సిల్లీ ఫెలో - 57

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 57

- మల్లిక్

 

ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్ ట్రింగ్

డోర్ బెల్ మోగసాగింది.

"అబ్బా! ఎవరయ్యా బాబూ పొద్దునే సిల్లీగా బెల్ మోగిస్తున్నారు? అమ్మా కాస్త తలుపు తీసి చూడవే" విసుక్కుంటూ అని దుప్పటి మొహం మీదకి లాక్కున్నాడు బుచ్చిబాబు.

వెంటనే కిలకిలా సీత నవ్వు వినిపించింది.

ఆ నవ్వు విన్న బుచ్చిబాబు మత్తు సగం వదిలింది. మొహం మీది నుండి దుప్పటి తీసి క్రిందకి వంగి చూసాడు.

నేలమీద చాపమీద పడుకుని వున్న సీత నవ్వుతూ లేచి కూర్చుంది.

"ఏం? ఇంకా మీ ఊరు వదిలి రాలేదా? మనం ఇప్పుడు విజయవాడలో వున్నాం సిల్లీగా" వెక్కిరింపుగా అని క్రింది నుండి లేచి బయటికి వెళ్ళి వీధి తలుపులు గడియ తీసింది సీత.

బయట పాలవాడు వున్నాడు.

"బుచ్చిబాబుగారేనా?" అడిగాడు వాడు.

"కాదు... నా పేరు సేత!" చెప్పింది సీత.

పాలవాడు సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ నవ్వాడు.

"అదేనమ్మా... ఇది బుచ్చిబాబు గారిల్లే కదా అని అడిగాను. మోహన్ బాబుగారు ఈయాల్టి నుండి మీకు పాలు ఇమ్మన్నారు.

"ఓ... ఆయన పంపారా? ఉండు ఉండు."

"సీత లోపలకెళ్ళి వంట గదిలోంచి ఓ గిన్నె పట్టుకొచ్చింది.

"ఎంత ఇమ్మంటారమ్మా?" అడిగాడు వాడు.

"లీటర్" చెప్పింది.

"లీటర్ పాలమ్మా? పిల్లలు లేరామ్మా?" అడిగాడు వాడు.

"లేరు"

"ఓ. అయితే కొత్తగా పెళ్ళయిందన్నమాట!"

వీడెవడో అధిక ప్రసంగిలా ఉన్నాడనుకుంది సీత. "త్వరగా పాలు పొయ్యి" అంది.

"అట్టాగేనమ్మ!"

సీత చేతిలోని గిన్నె అందుకుని బక్కెట్ లోని పాలు కొలిచి అందులో పోసి గిన్నెని సీత కందించి వెళ్ళిపోయాడు పాలవాడు.

పాపం! ఆ మోహన్ ఎంత మంచివాడిలా వున్నాడు. అన్నీ బాగా పట్టించుకున్నాడు. వంటకి కావాల్సిన గిన్నెలూ, స్టవ్ అన్నీ ఇచ్చాడు. ఆఖరికి మంచం కూడా ఇచ్చాడు. అన్నీ వెంటనే కొనుక్కుని ఆయన సామానులు ఆయనకి పంపించెయ్యాలి. వంట గదిలోకి వెళుతూ అనుకుంది సీత.

సీత బెడ్ రూంలోకి వెళ్ళేటప్పటికి బుచ్చిబాబు లేచి కూర్చున్నాడు.

"ఎవరొచ్చారు?" బద్ధకంగా అడిగాడు.

"పాలవాడు!" అతనికి సమాధానం చెప్పి నేలమీది చాప, దిండు తీసి చాపని చుట్టి గోడమూలకి జార్చి దిండు మంచం మీద పెట్టింది సీత.

"పాపం అతను చాలా మంచివాడులా వున్నాడు."

"ఊ! నా ఫ్రెండంటే మరేం అనుకున్నావ్?" గర్వంగా అన్నాడు బుచ్చిబాబు.

తర్వాత ఇద్దరూ పేస్టుతో పళ్ళు తోముకున్నారు.

"కాఫీ ఇస్తావా సీతా?" ఆనాడు బుచ్చిబాబు హాల్లో కుర్చీలో కూర్చుంటూ.

