Rating:             Avg Rating:       381 Ratings (Avg 2.99)

సిల్లీ ఫెలో - 7

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 7

- మల్లిక్

 

పిచ్చుక వరలక్ష్మి దబ్బున సోఫాలో కూలబడింది. ఆ దెబ్బకి సోఫా స్ప్రింగులు కీచు కీచు మని శబ్దం చేసాయ్.

"మీరు టిఫిన్లు కానియ్యండి బావగారూ!" అన్నాడు పిచ్చిక సుబ్బారావు.

అందరూ స్వీటూ, హాటులమీద పడ్డారు. బుచ్చిబాబు వంచిన తల ఎత్తకుండా సీరియస్ గా తినడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం చూసిన పర్వతాలరావుకి మండింది.

"నిన్ను ఒట్టి తిండిపోతు వేదవనుకుంటారు. లపక్ - లపక్ మని మింగటం మాని కాస్త ఆ పిల్లదాని వంక కూడా చూడు..." బుచ్చిబాబు చెవిలో గుసగుసలాడ్తూ విసుకున్నాడు పర్వతాలరావు.

"ఇంకా చూడ్డానికి అక్కడ ఏం మిగులుంది గనుక!... ఇందాక గుమ్మంలోనే చూడొద్దని అనుకున్నా కొట్టొచ్చినట్టు మొత్తం కనిపిస్తేను!...." బుచ్చిబాబు కూడా పర్వతాలరావు చెవిలో గుసగుసా అన్నాడు.

"సరేసరే... మరీ అంత సీరియస్ గ ఆముదం త్రాగిన మొహం పెట్టకు... కాస్త నవ్వు!"

బుచ్చిబాబు నవ్వాడు.

"మరీ అంతగా నవ్వకు... జులాయ్ వెధవనుకుంటారు...." బుచ్చిబాబు విసుక్కుంటూ మళ్ళీ స్వీట్సు మీద పడ్డాడు.

టిఫిన్ కార్యక్రమం పూర్తయ్యింది. కాఫీలు కూడా సవరించుకుని పిచ్చిక వరలక్ష్మిని అడిగింది.

అంతా అయ్యాక పార్వతమ్మ గొంతు సవరించుకుని పిచ్చిక వరలక్ష్మిని అడిగింది.

"చూడమ్మా... నువ్వు ఎందాకా చదువుకున్నావ్?"

"బి.కాం. ఫైనల్ దాకా చదివి ఆపేశానండీ!" సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది పిచ్చుక వరలక్ష్మి.

అదేం? డిగ్రీ ఎందుకు పూర్తి చెయ్యలేదూ?"

"చదవాలంటే బోర్ ఆంటీ..." దీర్ఘాలు తీసింది పిచ్చుక వరలక్ష్మి.

వాళ్ళు ముగ్గురూ మొహమొహాలు చూస్కున్నారు.

మరి ఇంట్లో వుంటే బోర్ కదమ్మా?" రెండు క్షణాలాగి ప్రశ్నించాడు పర్వతాలరావు.

"బోర్ ఎందుకంకుల్?... ఇంట్లో టీవీలో అన్ని ఛానెల్స్ లోనూ సినిమాలు చూస్తుంటానంకుల్... అదీ బోర్ కొడ్తే ఏదో ఒకటి తింటూ కూర్చుంటానంకుల్ ..." గారాలుపోతూ అంది పిచ్చిక వరలక్ష్మి.

వాళ్ళు ముగ్గురూ మొహమొహాలు చూస్కున్నారు.

"మీరు మా అమ్మాయ్ అన్న ప్రతిమాటకీ మొహమొహాలు చూస్కుంటే నాకు టెన్షన్ పెరుగుతుంది బావగారూ... అన్నాడు పిచ్చుక సుబ్బారావ్.

"నీకు పాటలు పాడ్డం వచ్చా అమ్మాయ్...." అడిగింది పార్వతమ్మ.

"మా అమ్మాయ్ చాలా బాగా పాడ్తుంది వదినా... ఏదీ... ఓపాట వినిపించవే...." పిచ్చుక మహాలక్ష్మి అంది.

పిచ్చుక వరలక్ష్మి గొంతు సవరించుకుని ఓ సినిమా పాట అందుకుని అపస్వరాలతో పాడడం మొదలుపెట్టింది.

