సిల్లీ ఫెలో - 34

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 34

- మల్లిక్

 

మర్నాడు....

సాయంత్రం రైల్వేస్టేషన్ లో

సుందర్ రైల్లో కిటికీ దగ్గర కూర్చుని వున్నాడు. బుచ్చిబాబు ఫ్లాట్ ఫారం మీద నిలబడి వున్నాడు.

"నేను మా షొంట ఊరికెళ్ళి తిరిగి అమెరికా వెళ్ళునప్పుడు మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి రెండు రోజులు నీతో గడిపి పోయెదను" అన్నాడు సుందర్.

"అయితే నా పెళ్ళికి రావా?" ఆశ్చర్యంగా చూతూ అడిగాడు బుచ్చిబాబు.

అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోతూ సుందర్ బుచ్చిబాబుని చూశాడు.

"ఏమిటీ? పెండ్లిమాట నువ్వు ఇంకనూ మానలేదా?"

బుచ్చిబాబు బుర్రగోక్కున్నాడు.

"ఏంటో నా మతి పోగొడ్తున్నావ్"

"నీ యొక్క కర్మ కాలినచో పెండ్లి చేసుకొనుము. శుభలేఖ పంపిన ఆలోచించెదను. అవునుగానీ టైము అయినను ట్రయిను ఏల కదలదు? అమెరికాలో ఇటుల చేసిన షూట్ చేయుదురు"

అలా అంటుండగానే గ్రీన్ సిగ్నల్ పడింది. గార్డు పచ్చ జండా ఊపాడు. రైలు కూత పెట్టి ముందుకు కదిలింది. దూరమవుతున్న రైల్లోంచి సుందర్ చెయ్యి పెట్టి ఊపుతూ "షీటను ప్రేమింషుము... పెండ్లిషేసుకొనకము.. ...అని అరిచాడు.

ఆ రాత్రి బుచ్చిబాబుకి నిద్రపట్టలేదు.


*             *           *

ఉదయం కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు బుచ్చిబాబు.

ఫ్రంట్ పేజీలో మెయిన్ న్యూస్ మొత్తం చదివాక పేజీ తిప్ప్పాడు. రెండో పేజీలో ఎడిటోరియల్ చదివాడు. మూడో పేజీలో అన్నీ చావు వార్తలు లారీ గుద్ది వృద్ధుడు మరణం, ఫ్యానుకి ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య, కట్నం లేలేదని యువతిని కిరోసిన్ పోసి తగలెట్టిన అత్తా మామలు.. అన్నీ ఇలాంటి వార్తలే!

ఛీఛీ... ఏం న్యూస్ పేపరో, ఏం వార్తలో... అనుకుతూ పేపర్ తిప్పబోయిన బుచ్చిబాబు ఠక్కున ఆగిపోయాడు పేపర్లోని ఆ ఫోటో దగ్గర. "పట్టపగలు నడిరోడ్డు మీద కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య" అన్న హెడ్డింగ్ తో వార్త వుంది. బుచ్చిబాబు గబగబా ఆ వార్తని చదివాడు.

స్థానిక రాజకీయ నాయకుడు రాజేంద్రని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నగరం నడిబొడ్డున అబిడ్స్ సెంటర్ లో కత్తులతో పొడిచి చంపారు. అతన్ని హత్య చేయడానికి కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేస్కుని హంతకులకై గాలిస్తున్నారు."

వార్త చదివిన బుచ్చిబాబు ఆ ఫోటో వంక పరిశీలనగా చూశాడు.

ఆ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది బుచ్చిబాబుకి. అందుకే పేజీ తిప్పబోయి ఆగి ఆ వార్తని  అలా గబగబా చదివాడు.

ఎక్కడ?... ఎక్కడ చూశాడు ఆ వ్యక్తిని??

తీవ్రంగా ఆలోచిస్తున్న బుచ్చిబాబుకి తట్టింది ఆ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడ చూసాడో. నిజానికి ఆ ఫోటోలోని వ్యక్తిని డైరెక్టుగా చూళ్ళేదు. బుచ్చిబాబు. ఆ వ్యక్తి ఫోటోలోని తమకి ఇచ్చి అతన్ని చంపితే లక్ష రూపాయలిస్తానని అన్నాడు మినిస్టర్ మిన్నారావ్.

అయితే రాజేంద్రని చంపింది మినిస్టర్ మిన్నారావ్ మనుషులేనా?

అంతే అయివుంటుంది. వాడేగా రాజేంద్రని చంపడానికి ప్లాన్ చేసింది?

హమ్మో!... మిన్నారావ్ యమడేంజర్ మనిషన్నమాట!!

బుచ్చిబాబు గుండెలమీద చేతులు వేస్కున్నాడు.

*      *         *