సిల్లీ ఫెలో - 61

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 61

- మల్లిక్

 

"ఆఫీసా సార్! బాగుంది సార్... చాలా బాగుంది" అన్నాడు.

"అది మాకు తెలుసులే అప్పా! ఇప్పుడు ఏమి సమాచారం మీద వస్తివి?" అన్నాడు కళ్ళేగరవేస్తూ....

"అంటే మరేమో సార్... మా ఆఫీసు నుండి బుచ్చిబాబు అనే అతను విజయవాడకి ట్రాన్స్ ఫర్ అయ్యాడు సార్! అతన్ని మేము రిలీవ్ కూడా చేసేశాం సార్"

"బుచ్చిబాబు? రొంబ ఇన్ ప్లుయన్స్ దా ఇరికి! పై నుండి వాడు మొట్టికాయాల్ దా మాకు కొట్టించి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడే.. హా మురుగా!"

"అవునా సార్. వాడంతే సార్. కిల్లారికిత్తిగాడు. అందుకే వాడితో లేనిపోని గొడవలెందుకులే అని వెంటనే రిలీవ్ చేసేశాను సార్."

"మంచి పని చేస్తివి. లేదు నీకుదా మొట్టికాయల్ మొట్టిస్తుడు వాడు! సరి సరి. ఇప్పుడా పైత్తికారి గురించి మనము యోచన ఎందుకు సేయవలె.

నువ్వు వచ్చిన పని చెప్పుడు" అని అన్నాడు నటరాజన్.

"బుచ్చిబాబు రిలీవ్ అయిపోయాడు కద్సార్. అతని ప్లేస్ లో ఓ సబ్స్టిట్యూట్ ని పోస్ట్ చేయించమని అడగటానికి వచ్చాను సార్! లేకపోతే అతని సీట్లో పనంతా పెండింగ్ పడిపోతుంది సార్" 

ముందుగా తన ప్రాబ్లెం కాకుండా ఆఫీసులోని వేరే ప్రాబ్లెం గురించి మాట్లాడి తర్వాత తన విషయం గురించి మాట్లాడదామని అనుకున్నాడు ఏకాంబరం.

"ఇందామాదిరి సిన్న విషయం గురించి నా దగ్గరకు ఎవరైనా వస్తుడా?" ఏకాంబరం వంక ఆశ్చర్యంగా చూసాడు నటరాజన్.

"ఇది విషయం నువ్వుదా స్టావ్ డిపార్ట్ మెంట్ కి పోయి సెప్పు సామీ" అన్నాడు.

"వాళ్ళకి కూడా చెప్తాను సార్. కానీ ప్రస్తుతం నేను వేరే పని మీద వచ్చాను సార్. ఎలాగూ మీ దగ్గరకు వచ్చాను కదా అని బుచ్చిబాబు ప్లేస్ లో సబ్ స్టిట్యూట్ ని అడిగాను సార్" వినయంగా అన్నాడు ఏకాంబరం.

"సరి సరి... నువ్వుదా ఏమి పనిమీద వస్తివో చెప్పి పూడ్సుము."

"సార్! నేను ఇక్కడ చాలాకాలంగా పని చేస్తున్నాను సార్! అసలు మా సొంత ఊరు గుంటూరు సార్! నేను ఎప్పటి నుండో గుంటూరుకి ట్రాన్స్ ఫర్ అడుగుతున్నాను సార్. ఈ హైదరాబాద్ లో నీళ్ళు నాకు పడటంలేదు సార్. ఇక్కడి ట్రాఫిక్కు మత కలహాలు, కత్తిపోట్లు, పొల్యూషన్... ఏవీ నాకు పడటం ఏడు సార్" గుక్క తిప్పకోకుండా గబగబా అన్నాడు ఏకాంబరం.

"ఎన్న సామీ? నువ్వు రొంబ సిత్రంగా సెప్తువే? అవి మాకు పడునా? మేముదా కాలక్షేపము సేస్తుము... నీకుదా ట్రాన్స్ ఫర్ కావాలి?" మొహం చిట్లిస్తూ అన్నాడు నటరాజన్.

"సార్... సార్.. అలా అనకండి సార్. మీరు నా మీద దయ ఉంచాలి సార్."

"?నా దయ కాదప్పా! అందరికీ మురుగా దయ కావాలి! నాకు మద్రాసు ట్రాన్స్ ఫర్ కావాలి. నాకు ట్రాన్స్ ఫర్ ఎవడు సేస్తుడు? పోప్పా!

"సార్... సార్... మీరే కాదంటే ఎలా సార్? మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సార్" బ్రతిమలాడ్తూ అన్నాడు ఏకాంబరం.

"అరే ... పోప్పా! వీలుకాదని సెప్తావుంటే ఎందప్పా ఈ గలాటా? సిలిబిలి బిళ్ళీ... సుణక్కి బిక్కి.... పొణ్ణాచ్చి కండ్రి" అన్నాడు నటరాజన్ ఏకాంబరం వంక సీరియస్ గా చూస్తూ.

"అంటే ఏంటి సార్" బిత్తరపోయి చూస్తూ అడిగాడు ఏకాంబరం.

"నువ్వుదా కిల్లరికిత్తి. టింగాలటిస్కు మాదిరి సిత్రమైన తిట్లు తిడ్తువని వింటిని. నీకు మాదిరిగానే నాన్ దా సిత్రమైన తిట్లు తమిళములో తిడ్తును" గర్వంగా అన్నాడు నటరాజన్.

"ఆ!" నోరు తెరిచాడు ఏకాంబరం.


*            *          *