సిల్లీ ఫెలో - 72

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 72

- మల్లిక్

 

"లిల్లీ... నువ్వు కూడా అక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చెయ్" లిల్లీ చెవిలో అన్నాడు మంగారావ్.

"ఉండండి సార్...అంత కంగారయితే ఎలా? ఆ వచ్చె కొత్త బాస్ ఎలా వుంటాడో చూసుకుని వస్తా" లిల్లీ మంగారావు చెవిలో అంది.

"అంటే. వాడికి నచ్చితే సెటిలయిపోతావా హత్తెరి!"

"చూద్దాం అంటున్నాగా" విసుక్కుంది లిల్లీ.

"సొంత తండ్రి కూడా కూతుర్ని ఇంతసేపు కౌగలించుకోడు కద్సార్" గుంపులోంచి ఎవరో అరిచారు.

"హత్తెరి... ఎవరయ్యా అదీ? సొంతకూతురైతే ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి కూతుర్లాంటిదైతే ఎప్పుడోగానీ చేతికి దొరకదు కదా... హత్తెరి" కసురుకుంటూ అన్నాడు మంగారావ్.


*           *             *

బుచ్చిబాబు ఇంటివైపు నడుస్తూ ఉన్నాడు. అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు.

వారం క్రితం జరింగ సంఘటన అతని మెదడుని తొలిచేస్తోంది.

సీత ఇంక కన్విన్సు కాదు.

ఆలాంటప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది?

తల్లిదండ్రులకి అబద్దాలు చెప్పి ఇంతదూరం వచ్చింది సీత ఒక గదిలో చాపమీద, తను మరోగదిలో మంచం మీద పడుకోవడానికా?

అనవసరంగా సుందర్ గాడి మాటలు విని పెళ్ళి కాన్సిల్ చేస్కున్నాడా? తల్లితండ్రుల పెట్టిన ముహూర్తానికే బుద్ధిగా సీతని పెళ్ళి చేసుకుని వుండి వుంటే ఈపాటికి ఎన్ని మధురమైన రాత్రులు సీతతో గడిపి ఉండేవాడు?

తను పొరబాటుగానీ చేయలేదు గదా?

నో.... తనదేం పొరపాటు కాదు.

పెళ్ళయి వుంటే ఇద్దరికీ ఈ పాటికి ఒకరంటే ఒకరికి మోజు తగ్గిపోయి కీచులాడుకుని చస్తుండేవారు.

ఆ కిరణ్ గాడు అంతేగా? పెళ్ళివల్ల వాడి ప్రేమ మూన్నాళ్ళ ముచ్చటయింది.

సీతని ఎలాగయినా సరే తన దారికి తెచ్చుకోవాలి!

బుచ్చిబాబు ఇలా ఆలోచిస్తుండగానే ఇల్లు వచ్చేసింది.

బుచ్చిబాబు డోర్ బెల్ నొక్కాడు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.

ఎదురుగా ఎవరో పాతికేళ్ళ అమ్మాయి!

"ఓ... అయామ్ సారీ! ఏదో ఆలోచిస్తూ మా ఇల్లనుకుని మీ ఇంటి బెల్ నొక్కా సిల్లీగా... సారీ మేడమ్... వెరీ వెరీ సారీ...." కంగారుగా అని వెనక్కి తిరిగి రెండడుగులు వేశాడు బుచ్చిబాబు.

"ఏయ్ బుచ్చి" వెనుక నుంచి పిలుపు.

బుచ్చిబాబు ఉలిక్కిపడ్డాడు.

ఇదేంటి.. ఈవిడెవరో నన్ను చనువుగా బుచ్చీ అని పిలుస్తోంది? అసలు ఈమెకంత చనువెవరిచ్చారు సిల్లీగా?

బుచ్చిబాబు సీరియస్ గా మొహం పెట్టి వెనక్కి తిరిగి చూశాడు.

ఆ అమ్మాయి భుజాలమీదుగా వెనుక నుండి సీత చూస్తోంది.