"బావలు సయ్యా.... హాయ్! మరదలు సయ్యా... హాయ్! రింబోలా రింబోలా రింబో...లా"

"చాలు, చాలు... కంగారుగా అంటూ లేచి నిల్చున్నాడు పర్వతాలరావు. అతనితో బాటు పార్వతమ్మ, బుచ్చిబాబులు కూడా లేచి నిల్చున్నారు.

"అదేంటి బావగారూ లేచిపోయారేం... కూర్చోండి! లేటెస్టుగా రిలీజైన పాటల్ని కూడా మా అమ్మాయ్ పాడి వినిపిస్తుంది.

"వీల్లేదు... మేం వెళ్ళిపోవాలి! మేం ఏడుగంటల్లోగా ఇక్కడినుండి వెళ్ళిపోవాలనీ, లేకపోతే రాహువు మెడని కేతువు పిసుకుతాడని మా సిద్ధాంతి వెధవ చెప్పాడు.. మేం రెండు రోజుల తర్వాత ఏ విషయం చెప్తాం!" అంటూ హడావుడిగా బయటికి వచ్చేశాడు పర్వతాలరావు, బుచ్చిబాబూ, పార్వతమ్మ ఆయన్ని కంగారుగా అనుసరించారు.

                    *****

సాయంత్రం ఆరుగంటలు!.....

పార్కులో.....

బుచ్చిబాబు మాట్లాడ్తుండగానే సీత సిమెంటు బెంచిమీద నుండి దిగ్గున లేచింది.

"....ఏంటి సీహా లేచిపోయావ్?" అడిగాడు బుచ్చిబాబు.

"లేకపోతే నువ్వు చెప్పే చచ్చుకబుర్లు వింటూ కూర్చోమంటావ్?" పెళ్ళిచూపులకి వెళ్తాడంట పెళ్ళి చూపులకి!!.... వెళ్ళి ఆ రోడ్డురోలర్ నే చేస్కో...."

విసురుగా ముందుకు అడుగులు వేసింది సీత. బుచ్చిబాబు సిమెంటు బెంచి మీద నుండి ఒక్క గెంతు గెంతి సీత దారికి అడ్డుగా నిల్చున్నాడు.

"ఎందుకంత కోపం సిల్లీగా?.... ఆ అమ్మాయ్ మా నాన్నకేం నచ్చలేదుగా?! అన్నాడు బుచ్చిబాబు.

"అయితే నీకు నచ్చిందా!" కోపంగా చూస్తూ అడిగింది సీత.

"నువ్వుండగా నాకు వేరే అమ్మాయ్ నచ్చే ప్రసక్తే లేదు!... మా నాన్నకి నచ్చితేనే ప్రాబ్లెం అయి వుండేది!!"

"అంటే ఒకవేళ ఆ అమ్మాయే మీ నాన్నకి నచ్చివుంటే చేసుకోవడానికి సిద్ధపడిపోయి వుండేవాడివన్న మాట!!"

"అబ్బా....! సిల్లీగా వేరే అర్థాలు తియ్యకు. ఇప్పుడు నచ్చలేదని చెప్తున్నానుగా?... నచ్చితే ఏం చేసేవారన్న విషయం గురించి వాదిస్తావేం సిల్లీగా."

అంతలో పార్కులో పల్లీలు అమ్మే కుర్రాడు వాళ్ళిద్దరి మధ్యకి వచ్చాడు.

"సార్.. పల్లీలు కావాలా సార్?"

వాడిని వాళ్ళిద్దరు పట్టించుకోలేదు.

"అసలు నువ్వు పెళ్ళిచూపులకు ఎందుకెళ్ళావ్?" బుచ్చిబాబుని నిలదీసింది సీత.

"అమ్మా పల్లీలమ్మా!"

"మా నాన్నగారు పిల్లని చూడడానికి మేం వస్తాం అని వాళ్ళకి ముందుగానే మాటిచ్చారంట సిల్లీగా...."

"సార్.. గరం గరం పల్లీ సార్!"

"అయితే రేపొద్దున వేరేవాళ్ళకి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అని మాటిస్తారు!.... చేసేస్కుంటావా?"

"అమ్మా! పల్లీ తీస్కోమ్మా!..."

"అలాగే మీరిచ్చిన మాటతో నాకేం సంబంధంలేదు అని పెళ్ళిచూపులకి కూడా వెళ్ళకుండా వుండాల్సింది....."

"అమ్మా... వేడి వేడి పల్లీలమ్మా... తీస్కోమ్మా!"

సీతకి చిర్రెత్తుకొచ్చి పల్లీలమ్మే కుర్రాడి చెంప చెల్లుమనిపించింది.