సిల్లీ ఫెలో - 35

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 35

- మల్లిక్

 

సాయంత్రం ...

ఆరుగంటలు కావస్తోంది. బుచ్చిబాబు, సీత ట్యాంక్ బండ్ మీద సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు.

"ఆ మినిస్టర్ మిన్నారావ్ చూసావా? మనిషిని చూస్తే అలా అనిపించదు. ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకున్నాడో?" అన్నాడు బుచ్చిబాబు.

సీత బుచ్చిబాబు వంక విసుగ్గా చూసింది.

"ఇంక ఆ సోది ఆపుతావా? వచ్చిన దగ్గర్నుండి ఆ విషయాన్నే చెప్తున్నావ్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది తియ్యని కబుర్లు చెప్పడానికా? హత్యలూ, రేపులూ గురించి చెప్పడనికా?"

"ఆ వార్త చదవగానే నాకు చాలా బాధ అనిపించింది సీతా. అతను ఎఅరో. ఎక్కడుంటాడో తెలుసుకుంటే మిన్నారావ్ మిమ్మల్ని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని అతని దగ్గరకెల్లి వార్న్ చేసి వుండేవాడిని" బాధగా అన్నాడు.

"నిజమే. నీకలా అనిపించి బాధకలగడం సహాజమెకానీ జరగాల్సింది జరిపోపోయింది. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు కదా?"

"ఎందుకు చేయలేను? నాకు తెల్సిన నిజాన్ని పోలీసులకు చెప్పి ఆ మినిస్టర్ మిన్నారావ్ ని అరెస్టు చేయిస్తా" ఆవేశంగా అన్నాడు బుచ్చిబాబు.

"అప్పుడు ఆ మిన్నారావ్ మనుషులు నిన్ను కూడా నడిరోడ్లో కత్తులతో కసాకసా పొడిచి చంపుతారు. నేను జీవితాంతం ఏడుస్తూ కూర్చువాలి!" సీరియస్ గా అంది సీత.

బుచ్చిబాబు తెల్లబోయి ఆమె వంక చూసాడు.

"నువ్వు చాలా అమాయకుడివి బుచ్చీ. రాజకీయ నాయకులకీ, మినిస్టర్ లకి పోలీసుల అండదండలు వుంటాయి కాబట్టే వాళ్ళు ఎన్నో రకాల అకృత్యాలు చేస్తుంటారు. నువ్వు నిజం చెప్పాలని పోలీస్ స్టేషన్ కి వెళ్ళావనుకో, అసలు ఆ హత్య చేసింది నువ్వేనని పోలీసులు నిన్ను అరెస్టు చేసి లోపలేస్తారు."

"అంతేనంటావా?" నిరుత్సాహంగా అన్నాడు బుచ్చిబాబు.

"ముమ్మాటికీ అంతే.. ఇప్పుడు ఏవైనా చక్కటి కబుర్లు చెప్పు"

"ఏం చెప్పాలబ్బా!" ఆలోచనగా మొహం పెట్టాడు బుచ్చిబాబు.

"అంతేలే.. నీకు చక్కటి కబుర్లు ఎందుకు తడ్తాయ్... హత్యల గురించీ, శవాల గురించీ తడ్తాయిగానీ" బుంగమూతి పెట్టింది సీత.

"మరీ అంత సిల్లీగా మాట్లాడకు."

"పోనీ ఈ విషయం అయినా చెప్పు ... మీ ఫ్రెండ్ సుందర్ నా గురించి ఏమన్నాడు? నేను నచ్చానా?"

"ఓ... చాలా బాగా నచ్చావ్"

"నచ్చక! పూర్వజన్మలో ఏదో పుణ్యం చేస్కున్నావ్ కాబట్టే నీకు నేను దొరికాను" గర్వంగా అంది బుచ్చిబాబుతో.

"బుచ్చిబాబు చిరునవ్వు నవ్వాడు.

"నన్ను పెళ్ళి చేసుకోవడం నీ జీవితంలో గొప్ప అదృష్టం అన్నాడా?"

"ఊహు.. అలా అనలేదు. అసలు పెళ్ళి చేస్కోవద్దు అన్నాడు"

"మరి? ఉంచుకోమన్నాడా?"

"హిహి..." ఇబ్బందిగా కదుల్తూ నవ్వాడు బుచ్చిబాబు.

"అసలు మీ ఫ్రెండ్ ని చూడగానే నాకు నవ్వాగలేదనుకో... ఆ పోనీటెయిల్ ఆ వాలకం... కానీ అతను మూతి ముందుకు పెట్టి నా వైపు వస్తుంటే భయపడి చచ్చాననుకో, ఎక్కడా గతిగా పట్టేస్కుని ముద్దెట్టేస్కుంటాడోనని" నవ్వింది సీత.

"చాల్లే.. సిల్లీగా మాట్లాడకు. నేను అక్కడ వుండగానే అలాంటి ఘోరం జరగనిస్తానా? వాడి పోనీటెయిల్ కత్తిరించి పారెయ్యనూ?" ఉడుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"సరేగాని మన పెళ్ళికి మీ సుందర్ వస్తున్నాడా?" అడిగింది సీత.

బుచ్చిబాబు సమాధానం చెప్పలేదు.

"ఏం? రావడానికి కుదరదన్నాడా?" సీతే అడిగింది మళ్ళీ.

"ఏమో మరి..." నసుగుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఆహా! అదన్నమాట మీ స్నేహం! అన్నట్టు పెళ్ళి దగ్గర పడుతోంది. వెడ్డింగ్ కార్డులు ప్రెస్సువాడు ఇంకా ఇవ్వలేదా? ఇంత ఆలస్యం చేస్తే కార్డులు ఎప్పుడు పంచుతాం! పద ఇప్పుడే ప్రెస్సుకెళ్ళి అడుగుదాం.. ఎప్పుడిస్తాడో".

"అక్కర్లేదు... ప్రెస్సువాడు కార్డులు ప్రింట్ చేసి ఇచ్చేసాడు"

సీత సంతోషంగా అరిచింది.

"ఏంటీ... ఆ విషయాన్ని ఇంత మెల్లగా చెపుతున్నావా? కార్డులు ఇంట్లో పెట్టి వచ్చావా?"

"కాదు... ఇందులో వున్నాయ్" చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ని చూపిసూ అన్నాడు బుచ్చిబాబు.

"ఆహా.. ఎంత చల్లగా, మెల్లగా చెప్తున్నావ్ నా తండ్రీ... ఏదీ?"
 
సీత ఆనందంగా బుచ్చిబాబు చేతిలోంచి హ్యాండ్ బ్యాగ్ లాక్కుని జిప్ లాగి తెరిచి దాంట్లో వున్నా శుభలేఖల్లోంచి ఒకటి తీసి చూసింది.