సిల్లీ ఫెలో - 33

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 33

- మల్లిక్

 

బుచ్చిబాబు ఇల్లు. సమయం సాయంత్రం ఆరుగంటలైంది.

సుందరం గోడ గడియారము వంక అసహనముగా చూస్తాడు.

"ఏది? నీది కాబోయే పెండలము ఇంకను రాలేదా?... హె!" భుజాలు ఎగరేశాడు.

"వస్తుందిలే.. అంత కంగారైతే ఎలా?" అతని ప్రక్కనే కూర్చుని వున్నా బుచ్చిబాబు సమాధానము చెప్పాడు.

అక్కడే హాల్లో కాస్త దూరముగా వేరే సోఫాలో పర్వతాలరావు, పార్వతమ్మ కూర్చిని టీవీలో కార్యక్రమాన్ని చూస్తున్నారు.  

"ఇదే మా అమెరికాలో అయితే షెప్పిన టైముకి రాకపోయినచో షూట్ చేయుదురు యూనో?" అన్నాడు సుందరము.


"ఇంతకీ నువ్వు అమెరికాలో ఎంతమంది వెధవల్ని షూట్ చేసావ్ నాయనా?" ఉండబట్టలేక అడిగాడు పర్వతాలరావు.

"అయినా జనాల్ని అలా ఇష్టము వచ్చినటు షూట్ చేసి చంపేస్తుంటే జైల్లో పెట్టరండీ పాపం?" అమాయకంగా అడిగింది పార్వతమ్మ.

"అచటి జనాలు షూట్ చేయు అవకాశము ఇవ్వరు.. ఎవ్రీథింగ్ విల్ బి ఫర్ ఫెక్ట్! హె!" భుజాలెగరేశాడు సుందరము.

ఇంతలో డోర్ బెల్ మోగింది. బుచ్చిబాబు ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచాడు.

"సీత వచ్చినట్టు వుంది" అంటూ వీధి తలుపుళ దగ్గరికి పెద్ద పెద్ద అంగలేస్కుంటూ నడిచాడు.

సుందరంకి తన సీతని చూపించి పరిచయం చేయాలని ఆమెని ఆఫీసునుండి డైరెక్టుగా ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు బుచ్చిబాబు.

వీధి తలుపులు గడియ తీశాడు. ఎదురుగా సీత!

"ఆలస్యం అయిందా?" అడిగింది సీత.

"లేదులే.. పద. నిన్ను చూడాలని నా ఫ్రెండ్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు" అన్నాడు బుచ్చిబాబు సీత భుజం మీద చెయ్యి వేస్తూ.

ఇద్దరూ హాల్లోకి వచ్చారు.

"సీతా... ఇదిగో వీడో నా క్లోజ్ ఫ్రెండ్ సుందర్.. సుందర్! ఈమె సీత" పరిచయం చేసాడు బుచ్చిబాబు.

సీత సుందర్ కి నమస్కారం చేసింది.

సుందర్ నమస్కారం పెట్టలేదు కానీ సోఫాలోంచి గబుక్కున లేచి మూతి ముందుకు పెట్టి సీతవైపు అడుగులు వేశాడు.

అతని ఉద్దేశ్యం గమనించిన బుచ్చిబాబు కంగారు పడిపోయాడు. సీత భయంగా రెండడుగులు వెనక్కి వేసింది.

"బాబూ! నీ ఫ్రెండు మన వంశ గౌరవము, మానమర్యాదలు మంటగలిపేలా ఉన్నాడు బాబూ" అరుస్తూ అంది పార్వతమ్మ.

"వెధవ స్నేహితుడు, వెధవ సాంప్రదాయాలు" నొసలుమీద బాధగా కొట్టుకున్నాడు పర్వతాలరావు.

బుచ్చిబాబు గుండెలు బాదుకుంటూ సీత, సుందర్ ళ మధ్యకి ఒక్క గెంతు గెంతి నిల్చున్నాడు.

