సిల్లీ ఫెలో - 62

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 62

- మల్లిక్

 

"ఏవండీ... నేను భరించలేకపోతున్నానండీ పాపం!" పెరుగన్నం కలుపుతూ అంది పార్వతమ్మ.

"ఏం. ఏ వెధవో చేసింది కాదుగా? నువ్వు చేసిన వంటేగా తింటున్నావ్?" అన్నాడు పర్వతాలరావు తను కూడా అన్నంలోకి పెరుగేస్కుంటూ.

"అబ్బ! నేనంటుంది అది కాదండి... మన బుచ్చిగాడిని చూడకుండా నేను ఉండలేకపోతున్నానండీ..."

"అయితే ఏమంటావ్ నీ వెధవ సోది?"

"మనము కూడా విజయవాడకి వెళ్ళిపోయి వాడితోనే ఉందామండీ"

పర్వతాలరావు ఓసారి పార్వతమ్మ వంక సీరియస్ గా చూసి గుబుక్, గుబుక్ మని పెరుగన్నం ముద్దలు నాలుగు మింగి "వీల్లేదు... మనం ఇక్కడే ఉంటాం. ఆవెధవూరు మనకొద్దు... కావాలంటే ఆ విధవాయే ఎప్పుడో మళ్ళీ ట్రాన్స్ ఫర్ చేయించుకుని ఇక్కడికి వస్తాడు" అన్నాడు.

పార్వతమ్మ కూడా పెరుగన్నం ముద్దలు నాలుగు గుటక్ గుటక్ మని మింగింది.

ఆ తర్వాత ఇలా అంది.

"కానీ వాడిని చూడకుండా ఎలాగండీ వుండేది పాపం?"

"ఆ వెధవ నా పోలికలతోనే ఉంటాడని అంటావ్ గా? నా మొహం చూస్తూ కూర్చో! ఆ వెధవ పచ్చడేదో ఇలా తగలెయ్" విసుగ్గా అన్నాడు పర్వతాలరావు.

పార్వతమ్మ అంతకంటే విసుగ్గా స్పూన్ తో గోంగూర పచ్చడి తీసి అతని కంచంలో కొట్టింది.

"ఈ వెధవ్వేషాలంటేనే నాకు మంట" పచ్చండి నాలిక్కి రాస్కుంటూ అన్నాడు పర్వతాలరావు.

"పోనీ మనమే విజయవాడకు వెళ్ళి ఓ నాలుగు రోజులుండి వస్తేనో?.... అడిగింది పార్వతమ్మ.

"వాడెళ్ళి రెండు రోజులైనా కాలేదు. అప్పుడే మనం విజయవాడ వెళ్ళడమెంతి నీ బొంద?"

"వాడిని చూస్తే తప్ప నాకు తిండి సహించేలా లేదండి పాపం"

"అవునవును.. చూస్తూనే ఉన్నాగా! ఇప్పుడేగా నువ్వు కంచం కూడు గుటుక్ గుటుక్ మని మింగావ్! ఇంకా విషయం గురించి నన్ను అడక్కు... నోర్మూస్కుని కూర్చో" విసుగ్గా చూస్తూ అన్నాడు పర్వతాలరావు.

పార్వతమ్మ మూతిని ముప్పై వంకర్లు తిప్పింది.


*          *         *

అక్కడ...

విజయవాడలో....

"అబ్బో... నేను సిల్లీగా ఏమో అనుకున్నాగానీ నీకు వంట బాగానే వచ్చే" కంచంలో చెయ్యి కడుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు సీతతో....

"అదేమైనా బ్రహ్మవిద్యా? కారం, ఉప్పూ సరిగా వేసి వేయించేస్తే చాలు! అయినా పాపం నువ్వు వంటలో బాగానే సాయం చేసావ్ కూరగాయలు తరిగిపెడ్తూ!" తనుకూడా కంచంలో చెయ్యి కడుక్కుంటూ నవ్వుతూ అంది.

"సాయం చెయ్యక! అదే నేను నీకు తాళి కట్టిన భర్త అయిహ్తే ఒసేవ్, ఏమేవ్ అంటూ సిల్లీగా నీకు ఆర్డర్లు జారీ చేయడమేగానీ సాయం, గీయం జాన్తానయ్..." నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఊ.. నీగోల నీదేకదా? నీగోడు పడలేకేకదా పెళ్ళిగిళ్ళి లేకుండా ఇప్పుడు ఇక్కడికి నీతో వచ్చి ఉన్నాను?" సీత ఎంగిలి కంచాలు ఎత్తి వంట గదిలోకి సింక్ దగ్గరకు వెళ్తూ అంది.

"సరేగానీ సగం గిన్నెలు తోమి నువ్వు ఇటొచ్చెయ్.. మిగతా సగం నేను తోమేస్తా".

"వద్దు మగాళ్ళు అంట్లు తోమితే బాగుండదు."

"ఇదిగో.... అలాగే మగాళ్ళని సిల్లీగా నెత్తిన ఎక్కుంచుకుంటారు మీ ఆడవాళ్ళు" అన్నాడు బుచ్చిబాబు అక్కడి నుండి లేచి హాల్లోకి వెళ్తూ.

పావుగంటలో అంట్లు తోమి వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది.

"ఇదిగో.." అంటూ చెయ్యి చాపాడు బుచ్చిబాబు.

"ఏంటది?" అడుగుతూ అతని ప్రక్కన కూర్చుంది సీత.

"కిళ్ళీ.. నేనే చుట్టాను" గొప్పగా చెప్పాడు బుచ్చిబాబు.

"నీకు?"

"ఇదిగో!" రెండో చేతిలోని మరో కిళ్ళీని చూపించాడు.

సీత బుచ్చిబాబు చేతిలోని కిళ్ళీని అందుకోబోయింది. అతను తన చేతిని వెనక్కి తీస్కున్నాడు.