సిల్లీ ఫెలో - 8

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 8

- మల్లిక్

 

ఆ కుర్రాడు రెండు క్షణాలు బిత్తరపోయి తర్వాత తేరుకుని "ఏంటో... పల్లీలు కావాలా అంటే కోపం తెచ్చుకున్న మహాతల్లిని ఈమెనే చూస్తున్నా..." అని లోలోపల గొణుక్కుంటూ, చెంప రుద్దుకుంటూ ముందుకెళ్ళాడు ఆ కుర్రాడు.

"నువ్వసలు ఆ పెళ్ళిచూపులకి వెళ్ళడమే నాకిష్టంలేదు!... అసలు నీ తిక్క ఇలాక్కాదు కుదిరేది... నేను మా ఆఫీసులో ఏ మారుమూలకో ట్రాన్స్ ఫర్ పెట్టుకుని ఈ ఊరొదిలి వెళ్ళిపోతా... అప్పుడు తెలుస్తుంది.

బుచ్చిబాబుని రెండు చేతుల్తో పక్కకి తోసి విసురుగా పార్కు గేటు వైపు అడుగులు వేసింది సీత.

"సీతా... నేను చెప్పేది విను సీతా...." బుచ్చిబాబు వెనక నుండి అరుస్తున్నాడు.

క్షణాల్లో సీత గేటుని చేరుకొని అక్కడ వున్న ఆటోని ఎక్కి వెళ్ళిపోయింది.

బుచ్చిబాబు వెర్రిమొహం వేసుకుని అలానే వుండిపోయాడు.

అప్పుడే చుడువా అమ్మేవాడు బుచ్చిబాబు దగ్గరికి వచ్చాడు.

"సార్... చుడువా తింటారా సార్?"

బుచ్చిబాబు వాడి పీకుచ్చుకుని "ఈ" అని గట్టిగా అరిచాడు.

"చుడువా తింటారా?" అని అడిగినందుకే అంత కోపం ఎందుకో వాడికి అర్థంకాక పాపం బిక్క చచ్చిపోయాడు.

*           *            *

బుచ్చిబాబుకి ఆఫీసు పనిమీద మనసు అస్సలు లగ్నం కావడం లేదు. క్రితంరోజు సీత అలా లేచి వెళ్ళిపోవడం అతనికి చాలా బాధగా అనిపించింది. సీతకి అంత కోపం ఎప్పుడూ రాలేదు.

"నిజమేమరి.... సీత పెళ్ళిచూపులంటూ వేరేవాళ్ళముందు కూర్చుంటే నాకు మాత్రం కోపం రాదా? అనుకున్నాడు బుచ్చిబాబు.

సీతతో మాట్లాడితే తప్ప అతనికి మనసు స్థిమితపడేలా లేదు.

రాస్తున్న ఫైలుని ప్రక్కన పెట్టి హెడ్ క్లర్క్ టేబుల్ మీద ఉన్న ఫోన్ దగ్గరికెళ్లి సీత పనిచేస్తున్న ఆఫీసు నెంబరు తిప్పాడు.

"హలో!...." అంది అవతలి నుండి ఓ మగకంఠం.

"హలో... సీతని ఓసారి పిలుస్తారా?" అడిగాడు బుచ్చిబాబు.

"మీ పేరు?..." అవతలి కంఠం అడిగింది.

బుచ్చిబాబుకి చిర్రెత్తుకొచ్చింది. "నాపేరు ఏమైతే వీడికెందుకు?.... సీతను పిలవొచ్చుకదా? అనుకున్నాడు.

"వల్లకాట్లో రామనాథం!.... " పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు.

"అలాగా... ఏం పని??" మళ్ళీ ప్రశ్నించింది అవతలి కంఠం.

బుచ్చిబాబుకి ఒళ్ళు మండిపోయింది. వాడు తప్పకుండా సీత బాస్ అయి వుంటాడు.

"చాలా కొంపలుమునిగే పనండీ... పిలుస్తారా?" అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ.

"ఓహో అలాగా... లైన్లో వుండండి!" అంది అవతలి కంఠం.

"రాములూ... సీతకి ఫోన్ వచ్చింది. రమ్మను" అని చెప్పడం బుచ్చిబాబుకి వినిపించింది.

"అవును. ఇందాక మీ పేరు వలకాట్లో రామనాథం అని చెప్పారు కదా.... మీ ఇంటి పేరు వల్లకాట్లో, అంటే మీదే కులమో నాకసలు అర్థం కావడం లేదు" బుచ్చిబాబుతో అంది అవతలి కంఠం.

"మాడా....? దిబ్బకులం! దిబ్బలోళ్ళు అంటారు మమ్మల్ని" పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు.

దిబ్బకులం!... వెరీ ఫన్నీ. అలాంటి కులం ఒకటి ఉందని నాకు ఈనాటి వరకూ తెలీదే!... ఆ... సీత వచ్చి.... మాట్లాడండి!"

రెండు క్షణాల తర్వాత సీత గొంతు "హలో...." అని ఎవరూ?" అంది.

"నేనే... బుచ్చిబాబుని!!" అన్నాడు బుచ్చిబాబు.

సీత అటునుండి "హలో.... హలో.... హలో... హలో...." అరిచి "డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది సార్ అని వాళ్ళ బాస్ తో అనడం వినిపించింది.