున్న ముగింపు వాక్యాలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. అవి ఇట్లా ఉన్నాయి!

అందుకే నిన్నుకొట్టి అక్కడి నుంచి తరిమేను శివుడూ! ఇప్పుడు విషయమంతా అర్థం చేసుకున్నావు గదా ! ఇందులో నా తప్పేమిటి చెప్పు ? ఇది జరిగిన తరువాత నీకోసం వెతికాను. విదేశాలకు వెళ్ళిపోయావని చెప్పారు. ఆ తరువాత ఎంతో కాలానికి నువ్వు ఈ ఊళ్ళో స్టిరనివాసం ఏర్పర్చుకున్నావని తెలిసి కేవలం నీ కోసమే ఇక్కడికి వచ్చాను.

శివుడూ....ఇప్పుడు నీ నిర్ణయం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. సానుభూతి చూపి నన్ను ధరిస్తావో...నీ మొండి పట్టుదల, తొందరపాటుతో దూరం చేసుకుంటావో...అదంతా నీ చేతుల్లోనే ఉంది. ఎప్పటికీ నీ పాదదాసి..... పంకజం.

ఉత్తరం పూర్తీ చేసి కవర్లో పెట్టి అతికించినది.

ఆ వేళకి వసుంధర వచ్చి అన్నది " భోజనం రెడీ ఆంటీ " అని.

" నాకు ఆకలి లేదు బేబీ! నువ్వు భోజనం చేసి పడుకో " అని చెప్పి పంకజం మంచం మీద వాలిపోయింది.

ఆమె వాకలాన్ని వింతగా చూస్తుంది వసుంధర.