సిల్లీ ఫెలో - 73

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 73

- మల్లిక్

 

"నీ బొంద! ఇది మన ఇల్లే" అంది సీత.

బుచ్చిబాబు సిల్లీగా కన్ ప్యూజ్ అయినందుకు తనని తనే తిట్టుకున్నాడు.

ఓ వెర్రినవ్వు నవ్వి వాళ్ళని సమీపించాడు.

"ఈమె రాధ. హైదరాబాద్ లో నా హాస్టల్ మేట్!" పరిచయం చేసింది సీత.

"హలో" అన్నాడు బుచ్చిబాబు.

"హలో" ప్రతిగా అంది రాధ.

"ఆమెని నాకు పరిచయం చేసావుగానీ నన్ను ఆమెకి పరిచయం చేయవేం సిల్లీగా?" సీతతో అన్నాడు బుచ్చిబాబు.

"ఒట్టి పరిచయం ఏంటి? మీ చరిత్రంతా నాకు చెప్తేనూ?" అంది రాధ బుచ్చిబాబుతో.

"చరిత్ర వుండడానికి నేనేమైనా మహా పురుషుడినా?" వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు.

"కానీ చరిత్రకెక్కే పనులు చేస్తున్నారుగా?"

ఆమె తనని పొగుడుతుందో, వ్యంగ్యంగా అంటోందో బుచ్చిబాబుకి అర్థంకాలేదు.

"సరే... ముందు లోపలికి రా... తీరుబడిగా మాట్లాడుకుందా" అంది సీత బుచ్చిబాబుతో.

ముగ్గురూ లోపలికి వెళ్ళారు.

బుచ్చిబాబు మొహం కడుక్కున్నాక సీత ముగ్గురికీ కాఫీ కలిపి పట్టుకొచ్సింది.

కాఫీ సిప్ చేస్తూ బుచ్చిబాబు రాధని అడిగాడు "ఈ ఊరికి ఏ పనిమీదయినా వచ్చారా?"

"ఊ... మీ పనిమీదే వచ్చాను" కూల్ గా అంది రాధ.

"మా పనా? ఆశ్చర్యంగా రాధ, సీత మొహాలవంక మార్చిమార్చి చూస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"అవును... పాపం సీత నాకు చాలా బాధపడుతూ ఉత్తరం రాసింది" గంభీరంగా అంది రాధ.

తాగుతున్న కాఫీకప్పును టీ పాయ్ మీద పెట్టేసి షడన్ గా లేచి నిల్చున్నాడు బుచ్చిబాబు.

"అర్రె! ఈ పూటకి కూరగాయలు లేనట్టున్నాయే! ఉండండి ఇప్పుడే బజారుకెళ్ళి కూరగాయలు తెస్తా"

హడావుడిగా బయటికెళ్ళిపోయాడు బుచ్చిబాబు.

సీత దిగులుగా రాధవంక చూసింది.

"ఎంతసేపూ అలా తప్పించుకుని తిరుగుతాడు... ఇంటికి రాడా ఏంటి?" అంది రాధ సీత భుజం తట్టి ధైర్యం చెబుతూ.


*            *           *