సిల్లీ ఫెలో - 74

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 74

- మల్లిక్

 

రాత్రి తొమ్మిదిగంటలయింది.

అప్పుడే ముగ్గురూ భోజనాలు ముగించి డైనింగ్ టేబుల్ ముందునుంచి లేచారు. ముగ్గురూ హాల్లోకివచ్చి కూర్చున్నారు. బుచ్చిబాబు టీపాయ్ మీద వున్నా వక్కపొడి డబ్బాలోంచి కాస్త వక్కపొడి తీసుకుని నోట్లో వేసుకున్నాడు.

రాధ గొంతు సవరించుకుంది.

"బుచ్చిబాబుగారూ... మీతో కాస్త మాట్లాడాలి" అంది.

బుచ్చిబాబు దీర్ఘంగా ఆవుళించి "అబ్బా... నాకు చాలా నిద్రోస్తోందండీ... రేపు మాట్లాడుకుందాం... నిద్రపోండి" అంటూ గభాలున లేచి బెడ్ రూంలోకి వెళ్ళి మంచం మీద పడ్డాడు.

రాధ ఎందుకు వచ్చిందో అతనికి అర్థం అయింది. అందుకే ఆమెని ఎవాయిడ్ చేస్తున్నాడు బుచ్చిబాబు. సీత కొట్టే సుత్తి భరించలేకపోతుంటే ఇంక రాధ కొట్టే సుత్తి కూడా భరించాలా?

బుచ్చిబాబు బెడ్ రూంలో పడుకున్నాడు. సీత, రాధ హాల్లో చాపమీద పడుకున్నారు.

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి వరిగాడు బుచ్చిబాబు.

అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది బుచ్చిబాబుకి.

ఎవరో డోర్ బెల్ నొక్కుతున్నారు.

బుచ్చిబాబు గడియారం వంక చూశాడు.

ఒంటగంటయింది.

"ఇంత అర్థరాత్రి ఎవరొచ్చుంటారబ్బా?" అనుకున్నాడు.

డోర్ బెల్ ఆగకుండా మోగుతోంది.

బుచ్చిబాబు విసుక్కుంటూ హాల్లోకి వచ్చాడు.

హాల్లో సీత, రాధ చాపమీద నిద్రకళ్ళేసుకుని కూర్చుని వున్నారు.

"అలా వెర్రి మొహం వేసుకుని చూడకపోతే తలుపు తియ్యొచ్చుగా?" సీతవంక మొహం చిట్లించి చూస్తూ అన్నాడు బుచ్చిబాబు.

"బాగానేవుంది. ఇంత అర్దరాత్రి ఎవరో బెల్ నొక్కుతుంటే ఆడవాళ్ళం మేమెలా తలుపులు తీస్తాం?" విసుక్కుంటూ అంది సీత.

"సరే... సరే..." అంటూ బుచ్చిబాబు వీధి తలుపు గడియ తీసాడు.

ఎదురుగా సుందర్! చేతిలో సూట్ కేసుతో.

"ఒరేయ్ సుందర్"

సుందర్ ని గట్టిగా కౌగలించుకున్నాడు బుచ్చిబాబు.

*            *          *

సుందర్ దీర్ఘంగా నిట్టూర్చాడు.

"ఊ... షానా బాగున్నది. మగ పురుషులము మనము ఇద్దరమూ ఈ మంషముమీద, అడస్త్రీలు ఇద్దరూ హాలు నందు నేలమీద... షానా షానా బాగున్నది.

బుచ్చిబాబుకి ఒళ్ళు మండిపోయింది.

"నూవ్వూర్కే నా చెవిలో రైలింజనులా బుస్ బుస్ మని అలా నిట్టూర్చకు. నాకు చెడ్డ చిరాకొచ్చేస్తుంది. అంతా నీవల్లే అయ్యింది. నీ మాటలు విని నిక్షేపంగా జరగబోయే పెళ్లిని ఆపుకున్నా... లేకపోతే ఈ పాటికి సీతా నేనూ హాయిగా పక్క పక్కన పడుకుని.. ప్చ్... ఇప్పుడనుకుని ఏం లాభం సిల్లీగా"

"మిస్టర్ బుష్షీబాబు... ఇంకా ఎక్కువ మాట్లాడిన యెడల నిన్ను షూట్ చేయుదును. నువ్వు డబుల్ స్టాండర్సుతో మాట్లాడుషున్నావు. షీటతో పెండ్లి ఇష్టము లేదు అనుషున్నావు. నాతో పెండ్లి ఇష్టము అనుషున్నావు. నీ ఉద్దేశము ఏమి?" సుందర్ మొహం చిట్లిస్తూ అన్నాడు.

