సిల్లీ ఫెలో - 63

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 63

- మల్లిక్

 

"అ... అను"

సీత నోరు తెరిచింది. బుచ్చిబాబు కిళ్ళీని ఆమె నోటికి అందించాడు. తన చేతిలోని రెండో కిళ్ళీని నోట్లో పెట్టుకోబోతే సీత దాన్ని లాక్కుని తనే బుచ్చిబాబు నోట్లో పెట్టింది.

"నువ్వు వచ్చేలోగా నేను కిళ్ళీ చుట్టి రెడీగా వుంచి నువ్వు రాగానే నీ నోటికి అందించడానికి కారణం ఏంటో చెప్పగలవా?" కిళ్ళీ నముల్తూ అన్నాడు బుచ్చిబాబు.

"అదేం పిచ్చి ప్రశ్న? నీకు నా మీద ప్రేమ! అందుకే అలా చేశావ్" జవాబు చెప్పింది సీత.


"అసలయిన కారణం అది కాదు."

"మరి?"

"నువ్వు నా ప్రేయసి కావడం, భార్యని కాకపోవడం! అదే నువ్వు భార్యవి అయి వుంటే ఒసేవ్.. ఆ ఆకూవాక్కా ఇలా అందుకో అని సిల్లీగా నీకు పురమాయించి వుండేవాడినిగానీ నీకు కిళ్ళీలు చుట్టి పెడతానా?"

సీత రెండు చేతులతో తల పట్టుకుంది.

"బాబూ.. నువ్వింక ఆ సోది ఆపుతావా?"

బుచ్చిబాబు నవ్వాడు.

"నేను చెప్పేది సెంట్ పర్సెంట్ కరెక్ట్ అని నీకూ తెల్సూ. కానీ సిల్లీగా నాదంతా సోదని కొట్టి పారేస్తున్నావ్... అవునా?"

"సరే బాబూ... నన్ను వదిలెయ్! కాదంటే నువ్వూరుకుంటావా? నేను ఒప్పేసుకునేదాకా సిల్లీగా నన్ను చంపెయ్యవూ!"

"సిల్లీగా!"

బుచ్చిబాబు పకపకా నవ్వాడు. సీత అతని నవ్వుతో శృతి కలిపింది.

"నీకిక్కడ ఎలా వుంది?" కాసేపాగి అడిగాడు బుచ్చిబాబు.

"ప్రస్తుతానికి బాగానే వుంది."

"ప్రస్తుతానికి కాదు... ఎప్పటికీ బాగానే వుంటుంది. ఎందుకంటే మనం భార్యభర్తలం కాము... స్నేహితులం, ప్రేయసీ ప్రియులం."

"భార్యాభర్తలు స్నేహితుల్లాగా, ప్రేయసీ ప్రియుల్లగా వుండకూడదా?"

"ఉండొచ్చు... కానీ ఉండలేరు సిల్లీగా, పెళ్ళవ్వగానే మగాడికి నేను మొగుడ్ని అన్న అహంకారం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది!"

"నువ్వు అలా అహంకారంగా ఉండొద్దు. అయినా నువ్వు మంచోడివి.. నీకు అలాంటి అహంకారం రాదు."

"సిల్లీగా మాట్లాడకు. నేనూ మగాడినే. నాకు అహంకారం వస్తుంది. అయినా నువ్వు టాపిక్ ని మొత్తం ఎక్కడికో తిప్పి మళ్ళీ నేను బాధపడేలా చేస్తావ్. ప్రస్తుతానికి ఈ టాపిక్ ని ఇక్కడితో ఆపేద్దాం.' ఖాయంగా అన్నాడు బుచ్చిబాబు.

సీత గాఢంగా నిట్టూర్చింది.

"నేను ఆఫీసుకెళ్ళిన తరువాత నీకు బోర్ కొట్టలేదు కదా?' టాపిక్ మారుస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"ఉద్యోగం చేసే ఆడదాన్ని, ఇంట్లో వుంటే బోర్ కొట్టకుండా ఎలా వుంటుంది? కనీసం మనకి టీవి, రేడియో ఏమీ లేవు కదా?" అంది సీత.

"సారీ డియర్... ఒక రెండు రోజులల్లో నీకు అన్నీ అరేంజ్ చేస్తానుగా? డబుల్ కాట్ మాత్రం రేపే వచ్చేస్తుంది." సీత వంక చిలిపిగా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు.

సీత బుచ్చిబాబు బుగ్గమీద ఒక్క పోటు పొడిచింది.

ఇద్దరూ కాసేపు ఆ కబుర్లూ చెప్పుకున్నాక సీత ఆవిలించడం మొదలు పెట్టింది.

"ఏం... నిద్రొస్తుందా?' అడిగాడు బుచ్చిబాబు.

అవునన్నట్లు సీత తల ఊపింది.

"పద... పడుకుందాం" బుచ్చిబాబు లేచి బెడ్ రూమ్ వైపు అడుగులు వేశాడు.

సీత అతన్ని ఆనుసరించింది.

బుచ్చిబాబు మంచంమీద నడుం వాల్చి సీత వంక చూశాడు.