"ఎక్కడి నుండి ఇవ్వను? మనింట్లో కాఫీపొడి ఉందా? టీ పొడి వుందా? మీ ఫ్రెండు ని గిన్నెలు స్టవ్ ఇచ్చింది చాలక సరుకులు కూడా తెచ్చిమ్మంటారా?" అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంటూ అంది సీత.

ఆ కుర్చీలు కూడా మోహన్ ఇచ్చినవే.

"మరయితే ఇప్పుడెలా? కాఫీ లేకుండా నేనుండలేనే?" తెల్లమొహం వేసాడు బుచ్చిబాబు.

"కాఫీ లేకుండా ఎవరుండమన్నారు? వెంటనే షాప్ కెళ్ళి కాఫీపొడి, చక్కెర తీసుకురా...కాఫీ పెట్టిస్తా."

"పోనీ హోటల్ కు వెళ్ళి తాగేస్తేనో?"

"అలాగే... రోజూ రెండు పూటలా భోజనం కూడా హోటల్లోనే చేసేద్దాం.  అప్పుడు గానీ నువ్వు అప్పులపాలు కావు. లేలే!" అంది సీత.

బుచ్చిబాబు బయటకెళ్ళి చక్కెరా, కాఫీపొడి తీసుకొచ్చాడు.

సీత వంటగదిలో కాఫీ కలుపుతుంటే బుచ్చిబాబు గుమ్మానికి ఆనుకుని నిల్చున్నాడు.

"కాఫీతాగి, స్నానం చేసి ఏ సూపర్ బజార్ కొ వెళ్ళి పప్పులూ, బియ్యం వగైరా సామాన్లూ, కూరగాయలు అన్ని తీసుకురా!" అంది సీత.

"అవన్నీ ఇప్పుడెందుకు సిల్లీగా" తెల్లమొహం వేస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"ఎందుకా? సిల్లీగా ఫుడ్డు వండుకుని తినడానికి!"

ప్రస్తుతానికి అంత కంగారేంలేదు లెండి. ఆ పని సాయంత్రం చూస్కోవచ్చు."

అది మోహన్ గొంతు.

ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు.

"రాగానే మీకు కష్టం అవుతుందని ఈ రోజుకి మీకు భోజనం ఏర్పాట్లు చేసెయ్యమని మా ఆవిడతో చెప్పాను. ఇద్దరికీ కాస్సేపయ్యాక క్యారియర్ పంపిస్తాను" అన్నాడు మోహన్ బుచ్చిబాబుతో.

"ఎందుకండీ మీకు అంత శ్రమ?" అంది సీత మొహమాటంగా.

"ఇందులో శ్రమేం వుందండీ... స్నేహితులకోసం ఆమాత్రం చెయ్యకపోతే ఎలా?" అన్నాడు మోహన్ సీతతో. బుచ్చిబాబు వంక తిరిగి "నేనిక వస్తానోయ్. ఈ విషయం చెప్పడానికే వచ్చా... నువ్వు ఆఫీసులో ఈవేళ జాయిన్ అవుతున్నావ్ కదూ?" అన్నాడు.

"అవును!" అన్నాడు బుచ్చిబాబు.

మీరు వుండండి మోహన్ గారూ... కాఫీ తాగేసి వెళ్దురు గాని, అంది సీత.

కాఫీ తాగుతున్నప్పుడు మోహన్ బుచ్చిబాబుని అడిగాడు "అదేంట్రా నువ్వు పెళ్ళి చేసుకున్నట్టు నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదు?" 

బుచ్చిబాబుకి పొరబోయి దగ్గొచ్చేసింది.

"ఇన్విటేషన్ పంపలేదు సరే... కనీసం పెళ్ళి చేస్కున్నట్టు ఓ కార్డు ముక్క రాస్తే సంతోషించి వుండేవాడిని కదా."

సీత బుచ్చిబాబువంక చూసింది. ఏం సమాధానం చెప్తాడోనని.

అతను ఏమీ అన్లేదు. ఒక వెర్రి నవ్వు నవ్వి కాఫీని సర్రుసర్రుమని జుర్రడంలో మునిగిపోయాడు.


*           *           *