Kommulu Vacchaayandi

Kommulu Vacchaayandi

-పద్మశ్రీ

*******************************

ఆవలిస్తూ చూసాడు. ఎదురుగా పాలవాడు నిలబడి వున్నాడు. అతని చేతిలో ఉన్న గిన్నెను వాడి ముందు చాపాడు. పాలవాడు పాలు పోస్తున్నాడు. ఆ పాలని చూడగానే నిద్రమత్తు కాస్తా వదిలిపోయింది అతనికి.

“ఏమిటయ్యా... పాలు ఇంత పలుచగా ఉన్నాయి”

“ఇకనుండి అంతే బాబయ్యా... పాలు ఇలాగే ఉంటాయి....”

“ఎందుకయ్య...” కోపంగా అన్నాడు.

“ఎందుకంటే ఏం చెప్పమంటారయ్యా... పదికిలో మీటర్ల దూరం వెళ్ళి ఈ పాలని తెస్తున్నాను కాబట్టి ఇకనుండి పాలు పాలుచగానే ఉంటాయి....” కూల్ గా చెప్పాడు.

“అంటే ఇంతకుముందు అయిదు కిలోమీటర్లే వెళ్ళి తెచ్చేవాడివా....” మంటగా అన్నాడు. "కాదండి.... అక్కడినుండే తెచ్చేవాడిని, కాకపోతే నిన్న పెట్రోల్ ధర పెరిగింది కదండి... అందుకే పాలు పలచబడ్డాయండి...”

“పెట్రోల్ ధర పెరిగితే పాలు పలచబడడమేమిట్రా...?” ఎపుడు మొహంతో అన్నాడు.

“అంటే నేను తీసుకువచ్చే పాలు గ్రామాల్లోనుండి వస్తాయి కదండీ... ఆ గ్రామాలు అన్నీ తిరిగిరావాలంటే బండ్లో పెట్రోలు పోయాలి కదండి... ఇకనుండి పెట్రోలుకి అదనంగా అయిదువంద లెక్కువవుతున్నాయని ఆ అయిదువందల నష్టాన్ని పూడ్చడానికి వారే పాలల్లో నీళ్ళు కలుపుకుని తీసుకువస్తున్నారండి...”

“ఆహా... మరి నువ్వు కూడా కలపకపోయావా...?” వ్యంగ్యంగా అన్నాడు.

“నేనెందుకు కలపడం లేదండీ... రోజూ కలిపేవాటికంటే ఎక్కువే కలిపానండి... అందుకే కదా ఈపాలు ఇంత పలుచగా ఉంటున్నాయి...” కూల్ గా చెప్పాడు.

“ఒరేయ్... పాలల్లో నీళ్ళు కలపడమే కాకుండా దాన్ని సమర్దిస్తావా...? అంతా ఖర్మ ఖర్మ.. ” పాలు తీసుకుని విసవిసా లోనికి వచ్చాడు. ఫ్రేషప్ అయ్యి అలా కూర్చున్నాడో లేదో... కూరగాయలు కావాలని వంటింట్లో నుండి హుకుం జారీ.... మరుక్షణం రోడ్డుపైన ఓ సంచితో ప్రత్యక్షం.

“ఏమయ్యా వంకాయలు కిలో ఎంత?”

“యాభై రూపాయలండి....!” తాను పొరపాటుగా విన్నాడేమో అనుకుని మళ్ళీ అడిగాడు.

“యాభై రూపాయలండి...!”

“వంకాయలు కిలో యాభై రూపాయలా... ఏం చెవిలో పువ్వు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా?” కోపంగా అన్నాడు.

“ఏమయ్యోయ్... కొంటె కొను లేకుంటే లే...! పెట్రోలు ధర పెరిగిందిగా అందుకే ఇరవై రూపాయలకి కిలో రేటు యాభై రూపాయలకి అయ్యిందన్న మాట...”

“ఏమయ్యా... పెట్రోలు ధర పెరిగింది రెండు రూపాయలే కదయ్యా... మీరేంటి ఏకంగా కిలో వంకాయలపై ముప్ఫై రూపాయలు పెంచారు...” ఏడుపు మొహంతో అడిగాడు.

“ట్రాన్స్ పోర్టు చార్జికలిపితే అంతే అవుతుంది... తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు... .” మరి కాసేపు అక్కడే ఉండి వాడ్ని ప్రశ్నలడిగితే నాలుగు తన్ని తగలేసేలా ఉన్నాడనిగ్రహించి అటుగావస్తున్న ఆటనరైతు బజార్వెళ్ళమని చెప్పి కూర్చున్నాడు. డిజిటల్ మీటర్ వేసి ఆటో స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు డ్రైవర్.

ఓ అయిదు నిమిషాల తర్వాత కళ్ళు గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది అతనికి.

“అయ్యబాబోయ్ నా కళ్ళు తిరుగుతున్నాయ్...” మొత్తుకున్నాడు.

ఆటో ఆపి డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు.

“అరె... అదేంటీ నువ్వు బాగానే కనిపిస్తున్నావే...” అంటూ చుట్టూ చూశాడు. అన్నీ బాగానే కనిపించాయి.

“ఇంతకీ మీరు దేన్ని చూసారు సార్...” అడిగాడు ఆటోవాలా.

“ఈ డిజిటల్ మీటర్ ని చూసాను..” పెద్దగా నవ్వాడు ఆటోవాలా.

“తిరిగింది మీ కళ్ళు కాదు సార్... మీటర్...”

“అయ్యబాబోయ్ అంత ఫాస్ట్ గా తిరుగుతుందేంటీ....?”

“డిజిటల్ మీటర్ కద్సార్.. అలాగే తిరుగుతుంది....”

“అదేంటయ్యా... సరిగ్గా కిలోమీటరు కూడా పోలేదు అప్పుడే ముప్ఫై రూపాయలు చూపిస్తోంది.. ” గుండె గుభేలుమంది అతనిది.

“డిజిటల్ మీటర్ కద్సార్ అలాగే చూపిస్తుంది...” కూల్ గా అన్నాడు ఆటోవాల.

“ఇది డిజిటల్ మీటర్ కాదు డిజిటల్ మోటారు... లేకపోతే కొద్ది దూరానికే ముప్ఫై రూపాయలా...?”

“పెట్రోలు ధర పెరిగింది కద్సార్... అందుకే ఆటోమేటిగ్గా మా మీటర్ స్పీడు కూడా పెరిగిపోయింది...”

ఒర్నాయనోయ్...” అంటూ గట్టిగా అరిచి దబ్ న కిందపడిపోయాడు. లీటర్ పెట్రోలు పై కేవలం రెండు రూపాయలు మాత్రమే పెరిగింది. కానీ దాని ప్రభావంతో మిగతా నిత్యావసర వస్తువులన్నింటికి ధరలు కొమ్ములు వచ్చాయి.

విమానానికి వాడే ఇంధనానికి పన్ను తగ్గించిన ప్రభుత్వం, మధ్య తరగతి మనుషుల జీవన గతిని అడ్డంగా నరికి వేస్తుంది. ఇలా రేట్లు పెంచుకుంటూ పోతూ.