"నిజమేననుకో. నాకు పెళ్ళి చేసుకుని ప్రేమను చంపుకోవడం ఇష్టం లేదు. కానీ సీతని కన్విన్సు చేయలేకపోతున్నాను! అందుకు నాకు చాలా బాధగా వుంది. నన్ను అసలు దగ్గరికి రానివ్వడం లేదు" బాధగా అన్నాడు బుచ్చిబాబు.

"అమెరికాలో ఇటుల దగ్గరకు రానివ్వని యెడల షూట్ చేయుదురు తెలుసునా?"

"నీ అమెరికా దొంగలు తోలా? ఓ ప్రక్క బాధతో నేనుచస్తుంటే అమెరికాలూ, షూటింగ్సూ అంతో అఘోరిస్తావేం?" పళ్ళు కొరికాడు బుచ్చిబాబు.

"ఇటుల పళ్ళు కొరికినను అమెరికాలో షూట్ చేయుదురు.

"ఈ..." బాధగా జుట్టుపీక్కున్నాడు బుచ్చిబాబు. "ఇటుల జుట్టు పీక్కునిన ఎడల అమెరికాలో షూట్ చేయుదురు అని మాత్రం అనకు. పీక పిసికి మంచం మీద నుంచి క్రిందికి తోసేస్తా...."

"ఒక్కే... ఒక్కే.... టేకిటీజీ! అటులయిన మీ మధ్య ఏ విధమైన సంబంధం లేదు... అవునా?" అడిగాడు సుందర్ బుచ్చిబాబుని.

"లేదూ... లేదూ.... లేదు"

"నేను షెవిటివాడనుకాను... ఒక్కసారి షెప్పిన షాలును. సంబంధము లేనియెడల సంబంధము బలవంతముగా కుదుర్చుకొనవలయును. యూనో?

"బలవంతంగానా సిల్లీగా ఏం జోకేశావ్ రా నా చిట్టితండ్రి. ఓసారి ముద్దుపెట్టుకుంటేనే నా నడ్డి పగిలేలా మంచం మీద నుండి క్రిందకి తోసేసింది. ఆ దెబ్బకి నేనసలు సంసారానికి పనికోస్తానా అని అనుమానం కూడా వేసిందనుకో" బిక్కమొహం వేసి అన్నాడు బుచ్చిబాబు.

"హహహ వాటే జోక్" పొట్ట పట్టుకుని నవ్వాడు సుందర్.

"నా బాధ నీకు జోక్ గా అనిపిస్తుందిరా?" ఉక్రోషంగా అన్నాడు బుచ్చిబాబు.

నోనోనో... నీ బాధా నా బాధా! అందుకే అంత దూరంనుండి వచ్చాన్" 

మంచి పని చేశావ్! నన్ను పీక్కు తింటానికి సీతకి తోడు రాధ కూడా వచ్చింది. నాకు తెలుసు... నన్ను పెళ్ళి చేసుకోమని అడగానికే రాధ అచ్చింది."

సుందర్ ఉలిక్కిపడ్డాడు.

"షిట్! రాడ కూడా నిన్ను  పెళ్ళి షేషుకొమన్నదా? నువ్వు షీటను పెండ్లి షేషుకొనుటకే షిడ్డముగా లేవు. రాడను ఎట్లు పెండ్లి షేషుకొందువు?" ఆశ్చర్యంగా అన్నాడు సుందర్.

బుచ్చిబాబు నెత్తికొట్టుకున్నాడు. నీ తెలివి మండినట్లే వుంది. రాధ తనను పెళ్ళి చేస్కోమని అడగడానికి రాలేదు. సీతని చేస్కోకని అడగడానికి వచ్చింది."

"యూడోంట్ వర్రీ! ఆమె విషయము కూడా నేను షూష్కుంటాను. నీవు లైటు ఆర్పివేయుము. మేము పడుకుందుము. అమెరికా నందు ఇటుల అర్థరాత్రి యందు షుత్తి కొట్టిన షూట్ చేయుదురు" చిరాకుగా అన్నాడు షుందర్.

బుచ్చిబాబు ఓసారి జుట్టు పీక్కుని తర్వాత లైటార్పేశాడు.

ఇక్కడ హాల్లో...

ఓహో... అలాగయితే నీ బుచ్చిబాబు మనసు మార్చేసింది ఈ పోనీ టెయిల్ గాడేనన్నమాట"

అంతదాకా సీత చెప్పింది విని అంది.

అవును! మనిద్దరం బుచ్చిబాబు బ్రెయిన్ వాష్ చేద్దామని అనుకుంటే నా ఖర్మకాలి సమయానికి వొచ్చాడు" అంది సీత.

నువ్వు వర్రీకాకు... ఆ షుందర్ సంగతి నేను చూస్కుంటా"


*        *            *