Rating:             Avg Rating:       403 Ratings (Avg 2.94)

సిల్లీ ఫెలో - 6

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 4

- మల్లిక్

 

"ఏంటా కాళ్ళీడ్చుకుంటూ నడవడం తింగరి వెధవలా... అదిగో... ఆ వచ్చేదే పిచ్చిక వారి ఇల్లు.... నువ్విలా కాళ్ళీడ్చుకుంటూ రావడం చూస్తే నీకిక్కడికి రావడం ఇష్టంలేదని అనుకుంటారు వాళ్ళు..." ధుమధుమలాడ్తూ అన్నాడు పర్వతాలరావు బుచ్చిబాబుతో.

"వాళ్ళు అనుకునేదేంటి సిల్లీగా .... నాకు నిజంగానే ఇష్టంలేదు...." నసుగుతూ అన్నాడు బుచ్చిబాబు.

"నివ్విలా అతిగా వాగావంటే నీ నోరు నొక్కుతా సన్నాసెదవా"

"తిట్టకండీ పాపం! ఒరేయ్ నువ్వెందుకురా ఆయన్ని అనవసరంగా రెచ్చగొడతావ్?" అంది పార్వతమ్మ.

పిచ్చికవారి ఇంటిని సమీపించగానే లోపలినుండి ఓ యువకుడు బయటికి పరిగెత్తుకుని వీళ్ళ ముగ్గురికి ఎదురొచ్చాడు.

"రండి... రండి... పెళ్ళికొడుకు మీరేనా?" అడిగాడు ఆ అబ్బాయ్ బుచ్చిబాబుని.

"కాదు నేను!" అన్నాడు పర్వతాలరావు గుర్రుగా చూస్తూ.

"హవ్వ!... హవ్వ!!" నోటిమీద చేత్తో కొట్టుకుంది పార్వతమ్మ.

"లేకపోతే ఏంటయ్యా... పెళ్ళికొడుకు నేనుకాదనీ... వాడనీ గుడ్దోడైనా చెప్తాడు. మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకసలు?"

ఆ అబ్బాయి బిత్తరపోయి చూశాడు.  

"నువ్వేం అనుకోకు బాబూ... ఆయన తీరే అంత!" అంది పార్వతమ్మ.

ఇంతలోకే పిల్లతండ్రి పిచ్చిక సుబ్బారావ్ ఇంట్లోంచి రయ్యిన బయటికి వస్తూ పర్వతాలు కాళ్ళమీద పడిపోయాడు.

"అబ్బో!... చాలా మర్యాదలు చేస్తున్నారు!" ముక్కున వేలేసుకుని సుబ్బారావు వంక అబ్బురపడిపోయి చూస్తూ అంది పార్వతమ్మ.

"సిల్లీ... హు!" అని మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు.

పిచ్చిక సుబ్బారావ్ మోకాళ్ళకి అంటిన మట్టి దులుపుకుంటూ గలగలా నవ్వేశాడు.

"హబ్బే! .... అదేం కాదమ్మా!!... హడావిడిలో గుమ్మం కొట్టుకుని బోర్లా పడిపోయా.. అంతే!" అన్నాడు.

"మీరు నిజంగా కాళ్ళమీద పడ్డారని అనుకోడానికి నేనేం వెర్రి వెధవని కాను బావగారూ!" నవ్వుతూ అన్నాడు పర్వతాలరావు.

"అదీ నిజమేననుకోండి... హి హి! లోపలికి రండి బావగారూ" అంటూ లోపలికి దారితీసాడు సుబ్బారావు.

వాళ్ళు అతనిని అనుసరిస్తూ లోపలికి వెళ్ళారు.

"కూర్చోండి బావగారు... కూర్చోండమ్మా.. కూర్చో బాబూ...." హడావిడిగా చిందులేస్తూ వాళ్ళతో అన్నాడు పిచ్చిక సుబ్బారావ్.

వాళ్ళు అక్కడున్న సోఫాల్లో కూర్చున్నారు.

"ఏమేవ్..." సుబ్బారావు లోపలికి చూస్తూ అరిచాడు. 

అతను అలా అరవగానే అతని భార్య, ఇద్దరు కొడుకులు బయటికి వచ్చారు.

"ఈమె నా భార్యండీ బావగారూ. పిచ్చికమహాలక్ష్మి. వీడు నా పెద్దకొడుకు పిచ్చిక రమేష్, వీడు నా చిన్న కొడుకు పిచ్చిక సురేష్..." వాళ్ళని పరిచయం చేసాడు.

వాళ్ళంతా నమస్కార ప్రతినమస్కారాలు చేసుకున్నారు.

"మీరు ప్రతిసారీ పిచ్చిక అని మీ ఇంటిపేరు చెప్పనక్కరలేదు లెండి... వట్టి పేరు చెప్తే చాలు" అన్నాడు పర్వతాలరావు.

"బావగారు భలే జోకులేస్తారు!" అంటూ భళ్ళున నవ్వాడు పిచ్చిక సుబ్బారావ్. అతని భార్య సుపుత్రులు ఘోల్లున నవ్వారు.

కాస్సేపు బుచ్చిబాబు ఉద్యోగం, జీతం ప్రమోషన్ అవకాశాల గురించీ, ఆ మాటా, ఈమాటా మాట్లాడిన తర్వాత స్వీట్లూ, హాటూ, పళ్ళూ అన్నీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు.

"అమ్మాయిని కూడా తీసుకురండి!" అన్నది పార్వతమ్మ.

"అలాగేనమ్మా..." అని మహాలక్ష్మితో "నువ్వు పిచ్చిక వరలక్ష్మిని తీసుకురా" అన్నాడు సుబ్బారావ్.

మహాలక్ష్మి లోపలికి వెళ్ళి ఓ ఏనుగులాంటి పిల్లని బయటికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయే పిచ్చిక వరలక్ష్మి అని ఆ ముగ్గురికీ అర్థం అయ్యింది.

"పిచ్చుకవారి అమ్మాయ్ పిడుగులా ఉందేంటి?" తల్లి చెవిలో గుసగుసలాడాడు బుచ్చిబాబు.

"అదే నేను చూస్తున్నా" తడారిపోయిన పెదాలను నాలుకతో తడుపుకుంటూ అంది పార్వతమ్మ.

"కూర్చోమ్మా!..." గుటకలు మింగుతూ పిచ్చుక వరలక్ష్మితో అన్నాడు పర్వతాలరావు.