సిల్లీ ఫెలో - 58

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 58

- మల్లిక్

 

బుచ్చిబాబు ఆ రోజే ఆఫీసులో జాయిన్ అయ్యాడు. మోహన్ బుచ్చిబాబుని అందరికీ పరిచయం చేశాడు.

ఆఖరుగా మేనేజర్ మంగారావ్ క్యాబిన్ లోకి తీస్కెళ్లాడు మోహన్.

"ఎవరు! కస్టమరా?" బుచ్చిబాబు వంక చిరాగ్గా చూస్తూ మోహన్ ని అడిగాడు మంగారావ్.

"కాదు సార్! మన ఆఫీస్ కి హైదరాబాద్ నుండి ఆర్డర్ పడింది కద్సార్... బుచ్చిబాబని. అతను సార్.. ఈవేళ జాయిన్ అయ్యాడు..." చెప్పాడు మోహన్.

"ఓ... బుచ్చిబాబు! వెల్ కం - వెల్ కం! రా కూర్చో"

"థాంక్యూ సార్!" అంటూ మేనేజర్ మంగారావ్ ముందు కూర్చున్నాడు బుచ్చిబాబు.

"హత్తెరి! కూర్చోమనగానే కూర్చిండిపోయవే? నువ్వేమయినా కష్టమర్ వా కూర్చోవడానికి?" సీరియస్ గా చూస్తూ ప్రశ్నించాడు మంగారావు.

"మీరేకద్సార్ కూర్చోమన్నారు?" బిక్కమొహం వేస్కుని నిలబడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఓహో! అలాగా!" బుర్రకాయ్ ఊపి మోహన్ తో "నువ్వు కూర్చోవోయ్" అన్నాడు మంగారావు.

"పర్లేదు సార్" అన్నాడు మోహన్ నిలబడే.

"చూసావా? అలా అనాలి. అంతేగానీ బాస్ మాటవరసకి కూర్చోమని అనగానే టింగురంగా అని కూర్చోకూడదు.

"అలాగే సార్!" అన్నాడు బుచ్చిబాబు వినయంగా.

"అలాగే అని గంగిరెద్దులా బుర్ర ఊపగానే సరిపోదు.... నాకేంటి లాభం?" కళ్ళు ఎగరేస్తూ అడిగాడు మేనేజర్ మంగారావు.

"మీకు లాభమా?" బుర్రగోక్కుంటూ అయోమయంగా అన్నాడు బుచ్చిబాబు.

"సార్... ఇతను కష్టమర్ కాద్సార్!" అన్నాడు మోహన్.

"హ త్తెరికి - అవును కదూ? సరే ఇతన్ని అసిస్టెంట్ మేనేజర్ దగ్గరకి తీస్కెళ్ళు"

"అలాగే సార్ అన్నాడు మోహన్.

"ప్రస్తుతానికి నువ్వు అసిస్టెంట్ మేనేజర్ ఏ పని చెపితే అది చెయ్యవోయ్"  బుచ్చిబాబుతో అన్నాడు మంగారావు.

"అలాగే సార్" బుర్రకాయ్ ఊపాడు బుచ్చిబాబు.

"హ త్తెరి! నువ్వు బుర్రకాయ్ భలేగా ఊపుతావోయ్! ఊ... ఊ.. ఇంకవెళ్ళి మీ పనులు చూస్కోండి."

"ఇద్దరూ క్యాబిన్ లోంచి బయటికి వస్తుండగా వెనుకనుండి మేనేజర్ మంగారావు "హ త్తెరికి. కస్టమర్ అనుకున్నా" అనడం బుచ్చిబాబుకి వినిపించింది.

"మాట్లాడితే కస్టమర్ అంటాడేం సిల్లీగా? ఏంటసలు?" మోహన్ ని అడిగాడు బుచ్చిబాబు.

"అదా? మన బాస్ బాగా లంచాలు గుంజే మనిషిలే. మన ఆఫీసుకి ఏదయినా పనిమీద వచ్చి అతనికి లంచాలు ఇచ్చేవాడు అతని దృష్టిలో కస్టమర్ అన్నమాట!" చెప్పాడు మోహన్.

"ఈ హత్తెరిగాడు ఒట్టి సిల్లీ ఫెలోలా వున్నాడే!" అన్నాడు బుచ్చిబాబు బుగ్గలు నొక్కుకుంటూ.

సాయంత్రం అయ్యింది.

బుచ్చిబాబు టేబుల్ మీది ఫైల్స్ సర్ది ఇంటికెళ్ళాడానికి లేచాడు.