"ఒరేయ్.. సుందర్! ఏంట్రా.. ఇది సిల్లీగా... అన్నాడు.

"స్నేహితుల బుగ్గపై ముద్దు పెట్టుట మా ఆషారము" అన్నాడు సుందర్.

"నీ ఆచారం మండా... తను నాక్కాబోయే పెళ్ళాంరా.. ఇక్కడ అలాంటి ఆచారాలు పనికిరావు."

"నీ ఫ్రెండుకి నన్ను చూపించావ్ కదా. నేనింక వెళ్ళనా బుచ్చిబాబూ?" సుందర్ ని భయం భయంగా చూస్తూ అడిగింది సీత.

"చూసావా.. నీ ప్రవర్తనతో సీత ఎంత ఠారెత్తిపోయిందో?" అన్నాడు బుచ్చిబాబు సుందర్ తో.

"సారీ బుష్షీ! అచట అమెరికాలో స్నేహిటులకు ముద్దులు పెట్టి పెట్టీ అలవాటు అయినది. నువ్వు భయపడకు సిస్టర్..... నేను ఇచట సంప్రదాయముల ప్రకారం నడుషుకొందును" అన్నాడు సుందర్.

"రక్షించావ్ సరేగానీ సీత ఎలా ఉంది?"


"షీట?"

"అదే షీట! షానా బాగుంది. వెరీనైస్ సెలక్షన్" అన్నాడు సుందర్.

వీళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. పార్వతమ్మ సీతని భోజనానికి ఉంచేసింది.

భోజనం తర్వాత సీత అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.

రాత్రి పన్నెండు దాకా సుందర్ పెళ్ళి గురించి వ్యతిరేకంగా మాట్లాడి బుచ్చిబాబు బుర్ర తినేసాడు.

"షీట షాలా షక్కని పిల్ల! మీ మధ్య షాలా లవ్ కలదు. కానీ మీరు మ్యారేజ్ షేస్కుని మీద లవ్ షంపేస్కుంటున్నారు. మొగుడూ పెండలాలుగా మారిపోయి ఎల్లప్పుడూ దెబ్బలాడుకొనవలెనని నిర్ణయం తీసుకున్నారు. హంత షక్కటి పిల్లతో ఎప్పుడూ దెబ్బలాడుకొనుట నీ కిష్టమా?" అడిగాడు సుందర్.

"అయితే పెళ్ళి చేసుకోకుండా సీతకి దూరంగా వుండాలాంటావా?" అడిగాడు బుచ్చిబాబు.

"నేను అటుల షెప్పలేదే! మీరిద్దరూ కలసి వుండుడు."

"పెళ్ళి చేసుకోకుండా అదెలా కుదుర్తుందిరా బాబూ"

"కుదురును! అమెరికాలో ఇది షాలా మామూలు విషయం యూనో?"

"కానీ ఇండియాలో అలా కుదరదు."

"ఇండియాలో ఇదివరకు మొగుడు పోయినయెడల మరల పెండ్లి షేసుకోనిరా? లేదు. మరి ఇప్పుడు? ఇండియాలో ఇదివరకు నచ్చిన అమ్మాయిని ఎచటైకైనా తీష్కునిపోయి పెండ్లి షేష్కుని యెడల లేసిపోయినవారు అనెడివారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఇండియాలో ఇదివరకు స్త్రీ అంటే గుమ్మం దాటి వెళ్ళునది కాదు. కానీ ఇప్పుడు? మగవాడితో షమానంగా ఉద్యోగం షేయుషున్నది. ఏదైనా కొత్త విషయము మొదలుచేయువారు విమర్శలకు గురి కాబడుదురు. ఒక మంషి పనిని నువ్వు మొదలుబెట్టుము. సమాజము కొరకు నీ ప్రేమను షంపుకొనకుము".

"ఆ! బాధగా జుట్టు పీక్కున్నాడు బుచ్చిబాబు.


*          *               *